Indian 2: మనం లేకుండా అవినీతి జరుగుతుందా?.. ప్రశ్నించిన కమల్..
ABN, Publish Date - Jun 26 , 2024 | 04:02 PM
దేశంలో అవినీతి పెరిగిపోవడానికి కేవలం రాజకీయ నేతలు మాత్రమే కారణం కాదనీ, ప్రజలు కూడా కారణమని, మనం లేకుండా అవినీతి జరుగుతుందా? అంటూ అగ్ర నటుడు కమల్ హాసన్ ప్రశ్నించారు. ఎస్.శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్, రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ‘ఇండియన్-2’ చిత్ర ట్రైలర్ మంగళవారం చెన్నై నగరంలో విడుదల చేశారు.
దేశంలో అవినీతి పెరిగిపోవడానికి కేవలం రాజకీయ నేతలు మాత్రమే కారణం కాదనీ, ప్రజలు కూడా కారణమని, మనం లేకుండా అవినీతి జరుగుతుందా? అంటూ అగ్ర నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశ్నించారు. ఎస్.శంకర్ (Director Shankar) దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్, రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ‘ఇండియన్-2’ (Indian 2) చిత్ర ట్రైలర్ మంగళవారం చెన్నై నగరంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమల్ హాసన్, శంకర్, సంగీత దర్శకుడు అనిరుధ్, నటులు సిద్దార్థ్, బాబీ సింహా తదితరులు పాల్గొన్నారు.
Also Read-Kalki 2898AD Review: మహాభారత యుద్ధం తరువాత ఏమి జరిగిందో ఊహాత్మకంగా...
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘1996లో ‘ఇండియన్’ డబ్బింగ్ చెప్పే సమయంలోనే రెండో భాగం గురించి మాట్లాడుకున్నాం. ‘ఇండియన్-2’ మూవీకి మూల కథ అందిస్తున్న రాజకీయ నేతలకు ధన్యవాదాలు. ఎందుకంటే అవినీతి పెరిగిపోవడం వల్లే ఇండియన్ తాత రెండోసారి మీ ముందుకు వచ్చేందుకు ఒక మార్గం లభించింది. నేను, శంకర్ మళ్ళీ అనుకున్నప్పటికీ ఇలాంటి చిత్రాన్ని నిర్మించలేమని కెమెరామెన్ రవివర్మన్ అంటున్నారు. కానీ, అలాంటి చిత్రాన్ని నిర్మించాం. అదే ‘ఇండియన్-2’ సినిమా. దేశంలో అవినీతి పెరిగిపోవడానికి కారణం కేవలం రాజకీయ నేతలు మాత్రమే కాదు. మనం కూడా. మనం లేకుంటే అవినీతి జరుగుతుందా?’’ అని కమల్ ప్రశ్నించారు. (Indian 2 Trailer Launch Event)
దర్శకుడు ఎస్. శంకర్ మాట్లాడుతూ.. ‘‘నేడు సమాజంలో నెలకొనివున్న పరిస్థితుల్లో ఇండియన్ తాత వస్తే ఎలా ఉంటుందన్నదే ఈ చిత్ర కథ. తొలి భాగం తమిళనాడులో జరిగే సంఘటనలతో తెరకెక్కించాం. రెండో భాగంలో రాష్ట్ర సరిహద్దులనుదాటి ఇతర రాష్ట్రాల్లో జరిగే సంఘటనలు కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ పార్ట్-2 అన్ని రాష్ట్రాల్లో జరిగే కథ. కాబట్టి ఇది చాలా పెద్దది. నేను సింగిల్ పార్ట్‌లోకి కుదించినట్లయితే ప్రతి సన్నివేశం యొక్క సోల్ మిస్ అవుతుంది.. అందుకే రెండు భాగాలుగా విభజించాను. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. దానికి కారణం కమల్ హాసన్. తొలి భాగానికి 40 రోజుల సమయం కేటాయిస్తే, రెండో భాగానికి 70 రోజులు ఇచ్చారు. మేకప్ వేయడానికి తీయడానికి ఒక గంట పట్టేది. అందుకే లొకేషన్‌కు అందరికంటే ముందు, సాయంత్రం అందరికంటే ఆఖరులో వెళ్ళేవారు. ఇందులో కమల్ హాసన్ నటన తొలి భాగం కంటే చాలా బాగా ఉంటుంది. హీరోకు ఎలాంటి ఛాలెంజెస్ ఇచ్చినా వాటిని అద్భుతంగా పూర్తి చేస్తారు. ఆయనపై సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో పలు సందర్భాల్లో ఆశ్చర్యపోయాను. సినిమాలోని ప్రతి ట్యూన్ వందకు వంద శాతం ఫర్ఫెక్ట్’’ అని శంకర్ పేర్కొన్నారు. ఆ తర్వాత సిద్ధార్థ్, అనిరుధ్, బాబీ సింహాతో పాటు లైకా ప్రొడక్షన్స్ హెడ్ తమిళ్ కుమరన్ తదితరులు మాట్లాడారు.
Read Latest Cinema News