ANR: మృత్యువు మీద సాధించిన విజయమే

ABN, Publish Date - Sep 20 , 2024 | 03:25 PM

కొన్ని దశాబ్దాలుగా కేవలం 35 శాతమే పనిచే సే గుండెతో (ANR Heart problem) అక్కినేని 90 ఏళ్లు జీవించారు. ఆ స్థితిలో అంత కాలం జీవించిన వాళ్లు ప్రపంచంలోనే చాలా అరుదు.

కొన్ని దశాబ్దాలుగా కేవలం 35 శాతమే పనిచే సే గుండెతో (ANR Heart problem) అక్కినేని 90 ఏళ్లు జీవించారు. ఆ స్థితిలో అంత కాలం జీవించిన వాళ్లు ప్రపంచంలోనే చాలా అరుదు. ఒక రకంగా, ఇన్ని దశాబ్దాల పాటు అలా జీవించిన ఆయన మృత్యువు మీద సాధించిన విజయమే. ఏనాడూ ఎవరినీ పరుషంగా విమర్శించని  అక్కినేనిని సినీ పరిశ్రమలో ఒక అజాత  శత్రువే అనుకోవచ్చు. రెండు సార్లు గుండెకు బైపాస్‌ సర్జరీ జరిగినా, చెక్కుచెద రని ఆయన శారీరక దారుఢ్యం గురించిన తెలిసిన వారంతా  ఆయనను ఏ జబ్బయినా ఏమీ చేయలేద న్న గంపెడు నమ్మకంతో ఉండిపోయారు. కానీ క్యాన్సర్‌ వచ్చి కబళించడంతో అక్కినేని వెళ్లిపోక తప్పలేదు

కలల సౌథం..

ఎటు పక్క చూసినా రాళ్ల గుట్టలు తప్ప మరేమీ కనిపించని ప్రదేశంలో ఓ అద్భుత సౌథాన్ని నిర్మించడం జానపద కథల్లోనే మాత్రమే సాధ్యం. అటువంటి అసాధ్యాన్ని పట్టుదలతో సుసాధ్యం చేశారు డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు. తన పిల్లల చదువుకోసం, వారి భవిష్యత్‌ కోసం ఆనాటి మదరాసు నగరాన్ని వదిలిపెట్టి హైదరాబాద్‌ కి చేరుకున్న అక్కినేని స్టూడియో నిర్మించాలనే ఆలోచన మొదట్లో లేదు. అయితే అంజలీ పిక్చర్స్‌ అధినేత ఆదినారాయణరావు అక్కినేనితో ‘మహాకవి క్షేత్రయ్య’ సినిమా నిర్మిస్తూ సారథి స్టూడియో వారిని ఫ్లోర్‌ గురించి అడిగితే ఏవో మనసులో పెట్టుకుని స్టూడియో ఇవ్వం పొమ్మన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మదరాసు వెళ్లి షూటింగ్‌ చెయ్యడం తప్ప మరో మార్గం లేదు. అయితే ఔట్‌డోర్‌ షూటింగ్‌ తప్ప మద్రాసు స్టూడియో పనిచేయకూడదని తను ముందే నిర్ణయం తీసుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో  బెంగళూరుకి వెళ్లి అక్కడి స్టూడియోల్లో ‘మహాకవి క్షేత్రయ్య’ షూటింగ్‌లో పాల్గొన్నారు అక్కినేని. అప్పుడే ఇతరుల మీద ఆధారపడకుండా హైదరాబాద్‌లో సొంతంగా ఒక స్టూడియోని నిర్మించాలని మనసులో గట్టిగా తీర్మానించుకున్నారాయన. ఆ తీర్మానానికి అద్భుత రూపమే అన్నపూర్ణ స్టూడియో. 1976 జనవరి 14న ప్రారంభమైన అన్నపూర్ణ స్టూడియో ‘సెక్రటరీ’ చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాతి కాలంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల నిర్మాణానికి వేదికగా నిలిచింది స్టూడియో. ఒక దశలో స్డూడియో నిర్వహణ భారంగా మారడంతో నిర్మాతగా మారి సినిమాలు నిర్మించి దానిని నిలబెట్టారు అక్కినేని. ముఖ్యంగా ‘ప్రేమాభిషేకం’ చారిత్రక  విజయం స్టూడియోకి బలమైన ఊతాన్నిచ్చింది. అక్కినేని నాగేశ్వరరావునీ, అన్న పూర్ణ స్టూడియోస్‌ని వేరు చేసి మాట్లాడటం కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఆయన మానసపుత్రిక. స్టూడియోలోని ప్రతి మొక్కనీ ఆయన దగ్గరు నుండి పెంచారు. షూటింగ్‌ ఉన్నా లేకపోయినా ప్రతి రోజూ స్టూడియోకి వెళ్లడం ఆయనకి అలవాటు. స్టూడియోలో ఆయన కోసం ప్రత్యేకంగా ఓ రాతి బెంచీ ఉంది. అందులో ఇతరులెవరూ కూర్చోకుండా స్టూడియో సిబ్బంది కాపాలా కాసేవారు. ప్రతి సంవత్సరం జనవరి 14న స్టూడియోకి వచ్చి, వర్కర్స్‌తో ఆత్మీయ సమావేశం నిర్వహించడం ఆ రోజుల్లో  అక్కినేనికి అలవాటు. చివరి రోజుల్లో కాన్సర్‌ కారణంగా బయటకి ఎక్కడకి వెళ్లకుండా ఇంటికే పరిమితమైన పరిస్థితుల్లో కూడా వీల్‌ ఛెయిర్‌లో స్టూడియోకి వర్కర్స్‌తో అక్కినేని గడపడం స్టూడియోపై ఆయనకున్న మమకారానికి నిదర్శనం. ఈ సందర్భంగా స్టూడియోని కలయజూసుకుని జ్ఞాపకాలను వర్కర్స్‌తో పంచుకున్నారు.

Updated Date - Sep 20 , 2024 | 03:25 PM