PTSir: విద్యా సంస్థల అధిపతి.. ఇలాంటి సినిమా చేయడం గ్రేట్
ABN, Publish Date - Jun 07 , 2024 | 09:05 AM
విద్యా సంస్థల అధిపతిగా ఉంటూ ఇలాంటి కథాంశంతో సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చిన నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలని హీరో హిప్‌హాప్ ఆది తెలిపారు. తాజాగా ఆయన నటించిన చిత్రం పీటీ సర్ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది.
నిర్మాతగా కొన్ని చిత్రాలు వసూళ్ళ పరంగా తృప్తినిస్తాయని, మరికొన్ని సక్సెస్‌తో పాటు సంతృప్తిని కూడా ఇస్తాయని, ఆ కోవలో ‘పీటీ సార్’ (PTSir) చిత్రం నిలిచిందని ఆ సినిమా నిర్మాత డాక్టర్ ఐసరి కె.గణేష్ (Ishari K. Ganesh)వెల్లడించారు. ఆ చిత్రం విజయోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నేటి కాలంలో ఒక చిత్రం రెండు మూడు రోజులకు మించి థియేటర్లలో ప్రదర్శన జరగడం లేదు.
కానీ, ఈ సినిమా రెండు వారాలు దాటినా విజయవంతంగా ప్రదర్శితమై ఇప్పటికే రూ.12 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని చాలా సంతోషంగా వెల్లడిస్తున్నాను. ‘పీటీ సార్’ (PTSir) సినిమా కలెక్షన్ల కంటే మంచి కథాంశాన్ని ప్రజలకు తెలియజెప్పామన్న తృప్తి మిగిలింది. మా బ్యానరులో ఒక మంచి చిత్రాన్ని నిర్మించాం. భవిష్యత్‌లో ఇలాంటి మంచి కథాంశంతో నిర్మించేందుకు మార్గదర్శకంగా నిలిచింది’ అని అన్నారు.
హీరో హిప్‌హాప్ ఆది ( Hiphop Tamizha Adhi) మాట్లాడుతూ, ‘ఈ సినిమా మీడియా మిత్రుల వల్లే సక్సెస్ సాధించింది. మంచి కంటెంట్ ఉన్న కథా చిత్రాన్ని మీడియా ఎన్నడూ విస్మరించిన సందర్భాలు లేవు. ఇలాంటి మంచి కంటెంట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకు ధన్యవాదాలు. అతిపెద్ద విద్యా సంస్థకు అధిపతి అయిన ఐసరి కె.గణేష్ (Ishari K. Ganesh) ఈ కథను అంగీకరించి సొంతంగా నిర్మించడమంటే చాలా గొప్ప విషయం.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను. వేల్స్ నిర్మాణ సంస చిత్రాల్లో నటించకపోయినా ఫర్లేదు.. ఇలాంటి మంచి వ్యక్తితో స్నేహం మాత్రం కొనసాగించాలన్నదే నా ఆకాంక్ష’ అని పేర్కొన్నారు. దర్శకుడు కార్తీక్ వేణుగోపాలన్ మాట్లాడుతూ, ‘ విద్యా సంస్థల అధిపతిగా ఉంటూ ఇలాంటి కథాంశంతో సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చిన నిర్మాత ఐసరి గణేశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాశ్మీర (Kashmira Pardeshi) నటించింది.