Election: క్షేత్రస్థాయి రాజకీయాల నేపథ్యంలో ‘ఎలక్షన్’.. రిలీజ్‌కు రెడీ!
ABN, Publish Date - May 15 , 2024 | 10:37 AM
స్థానిక ఎన్నికల రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఎలక్షన్’. విజయ్ కుమార్ హీరోగా రీల్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత ఆదిత్య నిర్మించగా, తమిళ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 17వ తేదీ శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ అధినేత శక్తివేలన్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ తాజాగా చెన్నై నగరంలో జరిగింది.
స్థానిక ఎన్నికల రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఎలక్షన్’ (Election). విజయ్ కుమార్ (Vijay Kumar) హీరోగా రీల్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత ఆదిత్య నిర్మించగా, తమిళ్ (Thamizh) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 17వ తేదీ శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ అధినేత శక్తివేలన్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ తాజాగా చెన్నై నగరంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో హీరో విజయ్‌కుమార్ (Hero Vijay Kumar) మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు, క్షేత్రస్థాయి రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇది రాజకీయ చిత్రమైనప్పటికీ... రాజకీయాలను దైనందిన జీవితంలో భాగం చేస్తూ, మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చేలా, ఫ్యామిలీ డ్రామా మూవీగా దర్శకుడు తెరకెక్కించారు. ఈ సినిమాకు కథతో పాటు జార్జ్ మరియన్ పోషించిన పాత్ర హైలెట్‌గా ఉంటుంది. దర్శకుడు తమిళ్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత ఆదిత్యతో ఇది నా రెండో చిత్రం. ఈ సందర్భంగా ఇందులో నటించిన ప్రతి ఒక్క నటీనటుడికి దన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
దర్శకుడు తమిళ్ (Thamizh) మాట్లాడుతూ.. పేరు ప్రఖ్యాతుల కోసం నేను సినిమాల్లోకి రాలేదు. జీవితంలో ఎదురైన విషాదకర ఘటనలు, నన్ను ఆలోచింపజేసిన విషయాలను చెప్పడానికి వచ్చాను. నేను దర్శకత్వం వహించిన ‘సేతుమాన్’ చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు. ‘సేతుమాన్’ చిత్రం ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అయింది. అయితే, ఈ సినిమా అంత తొందరగా కనెక్ట్ అవుతుందా లేదా అన్నది కాస్త భయంగా ఉంది. ‘సేతుమాన్’ చిత్రం తర్వాత పెద్ద నిర్మాణ సంస్థల్లో సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ అవకాశం లభించలేదు. చివరకు విజయకుమార్‌తో కలిసి ఈ సినిమా రూపొందించాను. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే, నిర్మాత ఆదిత్య, శక్తి ఫిలిమ్స్ అధినేత శక్తివేలన్, కెమెరామెన్ మహేంద్రన్ జయరాజ్, నటుడు పావెల్ నవగీతన్, నటి రిచ్చా జోషి తదితరులు ప్రసంగించారు.