South indian Cinema: సౌత్‌ సినిమా తన స్థాయిని తానే తగ్గించుకుంటోందా

ABN, Publish Date - Jul 14 , 2024 | 11:07 AM

ఎంతో గౌరవాన్ని అందుకున్న సౌత్‌ సినిమా తన స్థాయిని తానే తగ్గించుకుంటోందా! డ్రగ్స్‌, వివాహేతర సంబంధాలు, లైంగిక వేధింపులు, బహిరంగ దూషణలు.. ఒకటేమిటి రకరకాలుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తూ నిత్యం జనం నోళ్లలో నానుతోంది.

ఎంతో గౌరవాన్ని అందుకున్న సౌత్‌ సినిమా (South Cinema) తన స్థాయిని తానే తగ్గించుకుంటోందా! డ్రగ్స్‌, వివాహేతర సంబంధాలు, లైంగిక వేధింపులు(Sexual harassments), బహిరంగ దూషణలు.. ఒకటేమిటి రకరకాలుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తూ నిత్యం జనం నోళ్లలో నానుతోంది. టాలీవుడ్‌ ఒక్కటే కాదు, మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌, కోలీవుడ్‌... పరిశ్రమ ఏదైనా ఈ ఏడాది ఆరంభం నుంచి ఏదో ఒక వివాదంతో జనం నోళ్లలో నానుతోంది.

2017లో టాలీవుడ్‌ మెడకు చుట్టుకున్న డ్రగ్స్‌ కేసు (Drugs case) ఇప్పటికీ వదలడం లేదు. పరిశ్రమలోని కొన్ని పెద్ద తలకాయలే పోలీసుల విచారణకు హాజరయ్యారు. నెలల తరబడి విచారణ, రక్త నమూనాల సేకరణ, న్యాయస్థానాల విచారణలతో వార్తల్లో నిలిచింది. నిజానిజాల సంగతి ఎలా ఉన్నా టాలీవుడ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పేం లేదు. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు డ్రగ్స్‌ కేసులో దొరకడం, అరెస్టవడం లాంటి సంఘటనలతో పరిశ్రమ వైపు వేలెత్తి చూపే పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్ట్‌అయిన నటి హేమ వ్యవహారంలో హడావిడి తెలిసిందే.

ఇదిలా సద్దుమణిగిందో లేదో రాజ్‌తరుణ్‌ అతని మాజీ ప్రియురాలు లావణ్య కేసు తెరపైకి వచ్చింది. ఇందులో వర్ధమాన కథానాయిక మాల్వీ మల్హోత్రా పేరు తెరపైకి వచ్చింది. కేసులు, విమర్శలు, పోటాపోటీ ఇంటర్వ్యూలతో ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు. ప్రేమ, పెళ్లి, వివాహేతర సంబంధం ఇలా పలు కోణాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో వినోదం పంచుతున్నారు.


అభిమానినే హత్య చేసిన హీరో

ప్రియురాలు కోసం సొంత అభిమానినే చంపుకున్న హీరోగా చీత్కారాలకు గురువుతున్నాడు కన్నడ హీరో దర్శన్‌. రేణుకా స్వామి అనే అభిమానిని చిత్ర హింసలు పెట్టి చంపిన ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. హత్య కేసులో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు దర్శన్‌. తొలుత ఈ కేసులో కన్నడ అగ్రహీరో కిచ్చా సుదీప్‌ పేరు వినిపించినా, ఆ తర్వాత ఆయన ప్రమేయం లేదని విచారణలో తేలింది.

మరోసారి బెడ్‌ రూమ్‌ వీడియోలతో

కొన్నేళ్ల క్రితం కోలీవుడ్‌ హీరోలు, హీరోయిన్ల బెడ్‌రూమ్‌ వీడియోలు లీక్‌ అవ్వడం సంచలనం సృష్టించింది. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో మళ్లీ ఆ వీడియోల గొడవ మొదలైంది. సుచీ లీక్స్‌ పేరుతో కొన్నేళ్ల క్రితం తమిళ హీరో, హీరోయిన్ల శృంగార వీడియోలు, రహస్యాలు బయటకు వచ్చి సన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. అయితే ఆ వీడియోలు బయటకు రావడంలో త్రిష, ధనుష్‌ పాత్ర ఉందంటూ గాయని సుచిత్ర తాజాగా ఆరోపణలు చేస్తున్నారు.

గతేడాదిచివర్లో కోలీవుడ్‌ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ కథానాయిక త్రిషపై తన వాచాలత్వాన్ని ప్రదర్శించాడు. ‘త్రిషతో బెడ్‌రూమ్‌ సీన్‌ కావాలి’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ‘లియో’ సినిమాలో తాను త్రిషపై అత్యాచారం చేసే సన్నివేశం లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ‘గతంలో ఖుష్బూ, రోజా లాంటి నటీమణులతో రేప్‌ సీన్లు చేశాను. లియోలో అవకాశం వచ్చినప్పుడు అలాంటి సీన్‌ ఉంటుందని ఆశించాను. అది జరగ్గపోవడంతో నిరాశపడ్డాను’ అని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. తమిళ పరిశ్రమ ప్రముఖులు కొందరు మన్సూర్‌ వ్యాఖ్యలను ఖండించారు.

మాలీవుడ్‌లో మల్టీప్లెక్స్‌ వివాదం

అయితే వీటన్నింటికి భిన్నమైన వివాదంతో ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమ వార్తల్లో నిలిచింది. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన మాలీవుడ్‌ చిత్రాలు పర భాషల్లోకి డబ్‌ అయ్యి మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. ‘ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మెల్‌ బాయ్స్‌’ లాంటి మలయాళ సినిమాలు పరభాషల్లోనూ ఆదరణ పొందాయి. అయితే పృథ్వీరాజ్‌ కథానాయకుడిగా నటించిన ‘ఆడుజీవితం’ చిత్రం ప్రదర్శనను మల్టీప్లెక్స్‌లు నిలిపివేశాయి. వర్చువల్‌ ప్రింట్‌ ఫీజుకు సంబంధించి మల్టీప్లెక్స్‌ సంస్థలు, కేరళ సినీ నిర్మాతల సంఘానికి మధ్య ఏర్పడిన వివాదమే దీనికి కారణం. అకస్మాత్తుగా సినిమాను ఎత్తేయడంతో నిర్మాతలకు నష్టం వాటిల్లింది. దీంతో ఇకపై ఏ మలయాళ సినిమాను మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శించేందుకు ఇవ్వబోమని కేరళ సినీ నిర్మాతల సంఘం హెచ్చరించడం, కేరళ ప్రభుత్వం రంగంలోకి దిగి చర్చలు జరపడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

Updated Date - Jul 14 , 2024 | 04:05 PM