Chiyaan Vikram: అప్పుడు వైద్యులు ఏం చెప్పారంటే!
ABN, Publish Date - Sep 03 , 2024 | 06:30 PM
కథ డిమాండ్‌ను బట్టి పాత్ర కోసం ఎలాంటి సాహసమైనా చేస్తారు చియాన్ విక్రమ్. పాత్రకు తగ్గట్లు మారిపోతూ ఉంటారాయన. అలాగే ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి వెనకాడరు. అందుకే ‘పితామగన్’, ‘కాశీ’, ‘అపరిచితుడు’ ‘ఐ’ వంటి వైవిధ్య చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి.
కథ డిమాండ్‌ను బట్టి పాత్ర కోసం ఎలాంటి సాహసమైనా చేస్తారు చియాన్ విక్రమ్ (Vikram). పాత్రకు తగ్గట్లు మారిపోతూ ఉంటారాయన. అలాగే ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి వెనకాడరు. అందుకే ‘పితామగన్’, ‘కాశీ’(kaasi), ‘అపరిచితుడు’ ‘ఐ’ (I)వంటి వైవిధ్య చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి. తాజాగా ‘తంగలాన్’తో (Thangalaan)మరోసారి వైవిధ్యభరిత కథలపై ఆయనకున్న మక్కువను చూపించారు. తాజాగా ఓ ఇంగ్లిష్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 2001లో వినయన్ దర్శకత్వంలో వచ్చిన ‘కాశీ’ మూవీ విక్రమ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో ఆయన అంధుడిగా నటించారు. ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులకు ప్రయత్నించడం వల్ల కొన్ని సమయాల్లో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆ జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు ‘‘సినిమాల్లో పాత్రకు అవసరమైనట్లు మారడం, నటించడమంటే నాకు ఇష్టం. ఇతరులతో పోలిస్తే, ఏదైనా ప్రత్యేకంగా చేయాలి. అది అందరూ చేసినట్లు ఉండకూడదు. నేను మందు తాగను, సిగరెట్ కాల్చను. కానీ, సినిమా పట్ల నాకున్న అభిరుచి నాకు విషం లాంటిది. నేను బాగా నటించాలని అనుకున్నప్పుడు అది మరింత ఎక్కువ విషంగా మారుతుంది. నేను ‘కాశీ’ అనే మూవీ చేశా. అందులో నటించిన తర్వాత రెండు, మూడు నెలలపాటు నా కంటి చూపు మందగించింది. సరిగా చూడలేకపోయేవాడిని. ఎందుకంటే ఆ మూవీలో అంధుడిగా కనిపించడానికి కళ్లు పైకెత్తి చూడాల్సి వచ్చేది. ఆ ప్రభావం నా కంటి చూపుపై పడింది. మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు’’ అని చెప్పారు.
అలాగే ఆయన చేసిన మరో రిస్క్ ‘ఐ’. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కోసం విక్రమ్ పెద్ద రిస్క్ చేశారట. దాని ఫలితంగా మరిన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, తృటిలో తప్పించుకున్నట్లు తెలిపారు. ‘‘ఐ’ మూవీ కోసం 82 కేజీల నుంచి 52 కేజీలకు బరువు తగ్గాను. అందులోని ఓ పాత్ర కోసం 50 కేజీల ఇంకా తక్కువ తగ్గాలని భావించా. ఇదే విషయాన్ని డాక్టర్‌కు చెబితే, ‘బరువు తగ్గాలనుకునే విషయాన్ని కాస్త తేలిగ్గా తీసుకోండి. ఎక్కువ ఉత్సాహ పడిపోవద్దు. ఇప్పటికే మీ శారీరక కొలతల్లో మార్పు వచ్చింది. ఇంకా తగ్గాలని ప్రయత్నిస్తే ప్రధాన అవయవాలు పనిచేయడం ఆగిపోవచ్చు. అది మరింత ప్రమాదం. అప్పుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా మాకూ తెలియదు’ అన్నారు. ఆ మాటతో బరువు తగ్గడం ఆపేశా’’ అంటూ చెప్పుకొచ్చారు.