కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MM Keeravani: ఆస్కార్ అనేది ఒక సినిమా సక్సెస్ కి కొంచెం కూడా పని చేయదు

ABN, Publish Date - Jan 08 , 2024 | 06:26 PM

నాగార్జున అక్కినేని నటిస్తున్న ‘నా సామిరంగ’ సినిమా జనవరి14న సంక్రాంతికి విడుదలవుతోంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరిచిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపధ్యంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.

Music director MM Keeravani

మీరు చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటారు.. ఇలాంటి సమయంలో 'నా సామిరంగ' #NaaSaamiRanga ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్ లా వస్తోంది కదా? ఆస్కార్ తో వచ్చిన హైప్ వలన ‘నా సామిరంగా’ పై దాని ప్రభావం ఎలా వుంటుంది?

నేను మొదటి నుంచి సెలక్టివ్ గానే చేస్తున్నాను. దీనిని అందరూ అంగీకరిస్తారు. ఒక సినిమాకి హైప్ అనేది రిలీజ్ అయ్యే పాటల ద్వారా వస్తుంది. ఆస్కార్ అనేది ఒక సినిమా సక్సెస్ కి కొంచెం కూడా పని చేయదని భావిస్తాను. నా వరకూ బాగా వర్క్ చేయాలి. డైరెక్టర్ బాగా తీయాలి. అది జనాలకి కనెక్ట్ కావాలి.

'నా సామిరంగ' కి పని చేయడానికి ఆసక్తిని కనబరిచిన అంశాలు ఏమిటి?

నాగార్జున గారితో పని చేయడం నాకు అలవాటైన విద్య. మా కాంబినేషన్ ఎప్పుడూ విజయం సాధిస్తూ వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. కొత్త దర్శకుడు బిన్నీ ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. కొత్త దర్శకులు ఎలాగైనా నిరూపించుకోవాలనే కసితో పని చేస్తారు. అలాంటి కొత్త దర్శకులతో పని చేయడం ఆసక్తిగా వుంటుంది.

నాగార్జున (Nagarjuna) గారితో 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం', 'అల్లరి అల్లుడు' నుంచి 'అన్నమ్మయ్య', 'శ్రీరామదాసు' ఇలా అన్ని వైవిధ్యమైన చిత్రాలు చేశారు.. 'నా సామిరంగ' ఎలాంటి కొత్త అనుభూతిని ఇచ్చింది?

ప్రెసిడెంటు గారి పెళ్ళాం ఎంతటి ఘన విజయం సాధించిందో 'నా సామిరంగ' కూడా అలాంటి విజయం అందుకుంటుంది. ప్రెసిడెంటు గారి పెళ్ళాం విలేజ్ నేపధ్యం వున్న సినిమా. ఇది కూడా అంతే. అందులో ఎన్ని రకాల వినోదాత్మకమైన అంశాలు ఉంటాయో ఇందులో కూడా అన్నీ వుంటాయి. ఇది మరో 'ప్రెసిడెంటు గారి పెళ్ళాం' అవుతుందని ఆశిస్తున్నాను. ‘నా సామిరంగ’ నాగార్జున గారికి యాప్ట్ టైటిల్. తెలుగు సాంప్రదాయం, మన కట్టుబాట్లు, నేటివిటీ, సంక్రాంతి పండగ కళ ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. సంగీతం కూడా ఫ్రెష్ గా వుంటుంది.

ఇందులో మీరు కూడా ఒక పాట రాశారు కదా ?

ఈ చిత్రానికి సింగిల్ కార్డ్ చంద్రబోస్ గారే. అయితే అన్నం తిన్నప్పుడు కొంచెం పచ్చడి నంచుకుంటాం. అలా అని పచ్చడి తిన్నామని ప్రత్యేకంగా చెప్పం కదా.(నవ్వుతూ). ఇదీ అంతే. నేను ప్రోఫెషనల్ లిరిక్ రైటర్ ని కాదు. ఎవరైనా వచ్చి రాయమని అడిగినా రాయను. కానీ రిరీకార్డింగ్ చేసినప్పుడు ఒక సందర్భం పుడుతుంది. అలాంటి సందర్భంలో నుంచి ఆలోచన వస్తుంది. సందర్భం వచ్చింది కాబట్టి రాశాను. అవసరమైతేనే రాస్తాను.

కొత్త దర్శకుడు విజయ్ బిన్నీలో మీరు గమనించిన అంశాలు ఏమిటి ?

చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. దాని వలనే ఎక్కడా క్యాలిటీ తగ్గకుండా త్వరగా ఈ సినిమా తీయగలిగాడు. క్యాలిటీ తగ్గకుండా తొందరగా సినిమా తీయడం తన ప్రధాన బలం అని భావిస్తున్నాను. తను డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ప్రతి పాట డ్యాన్స్ కోణంలో అలోచించడం సహజం. కానీ దానికి భిన్నంగా ఇందులో చాలా మంచి మూడు మెలోడీస్ చేయించారు. తను పరిపక్వత వున్న దర్శకుడనిపించింది.

ఇప్పుడు పాట ఎంతలా వైరల్ అయ్యిందనేది పాట విజయానికి కొలమానం అయిపొయింది కదా.. కొన్ని మంచి పాటలు కొన్ని సార్లు వైరల్ కావు.. దిన్ని ఎలా చూస్తారు?

పాట వైరల్ అవ్వడం అనేది మన చేతిలో లేదు. ఒకప్పుడు పాట హిట్ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే ఏదైనా పెళ్లికి వెళ్లి, అక్కడ బ్యాండ్ లో ఆ పాట ప్లే చేస్తున్నారా లేదా అన్నదాని బట్టి తెలుసుకునే వాళ్ళం. ఇప్పుడు వ్యూస్ ని బట్టి తెలుస్తోంది. నిజాయితీగా పని చేయడం మాత్రమే మన చేతిలో వుంది. వైరల్ అనేది మన చేతిలో లేదు.

ఈ మధ్య కాలంలో మ్యూజిక్ పరంగా మీకు నచ్చిన చిత్రాలు ?

'యానిమల్' బావుంది. 'జైలర్' నేపధ్య సంగీతం నచ్చింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి మెసేజ్ కూడా పెట్టాను.

మీరు చేసిన పాటల్లో మిమ్మల్ని వెంటాడే పాట ?

ఒక యాభై, వంద వరకూ వుంటాయి.

రాజమౌళి గారితో చేయబోయే కొత్త సినిమా వర్క్ ఎప్పుడు నుంచి వుంటుంది ?

దాని గురించి తెలుసుకోవాలంటే రాజమౌళి కి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఫోన్ చేస్తే అది ఆఫ్ లో వుంటుంది (నవ్వులు) అంటే ఇంకా వర్క్ నా వరకూ రాలేదని అర్ధం.

హరిహరవీరమల్లు పాటలు గురించి ?

ప్రస్తుతానికి మూడు పాటలు రికార్డ్ చేశాం.

చిరంజీవి గారి సినిమా వర్క్ ఎంతదాక వచ్చింది?

షూటింగ్ జరుగుతోంది. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి

Updated Date - Jan 08 , 2024 | 06:26 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!