Chiranjeevi: 'రోజులు మారాయి’ కోసం అమ్మ ఎంతో పట్టుబట్టింది

ABN, Publish Date - Oct 29 , 2024 | 03:19 PM

అమితాబ్‌ బచ్చన్‌ చిరంజీవి తల్లి అంజనా దేవికి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. చిరంజీవి సైతం అమితాబ్‌ పాదాలకు నమస్కారం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


"ఎన్నో అవార్డులు అందుకున్నప్పటికీ ఏఎన్నార్‌ జాతీయ అవార్డు (ANR National Award) విషయంలో నా భావోద్వేగం వేరు. నా వాళ్లు నన్ను గుర్తించి అవార్డు  ఇవ్వడం గొప్ప విషయంగా అనిపించింది. ఈ రోజున రచ్చ గెలిచి.. ఇంట గెలిచిన అనుభూతి కలిగింది’’ అని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో హిందీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా ఏఎన్నార్‌ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 

అంతకుముందు అమితాబ్‌ బచ్చన్‌ చిరంజీవి తల్లి అంజనా దేవికి (Anjana devi) కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. చిరంజీవి సైతం అమితాబ్‌ పాదాలకు నమస్కారం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అమ్మని (Anjana Devi) ముందు వరుసలో ఎందుకు కూర్చోబెట్టానంటే.. 

ఈ వేడుకలో అమ్మను ముందు వరసలో కూర్చోబెట్టడానికి ఓ కారణం ఉంది. అమ్మ ఏఎన్నార్‌కు పెద్ద అభిమాని. నేను ఆమె కడుపులో ఉన్నప్పుడు.. నిండు నెలలతో ఉన్న టైమ్‌లో నాన్నను ఓ కోరిక కోరింది. ఏఎన్నార్‌ ‘రోజులు మారాయి’ చూడాలి.. ప్రసవం అయితే బయటకు పంపరని పట్టుబట్టింది. దీంతో నాన్న జట్కా బండిలో సినిమాకి తీసుకెళ్తుండగా.. బండి తిరగబడింది. దీంతో నాన్న ఇంటికి వెళ్లిపోదామంటే ‘నేను సినిమాకు వెళ్లాల్సిందే’ అని అమ్మ పంతం పట్టి సినిమా చూసింది. నాగేశ్వరరావు అంటే అమ్మకు ఉన్న అంతటి అభిమానం.. ఆ రక్తం ద్వారా నాకు వచ్చిందేమో అనిపిస్తుంటుంది. నాకు ఆయన డ్యాన్సులంటే చాలా ఇష్టం. ఆయన పాటలొస్తే తనని అనుకరిస్తూ డ్యాన్సులు చేసేవాణ్ని. అలాంటి ఏఎన్నార్‌ నా గురించి గొప్పగా మాట్లాడారు. ‘నాకు ఎముకలున్నాయి.. చిరంజీవికి ఎముకలు లేవు అని ఓ సందర్భంలో ప్రశంసించారు. ‘నేను డ్యాన్సులకు ఆద్యుణ్ని. ఆ డ్యాన్సులకు స్పీడ్‌, గ్రేస్‌ పెంచింది చిరంజీవే. హీరోయిన్లతో చిరు డ్యాన్స్‌ వేస్తుంటే నేను ఆయన్నే చూస్తానని ఏయన్నార్‌ చెప్పారు. వారి కృషి ఫలితంగానే చిత్ర పరిశ్రమ ఇక్కడికి వచ్చింది. ఆ కృషి ఫలితాన్నే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ‘మెకానిక్‌ అల్లుడు’లో ఏఎన్నార్‌తో కలిసి నటించినప్పుడు ఆయన నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నా. తను నడిచే ఎన్‌సైక్లోపీచిడియా అనిపించేది. ఆయన నాకు పితృసమానులు. ఆయన కుటుంబం నా పట్ల చూపే ప్రేమకు నేనెప్పుడూ దాసుడినే. ఏఎన్నార్‌ పురస్కారం నాకు దక్కడం నా పూర్వ జన్మ సుకృతం. ఈ అవార్డు నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది. నా జీవితాంతం ఈ జ్ఞాపకాన్ని మనసులో పెట్టుకుంటాను’’ అని అన్నారు  



నాన్న పొగడ్త కోసం...

‘‘నా గురువు, స్ఫూర్తి అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా ఈ ఏఎన్నార్‌ జాతీయ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. పద్మభూషణ్‌ అవార్డు వచ్చినప్పుడు నాకు సినిమా పరిశ్రమ సన్మానం చేసింది. ఆ సమయంలో అమితాబ్‌ నా గురించి మాట్లాడుతూ ‘చిరంజీవి కింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ అన్నారు. ఆ మాటలు విన్నాక నాలో చిన్న వణుకు కనిపించింది. ఇండియన్‌ సినిమాకి బాద్‌షా, చక్రవర్తి అయిన ఆయన నుంచి ఆ మాటలు రావడమంటే ఎంత పెద్ద విషయమో కదా. అవి నాకెంతో స్ఫూర్తినిచ్చాయి. నా తొలి హిందీ సినిమా ‘ప్రతిబంధ్‌’ చేసినప్పుడు దాన్ని ముందు అమితాబ్‌కే చూపించా. ‘అద్భుతంగా చేశావు చిరంజీవి.. సమాజానికి అవసరమైన అర్థవంతమైన చిత్రమిది’ అని ప్రశంసించారు. నా విషయంలో నేను రచ్చ గెలిచి ఇప్పుడే ఇంట గెలిచానేమో అనిపిస్తుంది. నేను నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతున్న టైమ్‌లో.. మా నాన్న నా సినిమా చూసి ఎప్పుడైనా పొగుడుతారా అని ఎదురు చూసేవాణ్ణి. కానీ, ఆయనెప్పుడూ ప్రశంసించలేదు. అమ్మని అడిగితే.. లేదురా ఆయన నీ గురించి చాలా గొప్పగా పొగుడుతారు. కాకపోతే బిడ్డల ఎదుట వాళ్లను పొగిడితే అది వాళ్లకు ఆయుక్షీణం అందుకే పొగడను అని చెప్పేవారట. ఆరోజు అనిపించింది నేను ఎప్పుడో ఇంట గెలిచానని’’ అన్నారు.


 

Updated Date - Oct 29 , 2024 | 03:22 PM