Sekhar Kammula: హ్యాపీడేస్, లీడర్ సినిమాలకు సీక్వెల్ తీయాలని ఉంది
ABN, Publish Date - Apr 18 , 2024 | 07:36 PM
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2007లో వచ్చిన సినిమా హ్యపీడేస్ ఏప్రిల్ 19న రీ రిలీజ్ కానుంది. అదే విధంగా దర్శకుడిగా 24 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు.
శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో 2007లో వచ్చిన సినిమా హ్యపీడేస్ (HappyDays). అంతా కొత్త వారితో తీసిన ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలు సైతం పొందడమే గాక బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. మళ్లీ ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత హ్యపీడేస్ చిత్రాన్ని ఏప్రిల్ 19న రీ రిలీజ్ ReRelease చేస్తున్నారు. అంతేకాకుండా 2000 సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్ అనే చిత్రంతో కేరీర్ ప్రారంభించిన ఆయన దర్శకుడిగా 24 ఏళ్ళు పూర్తి చేసుకుని 25 ఏట ప్రవేశించిన సందర్భంగా శేఖర్ కమ్ముల (Sekhar Kammula) పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.
హ్యాపీడేస్ (Happy Days) అనగానే మెమొరీస్ గుర్తుకు వస్తాయి. మరలా రీ రిలీజ్ ReRelease కు మీకు గుర్తుకు వచ్చిన సంఘటనలు ఉన్నాయా?
ఇన్నేళ్లైనా మళ్ళీ మళ్ళీ కాలేజీకి రావాలి. మళ్లీ మళ్ళీ సినిమా చూడాలి అనిపించేలా ఆ సినిమా ఉంటుంది. సంగీతం కూడా అంత బాగుంటుంది. ఏదైనా ఔట్ డేట్ అవుతుందేమోనని నేను మొన్ననే మరలా చూశాను. చాలా ఫ్రెష్‌గా ఉంది. రీరిలీజ్ కూడా యూత్ కు ఓ పండుగలా ఉంటుందనిపించింది. టైసన్ పాత్ర చాలా మేజిక్‌గా ఉంటుంది.
హ్యాపీడేస్ Happy Days) సీక్వెల్‌గా ఏదైనా అనుకున్నారా.?
నాకు అనిపించింది. కానీ కథ ఫామ్ కాలేదు.
అప్పటికీ ఇప్పటికీ కాలంలో మార్పులు వచ్చాయి కదా? ఏదైనా కొత్త ఆలోచన వచ్చిందా?
హ్యాపీడేస్ సినిమా చేస్తున్నప్పుడు నా గ్రాడ్యుయేషన్ పూర్తయి పదేళ్ళయింది. కానీ ఇప్పటికీ చూసినా కరెక్టే అనిపించేలా ఉంది. స్టూడెంట్ బ్యాక్ గ్రౌండ్ అప్పటి పరిస్థితుల రీత్యా కుదిరాయి. అయితే నేడు టెక్నాలజీ మారింది. సెల్ ఫోన్స్ ప్రతి స్టూడెంట్ చేతిలో ఉన్నాయి. కోవిడ్, గ్లోబలైజేషన్ వంటి పరిస్థితుల తర్వాత ఆలోచన విధానం తప్పకుండా మారుతుంది. టెక్నాలజీపరంగా ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరి లోకంలో వారు ఉన్నారు.
ట్రెండ్ కు తగినట్లు కథ రాసుకోవచ్చుగదా?
ఇంకా అనుకోలేదు.
25 సంవత్సరాల జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది?
సినిమా చేసి సక్సెస్ అవ్వాలనుకోవడం, నిలబడడం చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నా విలువలకు తగినట్లు సినిమా తీయడం గొప్పగా అనిపిస్తుంది. నేను ఏ సినిమా చేసినా విలువలు, సిద్దాంతాలు, చెడు చెప్పకూడదనే ఫార్మెట్‌లో పోతాను. నెగిటివ్ సంఘటనలు చాలా బెటర్‌గా చూపించవచ్చనిపిస్తుంది. నేను పేరు, డబ్బు కోసం సినిమా రంగానికి రాలేదు. అలా అని సినిమాలూ తీయలేదు. అదే నాకు గర్వంగా ఉంది. ఇప్పుడు సినిమా రంగంలో పోకడ చాలా హార్ష్‌గా ఉంది.
మీ కెరీర్ మీకు చాలా స్లోగా అనిపించిందా?
నాకు అలా అనిపించలేదు. నేను సినిమా చేసే పద్దతి, నా సినిమాలే మాట్లాడతాయి. కాపీ కొట్టే కథలు నేను చేయను. కంటెంట్ పరంగా బాగా చెప్పాలనుకుంటాను. చెప్పేది సూటిగా ఉంటుంది. మనసులో ఆలోచన రావడం అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. అలా కాకుండా తొందరగా చేయాలనుకోను. అలా చేస్తే గడిబిడి అయిపోతాం.
ఈ రోజుల్లో హిట్ రాగానే దర్శకులు చాలా ముందుంటున్నారు?
నేను ఏ సినిమా చేసినా ఈ కథ అవసరమా? అని ఆలోచించి చేస్తాను. మేకింగ్ పరంగా చాలా ఫాస్ట్ గా ఉంటాను. కానీ థింకింగ్ పరంగా స్లోగా ఉంటాను.
ఏషియన్ బేనర్‌తో మీ జర్నీ చాలా కంఫర్ట్‌గా ఉందనిపిస్తుంది. అలా అయ్యేవారు దొరకడం కష్టం మీరేమంటారు?
నాకు వారితో జర్నీ అలా మొదలైంది. ఫ్రీడం, నమ్మకం అనేది ఇరువురి మధ్య ఉండాలి. అది కూడా మంచి పరిణామమే.
ధనుష్, నాగార్జున గారితో పెద్ద సినిమా చేస్తున్నారు? మీ నుంచి ఏ స్థాయిలో సినిమాను ఆశించవచ్చు?
పెద్ద స్కేల్ సినిమా. పెద్ద ఐడియాతో ఉండే సినిమాగా ఉంటుంది. ముందుగా చెప్పకూడదు. కానీ నాగార్జున, ధనుష్ అనే వారు కథకు యాప్ట్ అని చేస్తున్నా. ఫిలాసఫీలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది.
దర్శకుడికి ఎత్తు పల్లాలు ఉండడం మామూలే. మీ నుంచి నోస్ చెప్పాలంటే ఏం చెబుతారు.
నా సినిమాలో కల్ట్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది. పని, పాపులారిటీ మనం చేసే విధాానంతో వస్తాయి. మనీ పరంగా ఆలోచించకుండా చేయడమే నా తత్వం. అదే నాకు గొప్పగా అనిపిస్తుంది.
లీడ్‌కు సీక్వెల్ ఉంటుందా?
నాకు తీయాలని మైండ్‌లో ఉంది. కానీ సమయం కుదరడం లేదు. చేస్తే తప్పకుండా మరలా రానా తోనే చేస్తా. అప్పట్లో ఆ సినిమాలో లక్ష కోట్లు అవినీతి అంటే చాలా ఎక్కువ అని అన్నారు. కానీ ఇప్పుడు మరింత దిగ జారి పోయాయి. ఒక పర్సన్ గురించి చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా చెప్పాలి. ఇవన్నీ కుదరాలంటే కాస్త సమయం పడుతుంది.
రాజకీయాలు పాడైపోయినప్పుడు సినిమా తీయడానికి మరింత సబ్జెక్ట్ లు ఉంటాయి కదా?
లీడర్ లో ఏమి చేసినా చివరికి రియలైజ్ అవుతాడు. కానీ ఇప్పుడు ఏది చెప్పాలన్నా దానికి సొల్యూషన్ లాజిక్ గా చెప్పాలి. అందుకు చాలా టైం పడుతుంది. ఏదైనా సమస్య చెబితే దాని పరిష్కారం కూడా చెప్పగలగాలి. కథలు రాయవచ్చు. కానీ మంచితనం సొల్యూషన్ అనేది చాలా కష్టంగా మారింది. మంచే గెలుస్తుంది. చెడు ఓడిపోతుంది. అనేది ప్రాక్టికల్ గా చెప్పాలి.
ఏదైనా కొత్తవారితో చేయడం అనేది కూడా కథ ప్రకారమే.. ఇప్పుడు చేయబోయే కుబేర సినిమా కూడా ఈ పాత్రకు ఇతనే ఉండాలి. అని రాసుకున్నదే. లీడర్ సినిమా రానాతోనే చేయాలి. కొత్త వారితో చేయాలని ట్రై చేస్తే దెబ్బతింటాం.
నేషనల్ అవార్డు అందుకున్నారు. మరలా రీచ్ అయ్యే ఆలోచన ఉందా?
అలా అనుకోలేదు. నేను కాంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తున్నాను. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. ప్రజలు ఇచ్చే అవార్డే గొప్పది. అవార్డు అనేది సడెన్ గా వస్తుంటాయి. మనకంటే బెటర్ గా సినిమాలు నేషనల్ లెవల్లో ఉంటున్నాయి. వాటినీ అంగీకరించాలి. ఏడాది ఏడాదికి జాతీయ స్థాయిలో అంచనాలు మారుతుంటాయి. కంటెంట్ పరంగా మంచిది తీసుకుని చేయడమే మన పని.
నేడు పాన్ఇండియా లెవల్లో సినిమా వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు?
కథ పరంగా మన నేటివిటీకి తగినట్లు చెప్పగలగాలి. కోవిడ్ తర్వాత పాన్ ఇండియా లెవల్ మారింది. వాటికి తగినట్లు సినిమా తీస్తే తప్పకుండా ఆ లెవల్ కు చేరుతుంది. ఇందుకు ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా గమనించాలి అని ముగించారు.