Radikaa Sarathkumar: క్యాస్టింగ్ కౌచ్ నిజమే.. నా కళ్ల ఎదుటే జరిగాయి.
ABN, Publish Date - Sep 05 , 2024 | 06:16 PM
జస్టిస్ హేమ కమిషన్ నివేదికపై చిత్రపరిశ్రమకు చెందిన అగ్రనటీనటులు మౌనం వహించడాన్ని సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మౌనాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారని, అందువల్ల ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను బహిర్గతం చేయాలని ఆమె కోరారు.
జస్టిస్ హేమ కమిషన్ నివేదికపై చిత్రపరిశ్రమకు చెందిన అగ్రనటీనటులు మౌనం వహించడాన్ని సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ (Radikaa Sarathkumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మౌనాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారని, అందువల్ల ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను బహిర్గతం చేయాలని ఆమె కోరారు. తాను ప్రధాన పాత్రలో నటించిన ‘తాయమ్మ’ (Thayamma Kudumbathaar) టీవీ సీరియల్ దూరదర్శన్ చానెల్‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీనిని పురస్కరిచుకుని ఆ సీరియల్‌లో నటించిన నటీనటులతో పాటు దర్శక నిర్మాతలంతా కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రాధిక (Radikaa Sarathkumar) మాట్లాడుతూ, చిత్రపరిశ్రమలో నటీమణులపై జరుగుతున్న లైంగిక వేధింపులపై పలువురు సీనియర్ హీరోలు నో కామెంట్స్ అంటూ మౌనం వహించడం సరికాదు. వారి మౌనాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవడమే కాకుండా అంగీకారంతో సమానంగా భావించే పరిస్థితి వస్తుందన్నారు. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న మాట నిజమే. నా కళ్ళ ఎదుటే పలు సంఘటనలు జరిగాయి. వాటిని నేను అక్కడే ఎదిరించారు. బాధితులకు అండగా నిలబడ్డాను. ప్రముఖ హీరోను పెళ్ళి చేసుకున్న ఓ హీరోయిన్‌కు సైతం ఈ తరహా వేధింపులు జరిగాయి. ఆ సమయంలో ఆమెకు నేను అండగా ఉన్నానన్నారు.
తమ సంస్థ రాడాన్ మీడియా వర్క్స్‌లో పనిచేసే ప్రతి నటి బాధ్యత మేమే తీసుకుంటాం. అలాగే, సినిమాలో నటించే హీరోయిన్‌తో పాటు జూనియర్ ఆర్టిస్టులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆయా చిత్ర నిర్మాతలు, ప్రొడక్షన్ యూనిట్‌దే. ఒక సంఘటన జరిగితే బాధితురాలికి న్యాయం జరిగేందుకు కొన్నేళ్ళ పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి. ఉదాహరణకు నిర్భయ కేసే తీసుకోండి. ఈ కేసు పూర్తయ్యేందుకు ఎనిమిదేళ్లు పట్టింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో అగ్రస్థానంలో ఉన్న నటీనటులు చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. సమాజం కోసం ఆందోళనలు చేసే ముందు సోదర భావంతో తోటి నటీమణుల బాధను అర్థం చేసుకుని వాళ్ళకు మద్దతు తెలియజేయండి’ అని విజ్ఞప్తి చేశారు.
లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు: సినీ నటుడు శరత్ కుమార్
ఎవరైనా లైంగిక వేధింపుల విషయంపై తనకు ఫిర్యాదు చేసే తక్షణ చర్యలు తీసుకుంటానని సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarathkumar) తెలిపారు. బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ శ్రీనివాసన్ 61వ జన్మదిన వేడుకల్లో శరత్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జస్టిస్ హేమ కమిషన్ నివేదికపై స్పందించాలంటే, ఆ కమిటీ తయారు చేసిన 160 పేజీల నివేదికను క్షుణ్ణంగా చదివిన తర్వాత కామెంట్స్ చేస్తానని తెలిపారు. అదేసమయంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎవరైనా తన దృష్టికి తీసుకొచ్చినా, ఫిర్యాదు చేసినా తక్షణం చర్యలు తీసుకుంటానని, అలాగే, న్యాయపరమైన చర్యలు తీసుకునేలా దృష్టిసారిస్తానని తెలిపారు.