Varsha Bollamma: అతనే నా సెలబ్రిటీ క్రష్.. డ్రీమ్ రోల్ అదే!
ABN, Publish Date - Feb 11 , 2024 | 02:42 PM
వర్ష బొల్లమ్మ... ‘96’, ‘బిగిల్’ సినిమాలతో అందర్నీ కట్టిపడేసింది. ‘చూసీ చూడంగానే’తో తెలుగుతెరపై మెరిసి ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’, ‘స్వాతిముత్యం’తో ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా ‘ఊరుపేరు భైరవకోన’తో వస్తున్న ఈ కన్నడ భామ చెబుతున్న కబుర్లివి...
వర్ష బొల్లమ్మ... ‘96’, ‘బిగిల్’ సినిమాలతో అందర్నీ కట్టిపడేసింది. ‘చూసీ చూడంగానే’తో తెలుగుతెరపై మెరిసి ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’, ‘స్వాతిముత్యం’తో ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా ‘ఊరుపేరు భైరవకోన’తో వస్తున్న ఈ కన్నడ భామ చెబుతున్న కబుర్లివి...
డబ్‌స్మాష్‌తో మొదలెట్టి...
నేను పుట్టింది కూర్గ్‌లోనైనా పెరిగిందంతా బెంగళూరులో. మైక్రోబయాలజీ చదివాను. చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉండేది. ఆ ఇష్టంతోనే డబ్‌స్మాష్ వీడియోలు చేయడం మొదలుపెట్టి ఫేమస్ అయ్యా. కోలీవుడ్‌లో ‘శాతురన్’తో నటిగా ఎంట్రీ ఇచ్చా. ‘96’, ‘బిగిల్’తో మంచి గుర్తింపు లభించింది. ‘చూసీ చూడంగానే’తో తెలుగువారికి పరిచయమయ్యా.
సెలబ్రిటీ క్రష్
‘బిగిల్’లో నేను వేసుకున్న జెర్సీ వెనుక ఒక చిన్న కథ ఉంది. చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ అంటే పిచ్చి. అతనే నా సెలబ్రిటీ క్రష్. స్కూల్లో చదువుతున్న రోజుల్లో పేపర్‌లో కోహ్లీ ఫొటో కనబడితే చాలు... వెంటనే దాన్ని కత్తిరించి నా పుస్తకాల్లో భద్రంగా దాచుకునేదాన్ని. ‘బిగిల్’లో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటించేటప్పుడు పట్టుబట్టి మరీ పద్దెనిమిదో నంబర్ జెర్సీ తీసుకున్నా. ఎందుకంటే కోహ్లీ జెర్సీ నంబర్ 18 కాబట్టి. అతని పెళ్లైపోయినప్పుడు మాత్రం నా మనసు ముక్కలైనంత పనైంది.
పెళ్లి సీన్ చేస్తే చాలు...
మాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కానీ నటిని కావాలనుకున్నప్పుడు నా తల్లిదండ్రులు ఎంతో సపోర్ట్ చేశారు. నాతో పాటు అమ్మ కూడా షూట్స్‌కి వస్తుంటుంది. ఏదైనా పెళ్లి సీన్‌లో నటించాల్సి వస్తే చాలు... అమ్మ ఏడ్చేస్తుంది. ‘అమ్మా... ఇది కేవలం షూటింగ్ మాత్రమే. నేనేమి నిజంగా పెళ్లి చేసుకోవట్లేదు’ అని ఓదారుస్తూ ఉంటాను. అయినా తను ఎమోషనల్ అవుతూనే ఉంటుంది.
‘జాదూ’ అనేవారు
‘బిగిల్’లో విజయ్ దళపతితో స్ర్కీన్ షేర్ చేసుకున్నా. ఆయన కెమెరా ముందు ఒకలా, కెమెరా వెనుక ఒకలా ఉంటారు. కట్ చెప్పగానే కూల్‌గా ఓ పక్కన కూర్చుండిపోతారు. యాక్షన్ అనగానే ఆయనకి ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఆయన ప్రతీరోజూ సెట్‌కి రాగానే చిరునవ్వుతో అందరినీ పలకరించేవారు. తిరిగి ప్యాకప్ చెప్పి వెళ్లిపోయేటప్పుడు కూడా పేరు పేరున విష్ చేసేవారు. నా కళ్లు పెద్దగా ఉంటాయని ఆయన నన్ను ‘జాదూ’ అని పిలిచేవారు.
మేకప్ ఇష్టముండదు...
నేను మేకప్ పెద్దగా వేసుకోను. సాధ్యమైనంత వరకూ సహజంగా కనిపించడానికే ఇష్టపడతా. కేవలం ఐ లైనర్, లిప్ కలర్ మాత్రమే ఉపయోగిస్తా. ఖాళీ సమయం దొరికితే నవలలు చదువుతా. స్విమ్మింగ్, సైక్లింగ్, టేబుల్ టెన్నిస్ ఆడతా. నేను డాగ్ లవర్ని. నా గురించి ఎవరికీ తెలియని విషయమేమిటంటే... టాటూలంటే చాలా ఇష్టం. అందుకే నా హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ టాటూల కోసం ఒక బేబీ ఆయిల్ ఉంటుంది.
నా అభిమాన తారలు వీరే...
నేను కాలేజీలో ఉన్నప్పుడు ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూసి విజయ్ దేవరకొండకి అభిమానినైపోయాను. అతను అద్భుతమైన నటుడు. కళ్లతో ఎలాంటి హావభావాలనైనా సులువుగా పలికించగలడు. జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ యాక్టింగ్ అదుర్స్. నటనపరంగా సీనియర్ నటి రేవతి నాకు స్ఫూర్తిదాయకం. నాకొక డ్రీమ్‌రోల్ ఉంది. ఎప్పటికైనా నెగిటివ్ షేడ్స్ ఉన్న సైకో పాత్ర చేయాలనుకుంటున్నా.