Saptami Gowda: 'కాంతారా' హీరోయిన్ ఎంత గ్లామర్ గా వుందో చూసారా, ఫోటోస్ వైరల్
ABN, Publish Date - Feb 12 , 2024 | 03:47 PM
'కాంతారా' హీరోయిన్ సప్తమి గౌడ తన సామాజిక మాధ్యమంలో తాజాగా కొన్ని ఫోటోలు పెట్టారు, అవి ఇప్పుడు వైరల్ అవుతూ వున్నాయి.
కన్నడ సినిమా 'కాంతారా' ఒక్క కన్నడంలోనే కాకుండా అన్ని భాషల్లోనూ పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాకి దర్శకుడు, రచయిత గానే కాకుండా రిషబ్ శెట్టి ఇందులో కథానాయకుడు కూడా. అతని పక్కన కథానాయికగా వేసిన సప్తమి గౌడ కూడా ఈ సినిమాతో ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపోయింది. ఇందులో ఆమె హోమ్ గార్డ్ గా నటించింది. ఈ సినిమాకి సుమారు రూ.20 కోట్లవరకు బడ్జెట్ పెట్టి ఉంటారేమో కానీ, లాభాలు మాత్రం వందల కోట్లలో వున్నాయి. అంత పెద్ద ఘన విజయం సాధించింది ఈ సినిమా.
సప్తమి చేసిన ఈ హోమ్ గార్డు పాత్ర ఆమెకి మంచి పేరుని కూడా తెచ్చిపెట్టింది. ఆసక్తికరం ఏంటంటే ఈ 'కాంతారా' సినిమా ఆమెకి రెండో సినిమా. మొదటి సినిమా 'పాప్ కార్న్ మంకీ టైగర్' అది కూడా కన్నడ సినిమానే. కానీ సినిమాల్లోకి రాకముందు సప్తమి గౌడ మంచి స్విమ్మర్ అని ఎంతమందికి తెలుసు.
స్విమ్మింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు గెలుచుకుంది సప్తమి గౌడ. ఆమె తండ్రి ఒక పెద్ద పోలీసాఫీసర్, అతనే చిన్నప్పటి నుంచి సప్తమికి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనాలని ప్రోత్సహిస్తూ ఉండేవారని తెలిసింది. 'కాంతారా' సినిమా తరువాత ఆమె హిందీ సినిమా, 'వాక్సిన్ వార్' లో నటించింది. ఇది ఆమెకి మొదటి హిందీ సినిమా, కానీ ఈ సినిమా అన్ని భాషల్లోని విడుదలైంది.
తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో వుండే సప్తమి తన తాజా ఫోటోలను సామాజిక మాధ్యమం అయిన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అందులో తాజాగా ఉన్న ఫోటోలలో ఎంతో గ్లామర్ గా కనపడుతూ 'కాంతారా' సినిమాలో హోమ్ గార్డు పాత్రలో ఒక పల్లెటూరి అమ్మాయిగా మెప్పించిన ఈమేనా అని అందరికీ ఆసక్తికలిగేలా చేసింది.