Nivin Pauly: లైంగికంగా వేధించాడంటూ ప్రేమమ్ ఫేమ్ నివిన్‌ పౌలీపై కేసు... 

ABN, Publish Date - Sep 03 , 2024 | 09:15 PM

తాజాగా ఓ నటి  కథానాయకుడు నివిన్‌ పౌలిపై (nivin Pauly) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, గత నవంబరులో ఆమెను దుబాయ్‌ తీసుకెళ్లారు.

మలయాళ చిత్ర పరిశ్రమపై జస్టిస్‌ హేమ కమిటీ (hema committee) ఇచ్చిన నివేదిక అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ కలకాలం రేపింది. మాలీవుడ్‌లో (mollywood) లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా ఓ నటి  కథానాయకుడు నివిన్‌ పౌలిపై (nivin Pauly) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, గత నవంబరులో ఆమెను దుబాయ్‌ తీసుకెళ్లారు. అక్కడే ఆమెను లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు నివిన్‌ పౌలీ సహా ఆరుగురిపై నాన్‌-బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉన్నాడు. నిందితుల జాబితాలో నివిన్‌ పౌలీని ఆరో వ్యక్తిగా చేర్చారు. నివిన్‌పై కేసు నమోదైన విషయం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌ అవుతోంది.

ఈ విషయంపై నివిన్‌ పౌలీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. "ఓ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టాననే వార్తలు విన్నాను. ఆ వార్తలో నిజం లేదు. నాపై వచ్చిన నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నాను. అవన్నీ అవాస్తవాలు. ఈ విషయంపై నేను లీగల్‌గా పోరాటం చేస్తాను’’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ప్రేమమ్‌’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నివిన్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.  ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఈ ఏడాది ‘మలయాళీ ఫ్రమ్‌ ఇండియా’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘ఏళు కడల్‌ ఏళు మలై’ అనే తమిళ చిత్రంలోనూ నటించారు. 

ఇప్పటికే మలయాళ నటులు సిద్థిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్‌లపై కేసులు నమోదయ్యాయి. కేరళ ప్రభుత్వం కూడా ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌కు మోహన్‌లాల్‌ రాజీనామా చేశారు.  

Updated Date - Sep 03 , 2024 | 09:15 PM