మలయాళ ఇండస్ట్రీలో మరో విషాదం.. నటుడు మాధవన్ కన్నుమూత
ABN, Publish Date - Oct 09 , 2024 | 04:04 PM
మలయాళ సినిమా ఇండస్ట్రీలో మరోసారి విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితం ప్రఖ్యాత నటుడు మోహన్ రాజ్ మృతి మరువక ముందే ఇప్పుడు మరో ప్రముఖ నటుడు టీపీ మాధవన్ కన్నుమూశారు.
మలయాళ సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితం ప్రఖ్యాత నటుడు మోహన్ రాజ్ మృతి మరువక ముందే ఇప్పుడు మరో ప్రముఖ నటుడు టీపీ మాధవన్ (88) (T. P. Madhavan) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్యం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (ఆక్టోబర్ 9) బుధవారం దుదిశ్వాస విడిచారు.
ఇదిలాఉండగా నాడోడిక్కట్టు, పందిప్పాడ, ఆర్డినరీ, అయల్ కధ ఎళుత్తుకాయన్, నమ్మాల్, నరసింహం, ఓరు సీబీఐ డైరీ కురుప్పు, మూనమ్ మురా, అచ్చువెట్టంటే వీడు, సందేశం మరియు ఆరం తంపురాన్ వంటి కొన్ని చిత్రాలు ఆయనకు మంచి పేరును తీసుకువచ్చాయి. అదేవిధంగామలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మ అసోషియేషన్‌కు మాధవన్ మొదటి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు సైతం చేపట్టారు. కాగా మాధవన్ మృతి వార్త తెలుసుకున్న కేరళ సీఎం పినరయి విజయన్, ఇతర నటులు సంతాపం తెలిపారు.
తన 40 ఏండ్ల వయసులో విలన్ పాత్రలతో కెరీర్ ఆరంభించిన మాధవన్ 2016 వరకు అలుపు లేకుండా 600కు పైగా చిత్రాలలో నటించారు. విలన్ నుంచి కమెడియన్‌గా ఆ తర్వాత క్యారెక్టర్ యాక్టర్‌గా విభిన్న పాత్రలు పోషించారు. 1975లో రాగం అనే సినిమాతో కెరీర్ ఆరంభించిన మాధవన్ అదే సంవత్సరం అర డజన్‌కు పైగా చిత్రాలు చేయడం విశేషం. చివరగా ఆయన 2016లో మాల్గుడి డేస్ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత నారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయనకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు రాజా కృష్ణ మీనన్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు. హిందీలో పిపా, చెఫ్,ఎయిర్ లిఫ్ట్ వంటి భారీ చిత్రాలను డైరెక్ట్ చేశాడు.