Nassar: ఏకపక్ష నిర్ణయాలకు ‘నడిగర్‌’ వ్యతిరేకం

ABN, Publish Date - Nov 05 , 2024 | 07:55 PM

తమిళనాడు చలన చిత్ర నిర్మాతల మండలి గతంలో విడుదల చేసిన ప్రకటన ఏకపక్షమని, ఇలాంటి వాటికి నడిగర్‌ సంఘం పూర్తిగా వ్యతిరేకమని ఆ సంఘం అధ్యక్షుడు, సీనియర్‌ నటుడు నాజర్ స్పష్టం చేశారు.

nasaar

ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త చిత్రాల ప్రారంభోత్సవాలు, షూటింగులను నిలివేయాలని తమిళనాడు చలన చిత్ర నిర్మాతల మండలి గతంలో విడుదల చేసిన ప్రకటన ఏకపక్షమని, ఇలాంటి వాటికి నడిగర్‌ సంఘం (Nadigar Sangam) పూర్తిగా వ్యతిరేకమని ఆ సంఘం అధ్యక్షుడు, సీనియర్‌ నటుడు నాజర్ (Nassar) స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఆయన తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

‘తమిళనాడు చలనచిత్ర నిర్మాతల మండలి షూటింగులను బంద్‌ చేయాలంటూ ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరిలో గందరగోళం నెలకొనేలా చేసింది. ఈ తరహా ఏకపక్ష నిర్ణయం ఒక్క సినీ నిర్మాణ కార్మికులకే కాకుండా, నిర్మాతలకు కూడా హాని చేస్తుంది. ఇలాంటి విషయాల్లో అందరూ కలిసి తీసుకునే నిర్ణయాలు చిత్రపరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ మేలు చేస్తాయి. అంతేకానీ ఏకపక్షంగా, ఇష్టారాజ్యంగా తీసుకునే నిర్ణయాలకు నడిగర్‌ సంఘం తీవ్ర వ్యతిరేకం. తమిళ చిత్రపరిశ్రమ, సినీ నిర్మాణ కార్మికుల సంఘం సంఘటితంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా నడిగర్‌ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుంది. భవిష్యత్‌లో కూడా తమ సపోర్టు కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 07:55 PM