Minu Muneer: చేదు అనుభవాల్ని బయటపెట్టినందుకే!
ABN, Publish Date - Aug 28 , 2024 | 01:38 PM
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితి, స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report) సమర్పించిన నివేదికలో ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితి, స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report) సమర్పించిన నివేదికలో ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు లైంగిక వేధింపులు ఆరోపణలకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టినందుకు తనకు సోషల్ మీడియా వేదికగా బెదిరింపు సందేశాలు వస్తున్నాయని నటి మిను మునీర్ (minu muneer) తెలిపారు. నటుడు జయసూర్యతోపాటు ముఖేశ్(Mukesh), మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు (idavelu babu)వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ నటి మిను మునీర్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం బయపెట్టిన దగ్గరి నుంచి తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం మరో చర్చనీయాంశంగా మారింది. 2013లో ఒక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు ముఖేశ్, మణియన్‌పిళ్ల రాజు, ఇడవేల బాబు, జయసూర్య అసభ్య పదజాలంతో తనను దూషించినట్లు మిను ఇటీవల ఆరోపించారు. అన్నింటినీ తట్టుకొని సినిమా కోసం వర్క్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి వేధింపులు మితిమీరడంతో ఇండస్ట్రీని వదిలి తమిళ ఇండస్ట్రీకి వెళ్లాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయానన్నారు మిను మునీర్.
ఇదిలా ఉండగా అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు 17 మంది సభ్యులున్న పాలక మండలి పదవుల నుంచి వైదొలిగింది. ఈ మేరకు ‘అమ్మ’ సంఘం మంగళవారం ఓ ప్రకటనలో వెలడించింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో నైతిక బాధ్యతగా వీరంతా రాజీనామా చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.