PA Ranjith: తలైవాకే షరతులు పెట్టాను.. అవేంటి అంటే.. 

ABN, Publish Date - Aug 18 , 2024 | 03:10 PM

"సినిమా రంగానికి రాకముందు ‘సినిమా తీయటం ఇంత సులభమా’ అనిపించేది. రకరకాల ఆలోచనలు మనసులో ఉండేవి. సినీ రంగానికి వచ్చిన తర్వాత సినిమా తీయటం ఎంత కష్టమో అర్థమయింది’’ అని దర్శకుడు పా.రంజిత్

"సినిమా రంగానికి రాకముందు ‘సినిమా తీయటం ఇంత సులభమా’ అనిపించేది. రకరకాల ఆలోచనలు మనసులో ఉండేవి. సినీ రంగానికి వచ్చిన తర్వాత సినిమా తీయటం ఎంత కష్టమో అర్థమయింది’’ అని దర్శకుడు పా.రంజిత్ (Pa Ranjith) అన్నారు. తొలుత ఆయన దర్శకుడు వెంకట ప్రభు చెంత అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛతో సినిమా తీయగలమనే నమ్మకం కుదిరింది.  ‘అట్టకత్తి’, ‘మద్రాసు వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన జర్నీ గురించి చెప్పుకొచ్చారు పా.రంజిత్.


నా సినిమాలకు ఒక మోడల్‌ లేదు...
కెరీర్‌ బిగినింగ్‌లో నాకు పెద్ద నటులతో సినిమా తీయాలని ఉండేది కాదు. ఎందుకంటే వారు నా కథల్లో కలగజేసుకొనే అవకాశం ఉంది. అంతే కాకుండా నా దగ్గర మాస్‌ మసాలా స్టోరీలు కూడా ఏవీ లేవు. అందువల్లే మొదట్లో నేను ఒక మంచి ప్రొడ్యుసర్‌ కోసం వెతికేవాడిని.. అదృష్టవశాత్తు నాకు సి. కుమార్‌ దొరికారు. ఆయనకు కూడా సినీ రంగం కొత్తే! మేమిద్దరం కలిసి ‘అట్టకత్తి’ తీశాం. దీనితో నాకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ‘మద్రాసు’ స్ర్కిప్ట్‌ తయారుచేసుకున్నా. ఇది పూర్తిగా పొలిటికల్‌ ఫిల్మ్‌. ముందు కార్తీతో చేద్దామనుకున్నాం. కానీ కుదరలేదు. చివరకు మళ్లీ కార్తీనే పెట్టుకున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. నా తరహా సినిమాలకు ఒక మోడల్‌ లేదు. అంటే అవి ఆడుతాయో లేదో, వాటిని ఎన్ని డబ్బులు వస్తాయో తెలీదు. కాబట్టి అందరూ భయపడేవారు. ‘మద్రాసు’ ఒక మోడల్‌ను క్రియేట్‌ చేసింది. ఆ తర్వాత నాతో పనిచేయటానికి అనేకమంది ముందుకు వచ్చారు. తదుపరి సూపర్‌స్టార్‌ రజినీకాంత కాలా, కబాలి చిత్రాలు చేశా.



నా కథను కదపవద్దు అన్నాను...

రజనీకాంత్‌ సార్‌తో పనిచేయటం భిన్నంగా ఉంటుంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు చూశాను. కానీ ఆయనతో సినిమా చేసే ముందు ఆయనను ఒక స్టార్‌ హీరో అనుకోలేదు. ఆర్టిస్టు అనుకున్నానంతే! ‘కబాలి’లో నేను ఎలా అనుకున్నానో ఆయన ఆలా చేశారు. ‘కబాలి’ స్ర్కిప్ట్‌ ఆయనకు చెప్పినప్పుడు ఆయన చాలా ఎగ్జైట్‌ అయ్యారు. ‘‘దీనిలో నాకు వయస్సు ఎక్కువ. నాకు ఎలాంటి డ్యూయెట్స్‌ లేవు. ఎక్కువ ఫైట్స్‌ లేవు. పైగా నాకో కూతురు ఉంది. వాస్తవానికి దగ్గరగా ఉంది. నేను ఫ్రెష్‌గా చేద్దామనుకుంటున్నా. ఈ కథ తప్పకుండా చేస్తా’’ అన్నారు. అయితే అక్కడ ఆయనకు నేను ఒక షరతు పెట్టాను. ‘‘సర్‌... ఇది నా స్క్రిప్ట్. దీనిలో ఎలాంటి మార్పులు చేయను. మీకు ఇష్టమయితే చేద్దాం. లేకపోతే ఇక్కడితో వదిలేద్దాం’’ అన్నాను. ఆయన నా షరతుకు అంగీకరించారు. ఆ సినిమాలో ఆయన నాకు పూర్తిగా సహకరించారు. ‘కబాలి’ తర్వాత ఆయన పేరు మరింత పెరిగింది. సినిమా హిట్‌ అయిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్తే- ‘‘నీతో తొమ్మిది సినిమాలు చేయాలనుంది. చేద్దామా’’ అన్నారు. నేను షాక్‌ తిన్నా. ‘కాలా’ తర్వాత కూడా ఆయన అదే మాట మీద ఉన్నారు. ఆయనకు నా రాజకీయ సిద్థాంతాలు, పనితీరు అర్థమయ్యాయి. ప్రస్తుతం ‘తంగలాన్‌’ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. తదుపరి తమిళంలో ఒకటి, హిందీలో ఒకటి సినిమాలు చేయాలి. హిందీలో ‘బిర్సా ముండా’ జీవిత కథను తీస్తున్నా. 

Updated Date - Aug 18 , 2024 | 03:10 PM