Lal Salaam: రజినీకాంత్ కి షాకిచ్చిన్న 'లాల్ సలామ్' కలెక్షన్స్
ABN, Publish Date - Feb 12 , 2024 | 12:43 PM
సుమారు రూ.90 కోట్ల బడ్జెట్ తో రజినీకాంత్ నటించిన 'లాల్ సలామ్' సినిమా ఫిబ్రవరి 9న విడుదలైంది. తెలుగులో అయితే ఈ సినిమాకి ప్రేక్షకులు లేక చాలా థియేటర్స్ లో ఈ సినిమా తీసేసి వేరే సినిమా వేసారని అంటున్నారు. మొత్తం మూడు రోజులకి గాను ప్రపంచవ్యాప్తగా రూ. 10 కోట్లు కూడా ఆదాయం రాబట్టలేని ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లో ఒక డిజాస్టర్ మూవీ అని పరిశ్రమలో టాక్.
రజినీకాంత్ సినిమా విడుదలవుతోంది అంటే రజిని అభిమానులకే కాకుండా, సినిమా ప్రేక్షకులకి కూడా కొంత ఆసక్తి ఉంటుంది. గత వారం ఫిబ్రవరి 9న రజినీకాంత్ నటించిన 'లాల్ సలామ్' సినిమా విడుదలైంది. ముందుగా ఈ సినిమాలో రజినీకాంత్ కేవలం ప్రత్యేక అతిధి పాత్రలో మాత్రమే కనపడతారు అని ప్రకటించారు కానీ, సినిమా విడుదలయ్యాక అతని పాత్ర అతిధి పాత్ర కాదని, ప్రధాన పాత్ర అని తెలిసింది. కానీ ఆసక్తికరం ఏంటంటే, ఈ సినిమా విడుదలైనప్పుడు అటు తమిళంలో కానీ, ఇటు తెలుగులో కానీ ప్రేక్షకులు ఎందులో అంత ఆసక్తి చూపించలేదు.
రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దీనికి సంగీతం భారతదేశంలో అగ్ర సంగీత దర్శకుడు అయిన ఏఆర్ రహమాన్ అవటం ఇంకో విశేషం. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ రెండు ముఖ్య పాత్రలు పోషించారు. విష్ణు విశాల్ ప్రధాన కథానాయకుడు అని చెప్పాలి. ఈ సినిమాకి కథ, ఛాయాగ్రహణం, కథనం మూడు విభాగాల్లో విష్ణు రంగస్వామి పని చేశారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 9 న విడుదలైనప్పుడు కొన్ని థియేటర్స్ లో ప్రేక్షకులు లేకపోవటంతో ఈ సినిమా తీసేసి ఈ సినిమా తీసేసి వేరే సినిమా వేసారని కూడా తెలుస్తోంది.
ఇంతకు ముందు రజినీకాంత్ 'జైలర్' విడుదలైనప్పుడు రజినీకి మళ్ళీ పెద్ద విజయాన్ని అందించింది. ఇప్పుడు ఈ 'లాల్ సలామ్' సినిమాని ఎందుకో అటు రజినీకాంత్ కానీ, నిర్మాతలు కానీ, దర్శకురాలు కానీ ఎక్కడా పెద్దగా ప్రచారాలు చేసినట్టుగా కనిపించలేదు. పోనీ తెలుగులోనే అనుకుందామా అంటే, తమిళంలో కూడా ఈ సినిమాకి ఓపెనింగ్స్ రాలేదు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.
రెండు రోజులకు గాని ఈ సినిమా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.50 కోట్ల గ్రాస్ కలెక్టు చేసింది అంటే ఈ సినిమా పట్ల ప్రేక్షకులు అసలు ఆసక్తి కనపర్చలేదని తెలుస్తోంది. ఇది రజినీకాంత్ కి ఒక షాకిచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు అని అంటున్నారు. రజినీకాంత్ సినిమాలు ఏవీ కూడా ఈమధ్యకాలంలో ఇంత దారుణంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ తినలేదని కూడా అంటున్నారు. ఈ సినిమాకి మొత్తం బడ్జెట్ రూ.90 కోట్ల వరకు అయిందని ఒక ప్రచారం వుంది. ఈ సినిమాకి రజినీకాంత్ పారితోషికం కూడా చాలా ఎక్కువ తీసుకున్నారని కూడా తెలుస్తోంది. మొదట అతిధి పాత్ర అని చెప్పి ఆ తరువాత నిడివి పొడిగించారని, అందుకని అతనికి పారితోషికం ఎక్కువ ఇచ్చారని కూడా తెలుస్తోంది.
ఈ సినిమాకి ఇంకో షాకేంటంటే ఆదివారం కలెక్షన్స్ ఇంకా దారుణంగా పడిపోవటం, మూడో రోజు మొత్తం రూ. 3 కోట్లు మాత్రమే కలెక్టు చేసిందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లో ఒక పెద్ద డిజాస్టర్ మూవీ గా నిలిచిపోనుంది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.