అవి పరువు హత్యలు కాదు.. కక్షపూరిత గౌరవ హత్యలు
ABN, Publish Date - Nov 24 , 2024 | 10:05 AM
ప్రేమ వివాహాలు చేసుకున్న తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలను కారణంగా చూపి పరువు హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి పరువు హత్యలు కాదు.. కక్షపూరిత గౌరవ హత్యలు అని అన్నారు డీపీఐ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు తొల్ తిరుమావళవన్. ‘నెంజు పొరుక్కుదిల్లైయే’ ఆడియో వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
నవరస కలైకూడమ్ అనే పేరుతో కొత్తగా స్థాపించిన నిర్మాణ సంస్థ నిర్మించిన ‘నెంజు పొరుక్కుదిల్లైయే’ సినిమా సామాజిక దృష్టి కోణంలో నిర్మించారని డీపీఐ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు తొల్ తిరుమావళవన్ అన్నారు. ఈ సినిమాతో అరవింద్ రియో, కాళిదాస్ హీరోలుగా.. భువనేశ్వరి రమేష్ బాబు, నిత్యారాజ్ హీరోయిన్లుగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఇతర పాత్రల్లో జేసన్ కౌశి, శశికుమార్ తదితరులు నటించారు. చిత్ర నిర్మాత క్రీస్తుదాస్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. ఎంఎస్ సుదర్శన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కెమెరా అబ్దుల్ కె.రహమాన్. నిర్మాతలు క్రీస్తుదాస్, యోబు శరవణన్, బ్యూలా క్రీస్తుదాస్. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుక తాజాగా చెన్నైలో జరిగింది.
Also Read-Sreeleela: ‘పుష్ప2’ కిస్సిక్ సాంగ్ ప్రోమో విడుదల వేళ శ్రీలీల ఏం చేస్తుందో చూశారా..
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుమావళవన్ మాట్లాడుతూ.. ‘‘టైటిల్ ఎంపికలోనే సామాజిక బాధ్యతను గుర్తు చేస్తోంది. సినిమా తీస్తే సామాజిక సందేశంతో ఉండాలన్న బాధ్యత నేటి యువతలో ఉండటం సంతోషంగా ఉంది. ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రేమ సహజమైనది. ఇది సహజసిద్ధంగా కలుగుతుంది. సమాజంలో మార్పు కోసం ప్రేమ అనే ఆయుధాన్ని ఉపయోగించాలి. ప్రేమను కృత్రిమంగా సృష్టించలేం. ప్రేమ ఎంతటి ప్రభావాన్ని చూపిస్తున్నదే ముఖ్యం. ప్రేమ వివాహాలు చేసుకున్న తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలను కారణంగా చూపి పరువు హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి పరువు హత్యలు కాదు. కక్షపూరిత గౌరవ హత్యలు. తాము అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను హత్య చేయడమంటే కిరాతక చర్యతో సమానం.
పరువు హత్యలు, శిశు హత్యలు మన దేశంలోనే ఎక్కువ. ఈ రెండింటిని నిర్మూలించాలి. లింగవివక్ష లేకుండా సమాన హక్కులు కల్పించినపుడే ఈ పరిస్థితి మారుతుంది. ఇప్పటివరకు అనేక సినిమాలు వచ్చాయి. భవిష్యత్తులో వచ్చే సినిమాలు కూడా ఈ సందేశాన్ని ఇచ్చేలా ఉండాలి. ప్రేమను అంగీకరించ లేకపోవడానికి ప్రధాన కారణం మన సామాజిక నిర్మాణమే. మనకు ఇష్టం లేకపోయినా మనపై కులముద్ర వేస్తున్నారు. సమాజంలో ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ప్రేమను నేరంగా పరిగణిస్తున్నారు. ఇందులో స్త్రీ బాధితురాలిగా మారిపోతుంది. ఇలాంటి విషయాలన్నీ సినిమాల్లో ఎత్తి చూపాలి. చిత్రరంగంలోకి ప్రగతిశీల ఆలోచనపరులు రావాలి. ఒక మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు శుభాకాంక్షలు’’ అని అన్నారు. ఆ తర్వాత నిర్మాతలు, హీరో హీరోయిన్లు, యూనిట్ సభ్యులు ప్రసంగించారు.