నేను రిస్కులు తీసుకుంటాను, నా మనసుకి నచ్చింది చేస్తాను: వీకే నరేష్
ABN, Publish Date - Jan 20 , 2024 | 09:36 AM
సీనియర్ నటుడు వీకేనరేష్ సినీ ప్రస్థానం ప్రారంభించి ఏభై ఏళ్ళు అయింది, ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి విషయాలు, జరిగిన సంఘటనలు, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేరు
విజయనిర్మల కుమారుడు వీకే నరేష్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేశారు. అలాగే జనవరి 20 అతని పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా అతను తన వ్యక్తిగత, రాజకీయ, సినీ అనుభవాలని మీడియాతో ముచ్చటించారు. తన తొమ్మిదవ సంవత్సరం 'పండంటి కాపురం' సినిమా ద్వారా పరిశ్రమకి పరిచయం అయ్యాను అని చెప్పారు. బాలనటులుగా వచ్చినవారు కథానాయకులుగా విజయం సాధించలేరు అని అంటూ ఉండేవారు. ఆ క్రమంలో ఒక్క సినిమా చేస్తే చాలు అను పరిశ్రమలోకి అడుగు పెట్టాను అని చెప్పారు నరేష్. (VK Naresh completed 50 years as an actor)
"ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిందల్లా కృష్ణ గారు, అమ్మ విజయనిర్మల గారి మేకప్ రూమ్, పొద్దున్నే మద్రాస్ లో వచ్చి కలిసే ప్రజలు, స్టూడియో వాతావణం. ఇలా ఇవి చూస్తూనే పెరిగాను, ఇదే నా జీవితం కావాలని కోరుకున్నాను. 9వ యేట 'పండంటి కాపురం' లాంటి అద్భుతమైన చిత్రంతో ఆరంగేట్రం చేశాను. అయితే బాల నటులుగా వచ్చిన వాళ్ళు హీరోలుగా సక్సెస్ కారని చెబుతుంటారు. ఈ భయం నాకు వుండేది. దాని గురించి పెద్దగా అలోచించలేదు. ఒక్క సినిమా హీరోగా నటిస్తే చాలని అనుకున్నాను. అనుకోకుండా, అమ్మగారి ప్రేమ సంకెళ్ళు, జంధ్యాల గారి 'నాలుగు నాలుగు స్తంభాలాట;, ఇలా రెండు సినిమాలు వచ్చాయి. నాలుగు స్తంభాలాటతో నాకు అద్భుతమైన కెరీర్ స్టార్ట్ అయ్యింది. నా ఫస్ట్ ఇన్నింగ్స్ లో జంధ్యాల గారు, అమ్మ(విజయనిర్మల), విశ్వనాథ్ గారు, బాపు గారు, రమణ గారు, ఈవీవీ సత్యనారాయణ గారు, వంశీ గారు, రేలంగి నరసింహరావు గారు లాంటి మహనీయులతో కలసి పని చేసే అదృష్టం దొరికింది. వీరందరూ నా విజయానికి పునాది వేశారు. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను," అని చెప్పారు నరేష్. (VK Naresh talks about his 50 year film journey)
ఒక మంచి నటుడు కావాలని పరిశ్రమలోకి వచ్చాను, అలాగే నేను చేసే ప్రతి పాత్రలో కొత్తదనం కోసం ప్రయత్నించాను. ఆ క్రమంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించాను. అలాగే నేను రాజీపడి సినిమాలు చేయడం ఇష్టం లేదు. మంచి విజయాలు అందుకున్నప్పటికీ నేను అనుకున్న సినిమాలు చేయలేకపోతున్నాననే ఒక చిన్న నిరాశతోనే తొలి ఇన్నింగ్స్ పూర్తయింది," అని చెప్పారు నరేష్.
అలాగే తాను రీల్, నిజ జీవితంలో (రియల్ లైఫ్) కొంచెం అడ్వెంచరస్ పర్శన్ ని. రిస్కులు తీసుకుంటాను, నా మనసుకి నచ్చింది చేస్తాను, అని చెప్పారు. రాజకీయాల్లో పని చేశాను, తర్వాత సోషల్ సర్విస్ లోకి వచ్చాను. ఈ క్రమంలో దాదాపు పదేళ్ళు పాటు పరిశ్రమకి దూరమయ్యాను అని చెప్పుకొచ్చారు. రెండో ఇన్నింగ్స్ లో వైవిధ్యమైన పాత్రలు వచ్చినపుడు ఎస్వీ రంగారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని చేశాను. పరిశ్రమలో ఓర్పు, క్రమ శిక్షణ చాలా అవసరం. ఇవి మా అమ్మగారి నుంచి నేర్చుకున్నాను అని చెపుతూ సెకండ్ ఇన్నింగ్స్ లో మీ శ్రేయోభిలాషి , గుంటూరు టాకీస్. అ ఆ, దృశ్యం చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు రావడంతో పరిశ్రమలో కొత్త మెరుగు వచ్చింది అని చెప్పారు.
ఒక నటుడు పరిశ్రమలో పదేళ్ళు ఉండటమే గొప్ప, కానీ తాను 50 ఏళ్లు పరిశ్రమలో గడపడం ఆనందంగా వుంది అని చెప్పారు. గత ఏడాది 'సామజవరగమన' చాలా మంచి బూస్ట్ ఇచ్చింది. లీడ్ రోల్ లో చేసిన 'మళ్ళీ పెళ్లి' తో పాటు ఓటీటీలో చేసిన 'ఇంటింటి రామాయణం', 'మాయాబజార్' మంచి విజయాలు సాధించాయి. ఇన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకొని విజయవంతంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని చెప్పారు నరేష్. ఒక నటుడిగా ఎలాంటి పాత్రలు చేయాలని అనుకున్నానో దానికి మించిన పాత్రలు వస్తున్నాయి. కోవిడ్ తర్వాత పెద్ద మార్పు వచ్చింది. నేను అన్ని తరాలతో కలసి పనిచెయ్యడం నా అదృష్టం. అలాగే కొన్ని గౌరవాలు కూడా దక్కాయి, యునైటెడ్ నేషన్స్ 'సర్' నైట్ వుడ్ తో సత్కరించడం ఒక అరుదైన గౌరవం. ఇన్ని విజయాలతో పాటు ఇన్ని గౌరవాలు దక్కడం ఒక నటుడికి అరుదుగా జరుగుతుంది. ఇదంతా ప్రేక్షకులు ప్రేమామాభిమానాల వలనే సాధ్యపడింది, అని చెప్పారు నరేష్.
కృష్ణ గారు, విజయనిర్మల గారు వున్నప్పుడు ఇల్లు ఒక పండగలా వుండేది. కృష్ణ గారు, విజయనిర్మలగారు, ఇందిరమ్మ గారు, రమేష్ ఇంతమంది వెళ్ళిపోవడం అనేది దాదాపుగా ఒక డిప్రెషన్ కి తీసుకెళ్ళింది. ఏదేమైనా వాళ్ళ ఆశీస్సులు ఉంటాయని ఎప్పుడూ నమ్ముతాను. వాళ్ళ ఆశయాలని ముందుకు తీసుకువెళతాం. అయితే ఈ సక్సెస్ ని వాళ్ళు చూడలేకపోతున్నారనే బాధ మాత్రం మనసులో వుంటుంది. వాళ్ళని చాలా మిస్ అవుతున్నాం, వారు లేని లోటు ఎప్పటికీ వుంటుంది అని చెప్పారు నరేష్.