‘పుష్ప 2’కి పోటీగా ప్రేమకథ.. రజనీకాంత్ సపోర్ట్
ABN, Publish Date - Dec 04 , 2024 | 09:07 AM
డిసెంబర్ 5న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మూవీ గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన వేళ.. ఈ సినిమాకు పోటీగా కోలీవుడ్‌లో ఓ ప్రేమకథను దింపుతున్నారు. ఈ ప్రేమకథకు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సపోర్ట్ అందిస్తున్నారు. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..
అన్సన్‌పాల్, రెబా మోనికా జాన్ జంటగా నటించిన ‘మళైయిల్ ననైగిరేన్’ చిత్రం ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీ అని ఆ చిత్ర దర్శకుడు టి. సురేష్ కుమార్ అన్నారు. రాజశ్రీ వెంచర్స్ పతాకంపై బి. రాజేష్ కుమార్ సమర్పణలో ఈ సినిమా రూపొందింది. ఈ నెల 12న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో
Also Read-Megastar Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్.. బాసూ, ఆ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చుగా
దర్శకుడు టి. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. కానీ, ఈ చిత్రం వాటన్నింటికి భిన్నంగా ఉంటుంది. ఇందులో హీరోహీరోయిన్లు వర్షంలో కలుసుకుంటారు. వారి ప్రేమకథ కూడా వర్షంలోనే ముగుస్తుంది. హీరోయిన్‌కు ఏమాత్రం ఇష్టంలేకపోయినప్పటికీ హీరో ప్రేమిస్తాడు. ఆ యువతి అంగీకరించదు. తన ప్రేమను అంగీకరించేంత వరకు వేచి చూస్తానని చెబుతాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాల్సిన యువతి హీరో ప్రతిపాదనకు అంగీకరించి ఇక్కడే ఆగిపోతుందా? భిన్నమతాలకు చెందిన వీరిద్దరూ పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యారా? లేదా? అన్నదే ఈ క్లైమాక్స్. ఈ ప్రేమకథా చిత్రంలో మెలోడీ పాటలు ఉన్నాయి. కుటుంబ సభ్యులంతా కలిసి చూడదగిన సినిమాగా రూపొందించామని అన్నారు.
హీరో అన్సన్‌పాల్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను నటించిన పాత్రలకు ఇందులోని పాత్రకు పూర్తిగా భిన్నమైన రోల్. తన ప్రేమను విజయవంతం చేసుకునే యువకుడి పాత్రలో నటించానని పేర్కొన్నారు. హీరోయిన్ మోనికా రెబా మాట్లాడుతూ.. ‘‘ఇది ఫీల్‌గుడ్ మూవీ. ఇటీవలి కాలంలో మంచి ప్రేమకథా చిత్రాలు రాలేదు. ఆ లోటును భర్తీ చేసే మంచి మూవీగా నిలుస్తుందని అన్నారు.
నిర్మాత బి.రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. నేను సూపర్‌స్టార్ రజనీకాంత్ వీరాభిమానిని. ఒక విధంగా చెప్పాలంటే ఆయన నాకు దేవుడితో సమానం. అందుకే సినిమా విడుదలకు ముందే మమ్మలను ఆశీర్వదిస్తూ ఈ చిత్రం విజయం సాధించాలంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పైగా ఈ చిత్రాన్ని ఈ నెల 12వ తేదీన విడుదల చేయడానికి కూడా ప్రధాన కారణం ఇదే. 2018లో ఈ ప్రాజెక్టును ప్రారంభించాం. అప్పుడు హీరోగా ఎంపిక చేసిన వ్యక్తి ఇపుడు గొప్ప నటుడు. అతని స్థానంలో అన్సన్‌పాల్‌ను తీసుకున్నాం. ‘పుష్ప-2’ వంటి భారీ బడ్జెట్ చిత్రం విడుదలవుతున్నప్పటికీ మా కథపై ఉన్న నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేస్తున్నామని వివరించారు.