Suriya: డ్యాన్స్ రాదన్నారు. ఫైట్స్ రావన్నారు.. మరి ఇప్పుడు..
ABN, Publish Date - Oct 27 , 2024 | 04:16 PM
"కెరీర్‌లో ఎత్తు పల్లాలు సహజం. ఆ విషయంలో నేను ఏమాత్రం బాధపడటం లేదు. వైఫల్యాలను అనుభవిస్తేనే సక్సెస్‌ను ఎంజాయ్ చేయగలం’’ అని తమిళ హీరో సూర్య (Suriya) అన్నారు.
"కెరీర్‌లో ఎత్తు పల్లాలు సహజం. ఆ విషయంలో నేను ఏమాత్రం బాధపడటం లేదు. వైఫల్యాలను అనుభవిస్తేనే సక్సెస్‌ను ఎంజాయ్ చేయగలం’’ అని తమిళ హీరో సూర్య (Suriya) అన్నారు. తాజాగా ఆయన హీరోగా శివ (Director Siva) దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువా’. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. శనివారం చెన్నైలో ‘కంగువా’ (Kanguva) ఆడియో రిలీజ్ చేశారు. ఈ వేదికపై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘వెనక్కి వెళ్లి చూస్తే ఐదేళ్ల క్రితం మరోలా ఉండేవాడిని. సోషల్‌మీడియా వేదికగా ఎవరైనా నెగటివ్ కామెంట్స్ చేస్తే వాటిని చూసినప్పుడు విక్రమ్‌లో పోషించిన ‘రోలెక్స్’లా మారిపోయేవాడిని. కోపం కట్టులు తెంచుకునేది. కానీ, క్షమించడం ఎంతో అందమైన విషయమని దర్శకుడు శివ వల్ల తెలిసింది. ఎవరైనా ద్వేషించినా.. మీరు ప్రేమను మాత్రమే పంచండి. ప్రతికూల కామెంట్స్‌కు రిప్లైలు ఇచ్చుకుంటూ మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఇక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ నాకు సొంత ఇంటితో సమానం. జ్ఞానవేల్‌తో మంచి అనుబంధం ఉంది. ఆ సంస్థ వల్లే 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రారంభించగలిగా. నా సోదరుడు కార్తిని సినిమాల్లోకి పరిచయం చేసిన వ్యక్తి జ్ఞానవేల్’’ అని అన్నారు.
డ్యాన్స్ రాదన్నారు.. కానీ ఫైటర్‌లా..
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న తన తోటి నటులు ఉదయనిధి స్ట్టాలిన్, విజయ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. వారిద్దరూ మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కార్తి.. సూర్య గురించి మాట్లాడారు. ‘‘డ్యాన్స్ రాదన్నారు. ఫైట్స్ రావు అన్నారు. మంచి బాడీ లేదన్నారు. ఇప్పుడు ఫైటర్‌లా సిద్థమయ్యాడు. ఈ సినిమా కోసం సూర్య ఎంతో కష్టపడ్డాడు’’ అని అన్నారు. ‘ఖైదీ 2’లో సూర్య కూడా భాగమేనని అన్నారు. చిత్రీకరణ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుందని చెప్పారు.
తలైవా విషెస్..
సూర్య నటించిన ‘కంగువా’ సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ వీడి?యో సందేశం పంపించారు. ‘‘ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. ‘కూలీ’ షూట్ కారణంగా నేను రాలేకపోయా. దర్శకుడు శివ గతంలో నాతో వర్క్ చేశారు. పీరియాడికల్ స్టోరీ ఏదైనా చేద్దామని తరచూ చెబుతుండేవాడిని. నాకు తెలిసి ‘కంగువా’ కథ నా కోసమే రాసి ఉంటారు (నవ్వుతూ). చివరకు అది సూర్య వద్దకు చేరింది. ట్రైలర్ బావుంది. సూర్య గొప్ప నటుడు. పాత్ర కోసం ఎంతో కష్టపడుతుంటాడు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు.