Ameer: ఆ సినిమా.. థియేటర్లలో రిలీజ్ చేయాల్సింది కాదు
ABN, Publish Date - Aug 29 , 2024 | 11:41 AM
ఒక చిత్రం మాస్ ఆడియన్స్‌కు దగ్గరగా ఉన్నపుడు అది విజయవంతమవుతుందని, అంతర్జాతీయ చిత్రోత్సవాల కోసం నిర్మించిన ఒక చిత్రాన్ని సాధారణ చిత్రాలతో పోటీ పడి రిలీజ్ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తమిళ దర్శకుడు అమీర్ అన్నారు.
ఒక చిత్రం మాస్ ఆడియన్స్‌కు దగ్గరగా ఉన్నపుడు అది విజయవంతమవుతుందని దర్శక నటుడు అమీర్ (Ameer) అభిప్రాయ పడ్డారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల కోసం నిర్మించిన ఒక చిత్రాన్ని సాధారణ చిత్రాలతో పోటీ పడి రిలీజ్ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న అమీర్ (Ameer).. మారి సెల్వరాజ్ (Mari Selveraj) రూపొందించిన ‘వాళై’ (Vazhai) చిత్రానికి హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) నిర్మించిన ‘కొట్టుకాళి’ (Kottukkaali) చిత్రానికి ఏమాత్రం పొలిక లేదన్నారు.
తమిళ్ దయాళన్ (Tamizh Dhayalan) దర్శకత్వం వహించిన ‘కెవి’ చిత్ర బృందం ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అమీర్ (Ameer) మాట్లాడుతూ, ‘ సినిమా అంటే ప్రేక్షకులపై ప్రభావం చూపాలి. సినిమా షూటింగ్‌లో ప్రతి యూనిట్ కష్ట పడటం సహజం. వాటితో ప్రేక్షకులకు సంబంధం లేదు. సినిమా బాగుందా? లేదా? ఆ సినిమా తమ మనసులను కదిలించిందా? లేదా? అన్నది మాత్రమే ఆడియెన్స్ చూస్తారు.
తాజాగా విడుదలైన ‘వాళై’ (Vazhai), ‘కొట్టుకాళి’ (Kottukkaali) చిత్రాలనే తీసుకోండి.. ‘వాళై’ (Vazhai) మాస్ ఆడియెన్స్‌కు చాలా దగ్గరగా ఉంది కాబట్టే సక్సెస్ సాధించింది. ‘కొట్టుకాళి’ ఫెస్టివల్స్ కోసం తీసినది. దాన్ని ఒక సాధారణ సినిమాగా భావించి రిలీజ్ చేయడం నాకు ఆమోదయోగ్యం కాదు. నేను గానీ ఈ సినిమా తీసి ఉంటే థియేటర్‌లో విడుదల చేసేవాడిని కాదు.
శివకార్తికేయన్ (Sivakarthikeyan) తనకున్న స్టార్ ఇమేజ్‌తో ఏదో ఒక ఓటీటీకి విక్రయించి పెట్టుబడి రాబట్టుకోవచ్చు. ఇక ఈ చిత్రం ‘జైభీమ్’ తరహాలో ప్రజాదారణ పొందాలి. ఈ సినిమా ఒక మంచి సమస్యకు పరిష్కారం చూపిస్తుందని భావిస్తున్నానన్నారు. కాగా, ‘కెవి’ చిత్రంలో షీలా రాజ్‌కుమార్, జాక్వెలిన్ లిడియా, ఆధవన్ ప్రధాన పాత్రలు పోషించగా, గౌతం చొక్కలింగం అద్యగ్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించారు.