మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anjali: ‘రత్నమాల’గా వస్తున్నా.. ఇదే మొదటిసారి!

ABN, Publish Date - May 26 , 2024 | 08:58 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ అంజలి మీడియాకు తెలియజేశారు.

Heroine Anjali

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి (Neha Shetty), అంజలి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతం అందించారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ అంజలి (Anjali) మీడియాకు తెలియజేశారు.

మీ పాత్ర మాస్‌గా, కొత్తగా ఉందనేలా ట్రైలర్ తర్వాత టాక్ వచ్చింది కదా.. మీకెలా అనిపిస్తుంది?

నిజంగా హ్యాపీ.. ఈ పాత్ర చేయడం నాక్కూడా కొత్తగా ఉంది. ఇలాంటి పాత్ర చేయడం, ఈ తరహా సంభాషణలు నా నోటి నుంచి చెప్పడం ఇదే మొదటిసారి. అసలు ఈ సంభాషణలు నిజంగా సినిమాలో ఉంచుతారా అనుకున్నాను. చిత్రీకరణ, డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతిని పొందాను.

ఈ సినిమాలో మీరు రత్నమాల (Ratnamala) పాత్ర చేయడానికి ఓకే చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి?

పాత్రను మలిచిన తీరు చాలా బాగుంటుంది. కృష్ణ చైతన్య మొదటిసారి కలిసి ఈ కథ చెప్పినప్పుడు.. ఈ పాత్రకు నన్ను ఎంపిక చేయడానికి కారణం ఏంటని అడిగాను. ఎందుకంటే నన్ను ఎక్కువగా అందరూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలలో చూడాలి అనుకుంటారు. కానీ ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే చైతన్య ఏమన్నారంటే.. నాకు అద్భుతంగా నటించే నటి కావాలి, అందుకే మీ దగ్గరకు వచ్చాను, మీరు ఈ పాత్రకు న్యాయం చేయగలరు అని అన్నారు. ఆయన ఏ నమ్మకంతో ఆ మాట చెప్పారో తెలియదు కానీ.. ఇంత మంచి పాత్ర పోషించినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషించడం నాకూ నచ్చదు. ఈ పాత్రలోని వైవిధ్యమే నన్ను ఈ సినిమా చేయడానికి అంగీకరించేలా చేసింది. (Anjali Interview)

*Mahesh-Namrata: ఈరోజు తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుతున్నాం.. మహేష్, నమ్రతల ఇన్‌స్టా పోస్ట్స్ వైరల్



విశ్వక్ సేన్ పాత్రతో మీ బంధం ఎలా ఉండబోతుంది?

మా పాత్రల బంధం స్వీట్‌గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఆయన రత్నాకర్, నేను రత్నమాల. ఇద్దరినీ రత్న అని పిలుస్తారు. నా ఆహార్యం, నేను పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటే అది బయటకు చెప్పే పాత్ర. రత్నమాల నా సినీ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర అవుతుందని నమ్ముతున్నాను.

ఈ సినిమాలోని పాత్ర కోసం ఎలాంటి హోం వర్క్ చేశారు?

ఈ తరహా పాత్రలు నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తారసపడతాయి. నేను అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు చూశాను. దేనిని లెక్క చేయకుండా పైకి రఫ్‌గా కనిపిస్తారు.. కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా మంచిది. రత్నమాల పాత్రలోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకున్నాను. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను.

విశ్వక్ సేన్, మీరు పోటీపడి నటించారా?

నిజంగానే మా పాత్రలు పోటాపోటీగానే అనిపిస్తాయి. సినిమాలో విశ్వక్ ఎంత గట్టిగా మాట్లాడతారో.. అంతకంటే గట్టిగా నేను మాట్లాడతాను. ట్రైలర్‌లో చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ లేదా ఫలానా పాత్ర అని కాకుండా.. అన్ని పాత్రలు బలంగా, కథలో కీలకంగా ఉంటాయి.

కథానాయికగా కాకుండా మీరు ఈమధ్య ఎక్కువగా కీలక పాత్రలలో నటించడానికి కారణం?

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నాది కీలక పాత్ర కాదు. కథానాయికలలో ఒక పాత్ర. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనేది నా సినిమా, నేను ప్రధాన పాత్ర పోషించిన సినిమా. అలాగే ‘గేమ్ చేంజర్’ (Game Changer) చిత్రంలో కూడా నాది కీలక పాత్ర కాదు. కథానాయికలలో ఒక పాత్ర.

రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ చేయడం ఎలా ఉంది?

రామ్ చరణ్ (Ram Charan) గురించి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పాను. పాత్ర కోసం నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి పరితపిస్తారు. ఆయన తన పాత్ర విషయంలోనే కాకుండా.. సినిమాలోని ఇతర పాత్రధారులకు కూడా అంతే సహకారం అందిస్తారు.

విశ్వక్ సేన్ గురించి?

విశ్వక్ నాకు ముందు నుంచి స్నేహితుడు. అందుకే మా మధ్య సెట్‌లో మంచి సమన్వయం ఉంటుంది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి.. ఎటువంటి సన్నివేశాల్లోనూ మేము నటించడానికి ఇబ్బంది పడలేదు.

ఫైనల్ కాపీ చూశారా? ఎలా అనిపించింది?

ఇది అందరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

దర్శకుడు కృష్ణ చైతన్య గురించి?

మాకు ఏం చెప్పారో అదే తీశారు. ఒక దర్శకుడు ఏం ఆలోచించాడో.. దానిని అలాగే తెరమీదకు తీసుకురావడం అనేది చాలా మంచి లక్షణం. కృష్ణ చైతన్య ఏదైతే రాసుకున్నారో.. దానిని ఇంకా మెరుగ్గా తెరమీదకు తీసుకొచ్చారు.

నిర్మాతల గురించి చెప్పండి?

వరుస విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న సితార లాంటి సంస్థలో పని చేయడం సంతోషంగా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరు. అలాంటి నిర్మాణ సంస్థ తోడు కావడం వల్లే.. ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది.

సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా గురించి?

యువన్ గారి సంగీతంలో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ సినిమాలో సంగీతం కొత్తగా ఉంటుంది. పాటలన్నీ బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంటుంది.

పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు?

ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్ళికి ఇంకా సమయం ఉంది. కొంతకాలంగా నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే.

తదుపరి చిత్రాల గురించి?

తెలుగులో ‘గేమ్ చేంజర్’తో పాటు మరో సినిమా అంగీకరించాను. తమిళంలో మూడు సినిమాలు, అలాగే మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను.

Updated Date - May 26 , 2024 | 08:58 PM