Kottukaali: అవార్డుల కోసం ఎవరూ సినిమాలు తీయలే.. మా చిత్రానికి సంగీత దర్శకుడు లేడు!
ABN, Publish Date - Jul 29 , 2024 | 10:26 AM
అవార్డుల కోసం ఏ ఒక్క దర్శకుడు సినిమాలను రూపొందించరని, ఆ చిత్రం కంటెంట్ బాగుంటే అవార్డులు వరిస్తాయని ‘కొట్టుక్కాలి’ చిత్ర దర్శకుడు పీఎస్ వినోద్‌రాజ్ అన్నారు.
అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డుల కోసం ఏ ఒక్క దర్శకుడు సినిమాలను రూపొందించరని, ఆ చిత్రం కంటెంట్ బాగుంటే అవార్డులు వరిస్తాయని ‘కొట్టుక్కాలి’ చిత్ర దర్శకుడు పీఎస్ వినోద్‌రాజ్ (PS Vinothraj) అన్నారు. ఈయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘కూళంగల్’ అనేక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివళ్లలో అవార్డులను గెలుచుకోవడమే కాకుండా ప్రేక్షకాదారణ పొందింది. రెండో చిత్రంగా ‘కొట్టుక్కాలి’(Kottukaali)ని రూపొందించారు. సూరి (Soori), అన్నా బెన్ (Anna ben) జంటగా నటించిన ఈ చిత్రాన్ని హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఎస్‌కే ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. వచ్చే నెల 23వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం వివరాలను దర్శకుడు పీఎస్ వినోద్‌రాజ్, సహ నిర్మాత కలైలు విలేకరులకు వివరించారు.
‘ఈ సినిమా ద్వారా మలయాళ నటి అన్నాబెన్ (Anna ben) కోలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు. ట్రాన్సిల్వేనియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది. నా తొలి చిత్రం ‘కూళంగల్’ కూడా అనేక అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా కూడా ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకుంది.
వాస్తవిక జీవన పరిస్థితులకు అద్దంపట్టేలా సినిమా తీస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు అవార్డులు రివార్డులు వాటంతట అవే వస్తాయి. నా రెండు చిత్రాలు దీన్ని నిరూపించాయి. నేను రాసుకున్న స్క్రీన్‌ప్లేను యథావిధిగా తెరపై చూపించేందుకు హీరో శివకార్తికేయన్ అవసరమైన ఆర్థిక సాయంతో అండగా ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎదురైన, ఎదుర్కొంటున్న సంఘటనల సమూహారమే ఈ చిత్ర కథ.
ఇది ఒక జర్నీ స్టోరీ. ఆ ప్రయాణంలో ఒక గ్రామ ప్రజల జీవనగాథను వివరించాం. ఇందులో కోడిపుంజు కూడా ఒక పాత్రగా సాగుతుంది. ‘కొట్టుక్కాలి’... ఒక గ్రామంలో ఎంతో ధైర్యసాహసాలతో చలాకీగా ఉండే ఒక మహిళ పాత్ర ఈ సినిమాలో హీరోయిన్‌ది అందుకే చిత్రానికి ‘కొట్టుక్కాలి’ అనే పేరు పెట్టాం. సూరి ఇప్నుడు కమర్షియల్ హీరో కావడంతో ఆయన పాత్ర మరో పరిణామం క్రమంలో ఉంటుంది.
ఈ సినిమాకు సంగీత దర్శకుడు లేరు. సహజ సిద్ధమైన ధ్వనులను ఆయా సన్నివేశాలకు అనుగుణంగా సంగీతంగా ఉపయోగించాం. సినిమా చూస్తుంటే సంగీతం లేదనే భావన కలగదు. ఇది ఒక రకంగా ప్రయోగమనే చెప్పాలి. ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. ఇది ఒక అడమెంట్ గర్ల్ స్టోరీ. స్త్రీపై భూతవైద్యం, వశీకరణ, పితృస్వామ్యం, మహిళల పట్ల జరిగే అన్యాయాలను ముఖ్యాంశాలుగా చూపించాం’ అని వారు వివరించారు.