Actress Devayani: మా ఇంటి పిల్లోడు.. ‘బాయ్స్‌’ న‌కుల్‌పై ప్రేమ పెంచుకున్నా

ABN, Publish Date - Jul 24 , 2024 | 03:51 PM

బాయ్స్ ఫేమ్ నకుల్ హీరోగా రూపొందించిన ‘వాస్కోడగామ’.తాజాగా ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ను చెన్పైలో రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ,న‌టులు త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

devayani

బాయ్స్ ఫేమ్ నకుల్ (Nakkhul) హీరోగా రూపొందించిన ‘వాస్కోడగామ’ (VascoDaGama)చిత్రాన్ని 44 మంది నటులతో 41 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసినట్టు దర్శకుడు ఆర్జీకే (RG krishnan) తెలిపారు. ఈ సినిమాను 5656 ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మాత దత్తో బి.సుభాస్కరన్ (Dato BSubaskaran) నిర్మించారని పేర్కొన్నారు.

సీనియర్‌ నటి దేవయాని ఇందులో ముఖ్య పాత్రను పోషించగా, ఇతర పాత్రల్లో కేఎస్‌ రవికుమార్‌, ఆర్థనా బిను, వంశీ కృష్ణ, ఆనంద్‌ రాజ్‌, మన్సూర్‌ అలీఖాన్‌, మునీష్‌కాంత్‌, రెడిన్‌ కింగ్‌స్లీ, ప్రేమ్‌ కుమార్‌, బడవ గోపి, నమో నారాయణ, రవి మారియ తదితరులు నటించారు. అరుణ్‌ ఎన్‌వీ సంగీతం అందించారు.

తాజాగా ఈ సినిమాను ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల మూవీ ఆడియో, ట్రైలర్‌ను చెన్పైలో రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్జీకే మాట్లాడుతూ... ‘చిత్ర పరిశ్రమలో నాకు తెలిసిన వ్యక్తి రజనీ మాత్రమే.

ఆయన్ను చూస్తూనే అన్నీ నేర్చుకున్నా. 40 యేళ్ల నకుల్‌తో హీరో పాత్రను చేయించాను. 44 నటులతో 41 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. మేం అనుకున్న విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాం. ఆ కంటెంట్‌ కచ్చితంగా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఆడియన్స్‌ పల్స్‌కు అనుగుణంగా రూపొందించాం. సినిమాను చూసిన తర్వాత మీడియా మిత్రులు బాగుంటే బాగుందని, లేదంటే లేదని రివ్యూల్లో స్పష్టంగా రాయండి’ అని పేర్కొన్నారు.


నటి దేవయాని మాట్లాడుతూ.. ‘హీరో నకుల్‌కు నాకు మంచి అనుబంధం ఉంది. మా ఇంటి పిల్లోడు. నా చిన్న తమ్ముడు. అతనిలో మంచి ప్రతిభ దాగి ఉంది. నేను నకుల్‌ అభిమానిని. ‘బాయ్స్‌’ చిత్రం ద్వారా అతనిపై ప్రేమ పెంచుకున్నాను. ఆ సినిమాలో అద్భుతంగా నటించాడు. మంచి స్టోరీ, మంచి దర్శకుడి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఆర్జీకే లభించారు. ఈ సినిమాను మొత్తం నకుల్‌ తన భుజాలపై మోశాడు. కచ్చితంగా మంచి బ్రేక్‌ ఇస్తుంది’ అన్నారు.

హీరో నకుల్ (Nakkhul) మాట్లాడుతూ.. ‘నా జీవితం అనేక మలుపులు తిరుగుతోంది. ‘బాయ్స్‌’ చిత్రంలో అనుకోని విధంగా అవకాశం వచ్చింది. చాలా కాలం తర్వాత మళ్లీ మరో మంచి సినిమాలో నటించాను. ‘వాస్కోడగామ’ సినిమా ప్రతి ఒక్కరినీ కడుపుబ్బ నవ్విస్తుంది.

స్టోరీ నరేట్‌ చేసే సమయంలోనే దర్శకుడు పడిపడి నవ్వారు. తెరపై కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా దర్శకుడు మాత్రం ధైర్యం కోల్పోకుండా చిత్రాన్ని పూర్తి చేశారు’ అని అన్నారు.

Updated Date - Jul 24 , 2024 | 04:35 PM