చిరంజీవి, రామ్‌చరణ్‌లతో మల్టీస్టారర్.. కథ రెడీ: దర్శకుడు
ABN, Publish Date - Nov 26 , 2024 | 09:07 PM
చిరంజీవి, రామ్‌చరణ్‌లతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలి.. అది నా అల్టీమేట్ గోల్. దాని కోసం నేను కష్టపడతా. వాళ్లిద్దరి కోసం నా దగ్గర కథ కూడా రెడీగా ఉందని అన్నారు ‘రోటి కపడా రొమాన్స్’ దర్శకుడు. ‘రోటి కపడా రొమాన్స్’ విడుదలకు సిద్ధమవగా.. మీడియాతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం అన్నారంటే..
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి తొలి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ ఎలాగో నాకూ ‘రోటి కపడా రొమాన్స్’ చిత్రం అలానే అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు విక్రమ్ రెడ్డి. ‘స్టూడెంట్ నెం.1’ సినిమా తర్వాత ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ వంటి సినిమాలతో రాజమౌళి ఎలా అయితే అద్భుతాలు సృష్టించాడో.. భవిష్యత్‌లో నేను కూడా అలాంటి అద్భుతాలే సృష్టిస్తానని అంటున్నారు. అలాంటి కథలు నా దగ్గర కూడా ఉన్నాయి. కానీ తొలి చిత్ర దర్శకుడికి నిలబడే ఛాన్స్ ఇవ్వండి.. చిన్న సినిమాలకు కాస్త స్పేస్ ఇవ్వండి. ఇక్కడి సినిమాలకు అవకాశం ఇవ్వండి.. ఏ సినిమాలు లేక ఇప్పటికీ ‘అమరన్’ సినిమానే ఇక్కడ ఆడుతుంది. మన సినిమాలు అక్కడ పట్టించుకోరు. ముందు మన సినిమాను బ్రతికించుకోండి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు విక్రమ్‌రెడ్డి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.
మీ నేపథ్యం గురించి..
నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. నేను సినీ రంగంలోకి రావడానికి కారణం మా అమ్మ. ఆమె నాకు స్ఫూర్తి. ప్రతి శుక్రవారం విడుదలైన ప్రతి సినిమా తన లేడీ గ్యాంగ్‌తో కలిసి చూసేది. అమ్మతో పాటు నేను కూడా వెళ్లేవాడిని. అలా నాకు తెలియకుండానే సినిమాపై ఇష్టం ఏర్పడింది. ఇక ఎలాగైనా సినిమా రంగంలోకి వెళ్లాలని ఫిక్సయ్యా. దర్శకుడు తేజ ‘చిత్రం’ సినిమా పోస్టర్‌పై ఆయన పేరు చూసిన తరువాత దర్శకుడిని అవ్వాలని నిర్ణయించుకున్నా. ఆ తరువాత సినిమా రంగంలోకి రావడానికి చాలా ప్రయత్నించాను. ఎవరి దగ్గరనైనా అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ కావాలని అనుకుని ప్రయత్నించాను కానీ కుదరలేదు. కానీ పూరి జగన్నాథ్ ఇచ్చిన సలహాతో అసిస్టెంట్‌గా చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకుని.. సినిమాలు చూడటం మొదలుపెట్టి.. సినిమాలు చూడటమే పనిగా అనుకుని సినిమాలోని అన్ని క్రాఫ్ట్‌లపై గ్రిప్ వచ్చిన తర్వాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆ తర్వాత నేను చెప్పిన కథ బెక్కం వేణుగోపాల్‌కు నచ్చి ఈ రోజు దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాను.
‘రోటి కపడా రొమాన్స్’ ఏ తరహా చిత్రం?
ఇదొక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, కామెడీ, ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు ప్రేమకథలు ఉంటాయి. నలుగురు అబ్బాయిల లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తరువాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? లవ్ బ్రేకప్ తర్వాత వాళ్ల రియలైజేషన్ ఏమిటి అనేది సినిమా. అన్ని ఎమోషన్స్ మిక్సై ఉన్న పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్ ఇది. సినిమాలోని పతాక సన్నివేశాలు పదిహేను నిమిషాలు అందరి హృదయాలకు హత్తుకుంటాయి. అందరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు.
కథలో ఏమైనా మార్పులు చేశారా?
ఫస్ట్ ఈ సినిమా దిల్ రాజు చేద్దామని అనుకున్నారు. అయితే ఆయన కథలో మార్పులు చేయమని అడిగారు. ఆ మార్పుల వల్ల నా కథకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఒప్పుకోలేదు. ఇక ఆ తరువాత కూడా కథలో నేను ఎలాంటి మార్పులు చేయలేదు.
దిల్ రాజు లాంటి నిర్మాతను కాదని సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?
తప్పు అయినా ఒప్పు అయినా అది నేనే చేయాలి. నేను ఏదో ఒక విధంగా ఏదో ఒక సినిమాతో దర్శకుడిని అయిపోవాలి అనుకునే తత్వం నాది కాదు. నా కథకు నేనే క్రిటిక్‌ని. కథపై నాకున్న నమ్మకం అలాంటిది. ఈ విషయాన్ని దిల్ రాజుగారు కూడా స్వాగతించారు. అంతే కాదు నా చిత్రానికి ‘రోటి కపడా రొమాన్స్’ అనే టైటిల్ కూడా ఆయనే పెట్టారు.
మీ మీద మీకు అంతా కాన్ఫిడెన్స్ ఏమిటి?
నా కథలు చాలా పెద్దవి. నా కెరీర్‌లో బెస్ట్ సినిమా ఊహించుకుని నా కెరీర్‌ను స్టార్ చేశాను. చిరంజీవి, రామ్‌చరణ్‌లతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలి.. అది నా అల్టీమేట్ గోల్. దాని కోసం నేను కష్టపడతా. వాళ్లిద్దరి కోసం నా దగ్గర కథ కూడా రెడీగా ఉంది.
ఈ సినిమా కథకు రియల్ లైఫ్ సంఘటనలు ఏమైనా ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాయా?
ఈ సినిమాకు సంబంధించి నాకళ్ల ముందు చూసినవి.. నా ఫ్రెండ్స్ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలే స్ఫూర్తి. ఇందులో వున్న నాలుగు విభిన్న ప్రేమకథలు చేయడం చాలా కష్టం ఇలాంటి సినిమాలు చేసినప్పుడే దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. ఈ సినిమా ఆల్‌రెడీ చూసిన వాళ్లంతా ఓ కొత్త దర్శకుడిలా సినిమా తీయలేదు అని అభినందించారు.
Also Read-Akkineni Family: ఒకవైపు నాగచైతన్య పెళ్లి.. మరో వైపు అఖిల్ నిశ్చితార్థం
రొమాన్స్ ఎక్కువ ఉందని సెన్సారు వాళ్లు ఏ సర్టిఫికెట్ ఇచ్చారా?
ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా నేచురల్‌గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఉన్నది ఉన్నట్లుగా ఉంటాయి. అప్పుడే సినిమాకు ఆ వైబ్ వుంటుంది. ఈ సినిమాలో రొమాన్స్ శృతి మించి వుండదు. ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత అందరికీ మంచి కిక్ వస్తుంది.
సినిమాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. ఈ తరుణంలో విడుదల చేయడం రిస్క్ అనిపించలేదా?
సినిమా అన్ని హక్కులను ముందే అమ్మేయడం వల్ల ఈ రిలీజ్ డేట్ రిస్క్‌లో మేము వుండాల్సి వచ్చింది. థియేటర్స్ లేకపోవడం వల్ల పలుసార్లు విడుదల తేదీ మార్చాం. ఈటీవి విన్ వాళ్లు, పంపిణీదారులు ఇచ్చిన సలహాతో రిలీజ్ డేట్స్ మార్చాం. సినీ పరిశ్రమలో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా అందరికి రీచ్ అవ్వాలనే ఈ డేట్‌ను అనుకున్నాం. అయితే సినీ పరిశ్రమకు నా విన్నపం ఒక్కటే. ఇక్కడ చిన్న సినిమాలకు స్పేస్ ఇవ్వండి. ప్రతి దర్శకుడు మొదటి సినిమానే ఆర్‌ఆర్‌ఆర్ చేయడు. రాజమౌళికి తొలి సినిమా కూడా ‘స్టూడెంట్ నెం.1’ లాంటి చిన్న సినిమానే. ఆ తర్వాతే ఆయన ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి గొప్ప సినిమాలు తీశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి సినిమా కూడా నేను తీస్తాను. అలాంటి కథలు కూడా వున్నాయి. అయితే ఇక్కడ కావాల్సింది. స్పేస్ ఇచ్చి నిలబెట్టడం. ఇప్పుడు ఏ సినిమాలు లేక ‘అమరన్’ థియేటర్లలో ఆడుతుంది. నా సినిమా విడుదల చేసే స్పేస్ ఇచ్చి వుంటే అందులో సగం వసూళ్లు నా సినిమాకు వచ్చేవి. అసలు మన సినిమాలకు అక్కడ (తమిళనాడు) స్పేస్ కూడా ఇవ్వరు. ఇక్కడ మన సినిమాను కాపాడుకోండి అని అందరిని విన్నవించుకుంటున్నాను.
మీ తదుపరి చిత్రం ఏమిటి?
ఈ జర్నీ స్టార్ట్ అయిన తరువాత నిద్ర లేని రాత్రుళ్లు గడిపాను. ఈ సినిమా ప్రయాణంలోనే.. ఈ ఏడేళ్లలోనే 15 కథలు రాసుకున్నాను. ఈ సినిమా తర్వాత నా తదుపరి సినిమా డిసైడ్ అవుతుంది.
సినిమా నచ్చకపోతే సినిమాలు చేయను అని స్టేట్‌మెంట్ ఇచ్చారు?
ఈ సినిమా ఒక్కరైనా బాగా లేదు అంటే నేను సినిమాలకు రిటైర్‌మెంట్ ఇస్తాను. ఈ సినిమా నా బేబి లాంటిది. ఈ సినిమాపై నాకున్న నమ్మకం అలాంటిది. పది మంది వచ్చి చూసి బాగాలేదు అంటే రిటైర్‌మెంట్ ఇస్తాను. నా సినిమాతో మల్టీఫ్లెక్స్ థియేటర్స్ అన్నీ మాస్ థియేటర్లు అవుతాయనే నమ్మకం నాకుంది.