హీరోహీరోయిన్లుగా నిజమైన భార్యాభర్తలు.. స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ సినిమా
ABN, Publish Date - Aug 11 , 2024 | 02:45 PM
ప్రేమించుకుని పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా ఉన్న జంట నటించిన రొమాంటిక్ కథా చిత్రం ‘త కా గా సై ఆ’. ఈ దంపతులు.. హీరోహీరోయిన్లుగా నటించడమే కాకుండా, స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించడం విశేషం.
నిజ జీవితంలో ప్రేమించుకుని పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా ఉన్న సదా నాడార్ (Sadha Nadar), మోనికా సెలీనా జంటగా నటించిన రొమాంటిక్ కథా చిత్రం ‘త కా గా సై ఆ’. ఈరోడ్ జిల్లాకు చెందిన ఈ ప్రేమ దంపతులు.. హీరోహీరోయిన్లుగా నటించడమే కాకుండా, స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. తమిళ చిత్ర పరిశ్రమలో నిజ జీవితంలో భార్యాభర్తలైన ఒక జంట ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించి, దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి.
తాజాగా.. ఈ ప్రాజెక్టు వివరాలను సదా నాడార్ (Sadha Nadar), మోనికా సెలీనా వివరిస్తూ, ‘సినిమాల ద్వారా సమాజానికి ఏదైనా చేయాలని భావించాం. దీనికంటే ముందుగా ఒక ప్రివ్యూ తరహాలో ఒక సినిమాను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందులో నేను, నా భార్య హీరోహీరోయిన్లుగా నటించాం. ఒక కుటుంబంలో ప్రేమించే భార్య ఉన్న వ్యక్తి ఒక సమస్యను ఏ విధంగా ఎదుర్కొంటాడన్న కథాంశాన్ని చక్కటి స్క్రీన్ ప్లేతో రూపొందించామన్నారు.
ఊటీ, ఈరోడ్, చెన్నై, కోయంబత్తూరు, ఏర్కాడ్, పుదుచ్చేరి, ఈసీఆర్, గోవా తదితర అందమైన లొకేషన్లలో కుటుంబ సమేతంగా చూసేలా తెరకెక్కించామన్నారు. మేము ఎవరివద్దా పనిచేయలేదని.. సినిమాలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని ఆ అనుభవంతోనే ఈ సినిమాను నిర్మించామన్నారు. కపిల్ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలో నటించిన, పని చేసిన వారంతా కొత్తవారేనని. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు’ పేర్కొన్నారు.