Chiluka Radha: సీనియర్‌ నటి ‘చిలుక’ రాధ జీవిత పుస్తకంలో కొన్ని అధ్యాయాలు

ABN, Publish Date - Jul 06 , 2024 | 07:37 PM

సినీరంగంలో తమ అద్భుత నటనా పటిమతో పేరు ప్రతిష్ఠలు సంపాదించుకొన్నవారు, సంపాదించుకుంటున్నవారు ఎంతో మంది ఉన్నారు. నటీమణులు కూడా అనేక పాత్రలకు జీవిం పోస్తున్నారు. అయితే కొందరు మాత్రమే తాము నటించిన పాత్ర పేరుతో లేక సినిమా పేరుతో ప్రసిద్ధులయ్యారు, అవుతున్నారు. అలాంటి వారిలో ‘చిలుక’ రాధ ఒకరు. ఆమె తన తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పుకొచ్చారు.

Chiluka Radha Interview

సినీరంగంలో తమ అద్భుత నటనా పటిమతో పేరు ప్రతిష్ఠలు సంపాదించుకొన్నవారు, సంపాదించుకుంటున్నవారు ఎంతో మంది ఉన్నారు. నటీమణులు కూడా అనేక పాత్రలకు జీవిం పోస్తున్నారు. అయితే కొందరు మాత్రమే తాము నటించిన పాత్ర పేరుతో లేక సినిమా పేరుతో ప్రసిద్ధులయ్యారు, అవుతున్నారు. అలాంటి వారిలో ‘చిలుక’ రాధ ఒకరు. తను నటించిన సినిమాలోని ‘చిలుక’ పేరుతో వ్యాప్తిలోకి వచ్చిన నటి ‘చిలుక’ రాధ. ఆమె సకల కళల సమాహారం. బాల్యంలోనే ‘హరికథలు’ చెప్పే ప్రౌఢగా పరిణామం. వారసత్వంగా వచ్చిన సంగీతంతో గానం చేయగల ప్రతిభా సంపద. వీణ, గిటార్‌ వాయిద్యాల్లో ప్రావీణ్యం. నాటక రంగంలో విశేషానుభవం. సినీ రంగంలో ఎన్నో చిత్రాల్లో నటనానుభవం. టీవీ సీరియల్స్‌లో పాత్రల్లో పరకాయ ప్రవేశం. డబ్బింగ్‌ కళాకారిణిగా గాత్ర దానం... వెరసి అనూరాధ ఉరఫ్‌ ‘చిలుక’ రాధ. ఆమె జీవిత పుస్తకంలో కొన్ని అధ్యాయాలు... (Chiluka Radha Interview)

Also Read- Kalki 2898AD: దర్శకుడు నాగ్ అశ్విన్ అది ఒప్పేసుకున్నాడు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జన్మించారు అనూరాధ. ఆమె తండ్రి మునుకుట్ల నారాయణమూర్తి హరికథలు చెప్పేవారు. తల్లి కృష్ణవేణి గృహిణి. అనూరాధ విద్యాభ్యాసం తణుకులోనే జరిగింది. అనూరాధకు హరికథలు చెప్పడం తండ్రి నుంచి సంక్రమించిన కళ. 9వ ఏట నుండే ఆమె హరికథలు చెప్పడం ప్రారంభించారు. ఆదిభట్ల నారాయణదాసు విరచిత రామాయణం హరికథను 200 చోట్ల ఆమె ప్రదర్శించిన తీరు అద్భుతం. అంతేకాదు, ‘సీతా కల్యాణం’పై 2,000 హరికథలు చెప్పడం ఆమె హరికథా కథన నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం.


వెండితెరపై వెలుగు..

‘కురుక్షేత్రంలో సీత’ అనే సినిమాతో అనూరాధ వెండి తెర ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ‘చిలుక జోస్యం’ సినిమాలో అనూరాధ పోషించిన పాత్ర పేరు ‘చిలుక’. ఆ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందడమే కాక అనూరాధకు ఎంతో పేరు సంపాదించి పెట్టింది. అప్పటి నుండి ఆమెను అందరూ ‘చిలుక రాధ’గా పిలవడం ప్రారంభించడంతో అదే పేరు ఆమెకు స్థిరపడింది. దాదాపు వంద సినిమాల్లో ఆమె నటించారు. ‘గోపాలకృష్ణుడు’ సినిమాలో ఆమె అక్కినేని నాగేశ్వరరావుతో నటించారు. హాస్యనటిగా అల్లురామలింగయ్య, పద్మనాభం, రాజబాబు, గొల్లపూడి మారుతీరావు మొదలైన నటులతో నటించి ఘనతకెక్కారు. ‘ఊరంతా సంక్రాంతి’, ‘ముద్దుల మామయ్య’, ‘చిలిపి దంపతులు’, ‘సువర్ణ సుందరి’ (కొత్త చిత్రం), ‘మా పల్లెలో గోపాలుడు’ మొదలైన చిత్రాల్లో హాస్యపాత్రలతో ప్రేక్షకులనలరించారు. 40 తమిళ సినిమాలలో ‘చిలుక రాధ’ నటిగా తన పాత్రలకు జీవం పోశారు.

సకల కళా వల్లభురాలు..

తాత, పెద తండ్రి, తండ్రి తదితర కుటుంబ సభ్యుల నుంచి అనూరాధ అందిపుచ్చుకొన్న కళ సంగీతం. వారే ఆమె గురువులు. శ్రావ్యమైన కంఠంతో చిన్నతనంలోనే ఎన్నో కచేరీలు చేశారు అనూరాధ. వీణా వాద్యంలో కూడా ఆసక్తి కలిగిన ఆమె ఐదేళ్ల పాటు వీణ నేర్చుకున్నారు. అంతేకాదు, ‘గిటారు’ తంత్రులు మీటడంలో కూడా అనుభవం సంపాదించారు. అనూరాధ భరతనాట్య కళాకారిణి కూడా. అయిదు సంవత్సరాలు సప్పా సత్యనారాయణ వద్ద భరతనాట్యం అభ్యసించారు. నటీమణులు జయప్రద, జరీనా వహాబ్‌ భరత నాట్యంలో ఆమె సహోధ్యాయినులు. జరీనాతో కలసి అనూరాధ పలు భరత నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. అనూరాధకు బాల్యం నుంచి నటనపై ఆసక్తి. ఎన్నో నాటకాలు వేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. చెన్నైలో స్థిరపడిన తరువాత నటనకు స్వస్తి చెప్పలేదు. మహాకవి ఆత్రేయ పుట్టినరోజున ‘ఈనాడు’ అనే నాటకంలో నాయికగా పాత్ర పోషించి అభినందనలందుకున్నారు.

ద్విభాషల్లో సీరియల్స్‌..

‘చిలుక’ రాధ 30కి పైగా తమిళ సీరియళ్లలో నటించారు. ఈటీవీ తెలుగులో సుమారు 15 సీరియళ్లలో నటించడమే కాకుండా కొన్నిటికి దర్శకత్వం కూడా వహించారు. జెమిని టీవీ సీరియల్స్‌లో కొన్ని భాగాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. చిలుక రాధ ఇంగ్లీషు, కొరియన్‌, చైనీస్‌ సినిమాలకి, వెబ్‌ సిరీస్‌కి డబ్బింగ్‌ కళాకారిణిగా గాత్ర దానం చేశారు. అనూరాధ భర్త పేరు ‘కర్ణ’. ‘జట్కా సీను’గా ప్రసిద్ధులు. పలు తెలుగు, తమిళ సినిమాలు, సీరియళ్లలో ఆయన నటించారు. ఈ దంపతులకు ఒక కుమార్తె. ప్రస్తుతం ‘చిలుక’ రాధ డబ్బింగ్‌ కళాకారిణిగా కొనసాగుతున్నారు. మంచి పాత్ర వస్తే సినిమాల్లోను, సీరియళ్లలోను నటించాలని సంకల్పం. ఎప్పటికైనా ఒక ఉత్తమ చిత్రానికి దర్శకత్వం వహించాలన్నది ఆమె కోరిక.

‘స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజ వెయ్యాలి. స్వతంత్రంగా జీవించగలిగే అర్హత సంపాదించుకోవాలి. ధైర్యంగా నిలబడాలి. స్త్రీ తన జీవితంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఇతరులపై ఆధారపడకుండా తన స్వశక్తితో జీవించే సామర్ధ్యాన్ని అలవరచుకోవాలి-సాధికారత సాధించాలి’’ అంటూ ‘చిలుక’ రాధగా పేరుపొందిన అనూరాధ తరుణితో తన అనుభవాలు పంచుకున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 06 , 2024 | 07:37 PM