Nivin Pauly: స్టార్ హీరోకి క్లీన్ చిట్.. నటి ఫిర్యాదు

ABN, Publish Date - Nov 07 , 2024 | 06:36 AM

మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక గురించి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు నటీమణులు తమపై లైంగిక ఆరోపణలు చేశారంటూ ప్రముఖ నటులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌కు మోహన్‌లాల్‌ రాజీనామా చేశారు. తాజాగా ఓ స్టార్ హీరోకి ఈ కేసుల నుండి విముక్తి కలిగించింది. ఇంతకీ ఆ హీరో ఎవరు, కోర్ట్ ఏమంది అంటే..

కొన్ని నెలల క్రితం మలయాళ చిత్ర పరిశ్రమపై జస్టిస్‌ హేమ కమిటీ (hema committee) ఇచ్చిన నివేదిక అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ కలకాలం రేపింది. మాలీవుడ్‌లో (mollywood) లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. కాగా ఓ నటి.. ప్రేమమ్ ఫేమ్ స్టార్ హీరో నివిన్‌ పౌలిపై (nivin Pauly) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, గత నవంబరులో ఆమెను దుబాయ్‌ తీసుకెళ్లారు. అక్కడే ఆమెను లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు నివిన్‌ పౌలీ సహా ఆరుగురిపై నాన్‌-బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన కోర్టు నివిన్ కి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతకీ ఏమైందంటే..


ఈ ఆరోపణల్లో ఓ నిర్మాత కూడా ఉన్నాడు. నిందితుల జాబితాలో నివిన్‌ పౌలీని ఆరో వ్యక్తిగా చేర్చారు. నివిన్‌పై కేసు నమోదైన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయినా విషయం తెలిసిందే. కాగా విచారణ చేపట్టిన కోర్టు నెల రోజుల తర్వాత నివిన్ పౌలికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఫిర్యాదు చేసిన నటిని లైంగికంగా వేధించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. సదరు నటి ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం ఆ సమయంలో నివిన్ పౌలి అక్కడ లేరని డీవైఎస్పీ నేతృత్వంలోని విచారణ బృందం కేరళలోని కొత్తమంగళం కోర్టుకు నివేదికను సమర్పించింది. దీంతో ఆరోపణలు ఎదురుకుంటున్న జాబితాలో ఆరో వ్యక్తిగా ఉన్న ఆయన పేరును తొలిగించారు. మిగిలిన ఐదుగురిపై విచారణ కొనసాగుతుంది. దీంతో కష్ట సమయాల్లో తనకి అండగా నిలిచినా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేసారు నివిన్ పౌలి. దీంతో నివిన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.


ఇప్పటికే మలయాళ నటులు సిద్థిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్‌లపై కేసులు నమోదయ్యాయి. కేరళ ప్రభుత్వం కూడా ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌కు మోహన్‌లాల్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Nov 07 , 2024 | 06:36 AM