Dhruva Natchathiram: హమ్మయ్యా.. ఎట్టకేలకు థియేటర్లలోకి ధృవ నక్షత్రం! కొత్త రిలీజ్ డేట్ ఇదే
ABN, Publish Date - Mar 15 , 2024 | 03:08 PM
మొత్తానికి స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దశాబ్దాల కల ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. అప్పుడెప్పుడో 2013లో ప్రారంభించిన ధృవ నక్షత్రం సినిమా అన్నీ అడ్డంకులను దాటుకుని విడుదలకు సిద్ధమైంది.
మొత్తానికి స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham vasudev menon) దశాబ్దాల కల ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. అప్పుడెప్పుడో 2013లో ప్రారంభించిన ధృవ నక్షత్రం (Dhruva Natchathiram) సినిమా అన్నీ అడ్డంకులను దాటుకుని విడుదలకు సిద్ధమైంది. ముఖ్యంగా ఏడాదిన్నరగా ఊరిస్తూ వచ్చిన ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ముచ్చటగా ఆరో సారి ప్రకటించడమే కాక విడుదలై తీరుతుంది ఎలాంటి అనుమానాలు అవసరం లేదంటూ మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో కొన్నేండ్లుగా ఈ హయ్ ఓల్టేజ్ స్పై, యాక్షన్ థ్రిల్లర్ సినిమా రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి హిట్ తర్వాత ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్వకత్వంతో పాటు నిర్మాతగా 2013లో సూర్య (Suriya) హీరోగా ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. మధ్యలోనే సూర్య ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో 2015లో ఆ స్థానంలోకి జయం రవిని తీసుకుని కొంతమేర షూట్ కూడా చేశారు. కానీ జయం రవి కూడా మిడిల్‌లోనే వెళ్లిపోవడంతో విక్రమ్‌తో మళ్లీ మొదలు పెట్టారు.
దీంతోపాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకోగా హరీశ్ జయరాజ్(Harris Jayaraj) వచ్చి చేరాడు. అదే విధంగా హీరోయిన్ల విషయంలోనూ సేమ్ ఇలానే జరిగి త్రిష, నయనతార, సమీరారెడ్డి, అసిన్, అను ఇమ్మాన్యుయేల్, అమలా పాల్ అంటూ అర డజన్ మంది కథానాయికలకు పైగానే ఈ సినిమాలోకి వచ్చి వెళ్లిపోగా చివరకు మన తెలుగమ్మాయి రీతూ వర్మ రాకతో సమస్యకు చెక్ పడింది. హీరోహీరోయిన్లు మారినప్పుడల్లా రీ షూట్లు చేస్తూ వచ్చారు.
ముఖ్యంగా దర్శకుడు గౌతమ్ మీననే ఈ సినిమాకు నిర్మాత కావడంతో ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఎదురవడంతో డబ్బులు కూడినప్పుడల్లా షూటింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్లారు. చాలా దేశాల్లో ఈ సినిమా చిత్రీకరించాల్సి రావడం, అదే సమయంలో కరోనా తాండవం ఇలా సమస్యలన్నీ చుట్టు ముట్టడంతో ఓ అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కన్నట్లుగా గౌతమ్ మీనన్ పరిస్థితి తయారైంది. దీనిని నుంచి బయట పడేందుకు ఆయన డైరెక్ట్‌గా నటనలోకి దిగి వరుసగా చిత్రాలలో యాక్ట్ కూడా చేశారు.
అక్కడ వచ్చిన డబ్బుతో దృవనక్షత్రం సినిమాను పూర్తి చేసి చివరకు 2023 దీపావళి విడుదలకు ప్లాన్ చేయగా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాక ఫైనాన్షియర్ల కేసుతో సినిమా మళ్లీ వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు ఫైనాన్షియర్లతో ఉన్న అన్ని సమస్యలన్నీ ఓ కొలిక్కి రావడంతో చిత్ర కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.