Pavithra Gowda: అతనికి చెప్పకుండా ఉంటే ఈ హత్య జరిగేది కాదు!
ABN, Publish Date - Jun 14 , 2024 | 04:20 PM
కన్నడ నటుడు దర్శన్ వ్యక్తిగత కారణాలతో తన అభిమాని రేణుక స్వామిని హత్య చేయించాడనే వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
కన్నడ నటుడు దర్శన్(Darshan) వ్యక్తిగత కారణాలతో తన అభిమాని రేణుక స్వామిని (Renuka swami) హత్య చేయించాడనే వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. దర్శనం తన అభిమానిని హత్య చేయడానికి కారణం తన ప్రేయసి పవిత్ర గౌడ కారణమని పోలీసులు వెల్లడించారు. తాజాగా ఈ విషయంపై పవిత్ర గౌడ (Pavithra gowda) స్పందించారు. తనకు అశ్లీల చిత్రాల పంపించిన విషయాన్ని తన ప్రియుడు- కథానాయకుడు దర్శన్ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉంటే ఈ హత్య జరిగేది కాదని ఆ కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న కథానాయిక పవిత్ర గౌడ పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేశారు. తానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని విచారణలో అధికారులతో ఆమె చెప్పి రోదించింది. రేణుకా స్వామి హత్య కేసుకు సంబంధించి బుధవారం జరిగిన విచారణలో ధీమాగా ఉన్న ఆమె గురువారం విచారణ సమయంలో ఎక్కువ ఆందోళనకు గురైందని చెబుతున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు ఇప్పటికే తలా రూ.5 లక్షలు తీసుకున్న కొందరి నుంచి నగదు జప్తు చేసేందుకు అన్నపూర్ణేశ్వరినగర్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
బూటు కాలితో రేణుకాస్వామి మర్మాంగంపై తన్నడంతో అతను మరణించాడని ఇప్పటి వరకు నిర్వహించిన విచారణలో ఇతర నిందితులు పోలీసులకు వివరించారు. ‘మొదట అతని మొహంపై దర్శన్ పిడిగుద్దులు కురిపించాడు. కింద పడుతున్న స్వామి తల పక్కనే నిలిపి ఉంచిన టెంపో కి తగిలింది. స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంటున్న అతని మర్మావయాలపై దర్శన్ తన్నడంతోనే మరణించాడు’ అని నిందితులు పోలీసుల విచారణ సమయంలో వివరించారని సమాచారం. మరణానంతరం నిర్వహించిన పరీక్షల నివేదిక లో రేణుకా స్వామి మరణానికి ఇదే కారణమని పోలీసులు గుర్తించారు.
తన తండ్రి దర్శన్, తల్లి విజయలక్ష్మికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత అవసరం అని వారి కుమారుడు వినీశ్ తూగుదీప సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘తన తండ్రిని అశ్లీల పదాలతో దూషిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు’ అంటూ ఆవేదనతో మరో పోస్టు పెట్టాడు. ఈ మేరకు వినీష్ తన పోస్ట్‌లో ఏమన్నారంటే.. నా తండ్రి హత్య చేసి ఉంటారని నేను నమ్మడం లేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆ పని ఎవరు చేశారో బయట పడుతుంది’’ అని అన్నారు.
‘డెవిల్’ సినిమాకు దర్శన్ రూ.22 కోట్లు తీసుకున్నాడని ఆ చిత్ర దర్శకుడు ప్రకాశ్ వీర్ పేర్కొన్నారు. ‘కాటేర’ సినిమా విజయవంతమైన అనంతరం దర్శన్ తాజాగా డెవిల్ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమా ఇప్పటికే 25 రోజుల చిత్రీకరణ పూర్తయింది. చిత్రీకరణ సమయంలో ఎడమ చేతికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. చిత్రీకరణ వాయిదా పడింది. బుధవారం ఆయన చిత్రీకరణలో పాల్గొనేందుకు గ్రీనసిగ్నల్ ఇవ్వగా ఈలోపే హత్య కేసులో పోలీసులు దర్శన్‌ను అరెస్టు చేశారు’’ అని దర్శకుడు చెప్పారు.