Asmin: తమిళంలో దూసుకుపోతున్న.. శ్రీలంక గేయరచయిత
ABN, Publish Date - Sep 05 , 2024 | 06:48 PM
హీరో విజయ్ ఆంటోనీ నటించిన ‘నాన్’ చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమైన శ్రీలంక గేయరచయిత పొట్టువిల్ అస్మిన్ ఇప్పుడు కోలీవుడ్‌లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ బిజీ అయిపోయారు.
హీరో విజయ్ ఆంటోనీ నటించిన ‘నాన్’ చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమైన శ్రీలంక గేయరచయిత పొట్టువిల్ అస్మిన్ (Pottuvil Asmin) ఇప్పుడు కోలీవుడ్‌లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ బిజీ అయిపోయారు. ఆయన రచించిన ‘అయ్యోసామి నీ ఎనక్కు వేణామ్’ అనే ఆల్బమ్ పాటకు విశేష ఆదరణ లభించింది. ఈ పాటను యూట్యూబ్‌లో ఆరు కోట్ల మంది వీక్షించారు. తమిళంలో ‘పీపుల్స్ అవార్డు’ గెలుచుకున్న తొలి తమిళ పాటగా నిలిచింది.
ఆ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కొచ్చడియాన్’, ‘అన్నాత్త’, అజిత్ కుమార్ ‘విశ్వాసం’ వంటి చిత్రాల ప్రోమో పాటలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ప్రస్తుతం చేతిలో ‘తిరుంబిపార్, ‘బైలా’, ‘యుఆర్ నెక్స్ట్’, ‘ది స్టూడడియో’, ‘బైనాక్యులర్’, ‘నాలైయ మాట్రమ్’, ‘గామా’ వంటి చిత్రాలతో పాటు పేర్లు ఖరారు చేయని అనేక సినిమా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సినిమాలకు అద్భుతమైన పాటలను అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
తమిళ చిత్రపరిశ్రమలో కవి పేరరసుగా పేరొందిన వైరముత్తు ప్రశంసలు కూడా అస్మిన్ అందుకున్నారు. వైరముత్తు కలైంజర్ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని ‘కవితలు 100’ పేరుతో రూపొందించిన కవితా సంకలనంలో అస్మిన్ రాసిన కవితకు స్థానం దక్కడం విశేషం. శ్రీలంకకు చెందిన పొట్టువిల్ అస్మిన్‌కు తమిళ భాషపై మంచి పరిఙ్ఞానంతో పాటు ఆసక్తి ఉండటంతో దేశ సరిహద్దులకు ఆవల కూడా అద్భుతంగా రాణిస్తున్నారు.