HBD Allu Arjun: అల్లు టు మల్లూ- స్టైలిష్ టు ఐకాన్ స్టార్.. బన్నీ జర్నీ ఇది!
ABN, Publish Date - Apr 08 , 2024 | 04:52 PM
అల్లు అర్జున్ ఆ పేరు వింటే తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్ స్టార్ గుర్తుకొస్తాడు. మల్లూ అర్జున్ ఈ పేరు వింటే.. కేరళలో అభిమానులు ఊగిపోతారు. విమర్శలు, కామెంట్‌లతో కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు స్టైలిష్‌స్టార్, ఐకాన్ స్టార్ గా ఎదిగారు.
అల్లు అర్జున్ ఆ పేరు వింటే తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్ స్టార్ గుర్తుకొస్తాడు.(Allu Arjun)
మల్లూ అర్జున్ ఈ పేరు వింటే.. కేరళలో అభిమానులు ఊగిపోతారు.
విమర్శలు, కామెంట్‌లతో కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు స్టైలిష్‌స్టార్, ఐకాన్ స్టార్ గా ఎదిగారు.
90 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న తెలుగు సినిమాలో ఎవరికీ సాధ్యం కాని ఘనత ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. అగ్ర నిర్మాత తనయుడు మెగాస్టార్‌కు మేనల్లుడు అనే కేరాఫ్ ఉన్నా స్వతహాగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు బన్నీ. ‘ఆడా ఉంటా.. ఈడా ఉంటా’ అంటూ.. అటు క్లాస్ ఆడియన్స్‌ను, ఇటు మాస్ ఆడియన్స్ ను అలరిస్తున్నారు అల్లు అర్జున్ . నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర విషయాలు..
అల్లు అరవింద్ - నిర్మల దంపతులకు 1982 ఏప్రిల్ 8న జన్మించారు అల్లు అర్జున్. ప్రాథమిక విద్య అంతా చెన్నైలో జరిగింది. తాత రామలింగయ్య స్టార్ కమెడియన్, మామయ్య చిరంజీవి స్టార్ హీరో, తండ్రి స్టార్ ప్రొడ్యూసర్.. కావడంతో చిత్ర రంగంలో అడుగుపెట్టడం సులభమైంది. 2003లో ‘గంగోత్రి’ సినిమాతో దర్శకుడు రాఘవేంద్రరావు బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో కావడం అప్పటికే విజేత, స్వాతిముత్యంలో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించడమే కాకుండా చిరు నటించిన ‘డాడీ’లో డ్యాన్స్ చేసి మెప్పించడం వంటి అంశాలుబన్నీకి బాగా కలిసి వచ్చాయి. తొలి చిత్రం గంగోత్రి సూపర్ హిట్ అయింది. నటన పరంగా ఆయన్ను ఎవరూ విమర్శించలేదు కానీ లుక్ పరంగా విపరీతంగా ట్రోల్ చేశారు. అయినా బన్నీ ఎక్కడా నిరుత్సాహపడలేదు. తనను తాను మార్చుకున్నాడు. ‘ఆర్య’తో గట్టి సమాధానమిచ్చాడు.
Game Changer: రాజమండ్రికి రామ్‌చరణ్..
అతి తక్కువమందిలో ఒకరు..
గంగోత్రి, ఆర్య, బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ విజయం అందుకున్నాడు బన్ని. అలా తొలి మూడు చిత్రాలు విజయం సాధించిన అతి తక్కువ మంది హీరోలో బన్ని ఒకరు. తదుపరి వచ్చిన హ్యాపీ చిత్రం నిరాశపరచింది. దేశముదురుతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరోగా చరిత్ర సృష్టించాడు బన్నీ. ఆ తర్వాత పరుగుతో తన నటనను చూపించాడు. వరుడు, వేదం, బద్రీనాథ్, జులాయి, దువ్వాడ జగన్నాథం, రుద్రమదేవి లాంటి సినిమాలతో తనలోని భిన్నమైన కోణాన్ని బయటపెట్టాడు. ఫలానా సినిమాలో కైమాక్స్‌లో మీ పాత్ర చనిపోతుంది నటిస్తారా?’ అని ఏ స్టార్ హీరోనైనా అడిగితే నో అనే చెబుతారు. కానీ ‘వేదం’ కోసం బన్నీ ముందడుగేశాడు. ‘రుద్రమదేవి’ సినిమా చిక్కుల్లో ఉందని తెలుసుకున్న అర్జున్ పారితోషికం లేకుండా గోన గన్నారెడ్డి పాత్ర పోషించి సినిమాకు హైప్ తీసుకొచ్చారు. ఆ పాత్రతో ఆయనలో మరో యాంగిల్ బయటకు వచ్చింది.
దర్శకులు చెప్పేది ఇదే...
అల్లు అర్జున్ కి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ప్రాణం. అది 'డాడీ' చిత్రంలో చేసిన డాన్స్ రీల్‌తో తెలిసింది. ఆయన రూమ్‌లో కేవలం ఇద్దరు ఫోటోలు మాత్రమే ఉంటాయని, ఒకటి మైకేల్ జాక్సన్‌ది, మరొకటి చిరంజీవిది, వాళ్లిద్దరినీ చూస్తూ తాను డ్యాన్స్ నేర్చుకున్నానని ఆయన పలు ఇంటర్వ్యూలో చెప్పారు. బన్ని ప్రతి పాటలోనూ ఓ సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది. సినిమా కోసం బన్నీలా కష్టపడేంత నటులు ఈ రోజుల్లో అరుదని దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ చెబుతుంటారు. అందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాది పాటు చిత్తూరు యాసను అల్లు అర్జున్ సాధన చేశారు. ‘బద్రినాథ్’ సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్థం నేర్చుకున్నారు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు.
ఎక్కడా తక్కువ చేయలేదు..
మెగా కాంపౌండ్ హీరో నుంచి తన సొంత కష్టంతో అల్లు వారి హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని 'AA’ ఓ బ్రాండ్‌గా క్రియేట్ చేసారు. ఎన్నడూ మెగా అభిమానులను తక్కువ చేయలేదు. అల్లు అర్జున్‌కి మలయాళంలో వినరీతమైన అభిమానగణం ఉంది. అక్కడ ఆయన్ను మల్లూ అర్జున్ అని పిలుచుకుంటారు. గతంలో కానీ, ప్రస్తుతం కానీ.. ఏ హీరోకి లేని క్రేజ్ మలయాళంలో బన్నీ సొంతమైంది.
‘పుష్ప’తో అన్నీ కలిసొచ్చాయి...
పుష్ప చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యారు బన్నీ. అక్కడి నుంచి ఆయన ఐకాన్ స్టార్ అయిపోయారు. అంతే కాదు ఈ చిత్రంతో ఉన్నత ఘనత సాధించారు. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఎవరూ సాధించలేని ఘనతను బన్ని సాధించారు. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకుని చరిత్ర సృష్టించారు. అలాగే ఈ ఏడాది మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ 'తగ్గేదేలే’ పోజ్‌తో మైనం బొమ్మను నెలకొల్పారు.
అభిమానులే ఆస్తి...
సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్న కుటుంబానికి ఇవ్వాల్సిన స్పేస్‌ను తప్పకుండా ఇస్తారు బన్నీ. వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. వీలు కల్పించుకుని భార్య పిల్లలతో గడిపేందుకు సమయాన్ని కేటాయిస్తారు. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదే అని చెబుతుంటారు. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది నా జీవితంలో నేను సాధించిన అతి పెద్ద ఆస్తి అభిమానులే’’ అని బన్నీ తరచూ చెబుతుంటారు.