Dosa King: శరవణ భవన్ ఓనర్ క్రైం స్టోరీతో.. ‘జై భీమ్’ దర్శకుడి ‘దోశ కింగ్’
ABN, Publish Date - Sep 13 , 2024 | 08:59 AM
‘జై భీమ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్న దర్శకుడు టీజే జ్ఞానవేల్ రాజా తన తదుపరి ప్రాజెక్టుపై హింట్ ఇచ్చారు. ప్రముఖ హోటల్ శరవణ భవన్ యజమాని పి.రాజగోపాల్ క్రైం స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
‘జై భీమ్’ (Jai Bhim) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్న దర్శకుడు టీజే జ్ఞానవేల్ రాజా (TJ Gnanavel) తన తదుపరి ప్రాజెక్టుపై హింట్ ఇచ్చారు. ప్రముఖ హోటల్ శరవణ భవన్ (Saravana Bhavan) యజమాని పి.రాజగోపాల్, ఆయన వద్ద పనిచేసిన జీవజ్యోతి (Jeeva Jothi) మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ‘దోశ కింగ్’ (Dosa King) పేరుతో ఇది తెరకెక్కనున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.
‘శరవణ భవన్’ స్థాపించిన హోటల్స్.. తమిళనాడు రాష్ట్రంలోనే ఎంతో పేరుగాంచాయి. ఈ హోటల్స్ ద్వారా పి.రాజగోపాల్ (P Rajagopal) ఎంతో ఎత్తుకు ఎదిగారు. అయితే, జీవజ్యోతిని ప్రేమించడం, ఆ కారణంగా ఏర్పడిన మనస్పర్థలతో పి.రాజగోపాల్ నిర్మించుకున్న హోటల్ సామ్రాజ్యం కుప్పకూలి పోవడం, జీవజ్యోతికి, రాజగోపాల్‌కు మధ్య ఉన్న సంబంధం, గొడవలు, ఇతర వివాదాలు, 18 యేళ్ళ న్యాయపోరాటం తర్వాత జీవజ్యోతి (Jeeva Jothi) కి లభించిన విజయం తదితర విషయాలతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.
ఈ స్క్రిప్టును టీజే జ్ఞానవేల్ (TJ Gnanavel), సప్తసాగరాలు దాటి ఫేం హేమంత్ రావ్ (Hemanth Rao) కలిసి సిద్ధం చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందించనున్నారు. ఇదిలావుంటే, సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్’ చిత్రం తర్వాత టీజే జ్ఞానవేల్ ఇపుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ‘వేట్టయన్’ (Vettaiyan) చిత్రాన్ని తెరకెక్కించగా వచ్చే నెల 10వ తేదీన విడుదల కానుంది.