Suriya: ఆ ఫోన్‌కాల్ రాకుంటే ఈ జీవితమే లేదు
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:00 PM
దర్శకుడు బాల గురించి చెబుతూ.. హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు. సినీ దర్శకుడు బాల చిత్ర పరిశ్రమకు వచ్చి 25 యేళ్ళు పూర్తయిన సందర్భంగా తాజాగా చెన్నైలో ‘బాల-25’ పేరుతో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్య స్పీచ్ హైలెట్ అయ్యింది.
దర్శకుడు బాల నుంచి 2000లో ఆ ఫోన్‌కాల్ రాకుంటే తనకు ఈ జీవితమే ఉండేదికాదని హీరో సూర్య అన్నారు. సినీ దర్శకుడు బాల చిత్ర పరిశ్రమకు వచ్చి 25 యేళ్ళు పూర్తయిన సందర్భంగా తాజాగా చెన్నైలో ‘బాల-25’ పేరుతో సన్మాన కార్యక్రమం జరిగింది. అలాగే, బాల దర్శకత్వం వహించిన ‘వణంగాన్’ చిత్ర ఆడియో, ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇందులో అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొని బాలను అభినందించారు.
Also Read- Mohan Babu: చిరంజీవి పేరు ప్రస్తావిస్తూ మోహన్ బాబు పోస్ట్.. మ్యాటర్ ఏంటంటే
ఈ కార్యక్రమంలో హీరో సూర్య మాట్లాడుతూ.. బాల డైరెక్ట్ చేసిన ‘నంద’ సినిమా చూసి దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ ‘కాక్కకాక్క’లో నాకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఏఆర్ మురుగదాస్ ‘గజినీ’ కోసం పిలిచారు. దీనికంతటికి కారణం దర్శకుడు బాల. ఆయన దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ నటించిన ‘సేతు’ సినిమా నాలో బలమైన ముద్ర వేసింది. ఒక నటుడు ఇలా నటించగలడా? దర్శకుడు ఇలాంటి చిత్రాన్ని తీయగలడా? ఇలా అనేక ప్రశ్నలు నాలో ఉత్పన్నమయ్యాయి. ఈ సినిమా ప్రభావం నాపై చాలా రోజుల పాటు ఉంది. తదుపరి చిత్రం నీతో చేస్తాను అని బాల చెప్పిన ఆ ఒక్క మాటతో మొత్తం మారిపోయింది. 2000లో నాకు ఆ ఫోన్ కాల్ రాకుంటే నాకు ఈ జీవితమే ఉండేదికాదు. బాల సినిమాల్లో సంబంధ బాంధవ్యాలకు విలువనిస్తారు. బాల అన్న అనేది కేవలం ఒక పదం కాదు. ఇది ఒక సంబంధం. పర్మినెంట్ రిలేషన్. ఈ జీవితాన్ని ఇచ్చినందుకు బాల అన్నకు ప్రేమపూర్వక ధన్యవాదాలు. ‘వణంగాన్’ కూడా మరో గొప్ప చిత్రంగా నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.
బాల మాట్లాడుతూ.. నేను సూర్య సమక్షంలో సిగరెట్ కాల్చను. తమ్ముడు బాధపడతాడు. నా ఆరోగ్యంపై నాకంటే అధిక శ్రద్ధ చూపించే వ్యక్తి’ అని అన్నారు. కాగా, అరుణ్ విజయ్ నటించిన ‘వణంగాన్’ వచ్చే నెల 10వ తేదీ విడుదలకానుంది. బి స్టూడియో సహకారంతో వి హౌస్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాత సురేష్ కామాక్షి నిర్మించగా, బాల కథ సమకూర్చి దర్శకత్వం వహించారు. రోషిణి ప్రకాష్ హీరోయిన్. జీవీ ప్రకాష్ కుమార్, శ్యాస్ సీఎస్ సంగీతం సమకూర్చారు.