Kochadaiiyaan: ర‌జ‌నీకాంత్ ‘కొచ్చడియాన్‌’.. ద‌శాబ్దం దాటినా తీర‌ని క‌ష్టాలు

ABN, Publish Date - Aug 04 , 2024 | 02:17 PM

సినిమా వ‌చ్చిపోయి ప‌దేళ్లు దాటినా ర‌జ‌నీకాంత్ ‘కొచ్చడియాన్‌’కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. తాజాగా ఈ చిత్ర నిర్మాత చెక్కు మోసం కేసులో చెన్నై హైకోర్టు సిరీస్ అయింది.

kochadaiyaan

చెక్కు మోసం కేసులో నాలుగు వారాల్లో రూ.1.1 కోట్లను డిపాజిట్‌ చేయాలని మద్రాస్‌ హైకోర్టు ‘కొచ్చడియాన్‌’ (Kochadaiiyaan) నిర్మాతను ఆదేశించింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్ (Rajinikanth)హీరోగా తెరకెక్కిన ‘కొచ్చడియాన్‌’ యానిమేషన్‌ చిత్రానికి ఆయన కుమార్తె సౌందర్య (soundarya) దర్శకత్వం వహించారు. మీడియా వన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ నిర్మించింది. అయితే, సినిమా నిర్మాణం కోసం యాడ్‌ బ్యూరో అడ్వర్‌టైజింగ్‌ నుంచి మీడియాన్‌ సంస్థ రూ.10 కోట్లు రుణంగా తీసుకుంది.

ఈ సినిమా విడుదలైన తర్వాత తమిళనాడు రిలీజ్‌ రైట్స్‌తో పాటు తమిళనాడులోని కలెక్షన్‌ మొత్తంలో 20 శాతం యాడ్ బ్యూరోకిచ్చేలా రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఈ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించడమే కాకుండా, బ్యాంకు రుణం చెల్లించేందుకు ఇచ్చిన రూ.5 కోట్ల చెక్కు ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారంటూ మీడియా వన్‌ గ్లోబల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ, డైరెక్టర్‌ మురళీ మనోహర్‌లపై యాడ్‌ బ్యూరో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అభిర్‌చంద్‌ నహర్‌ చెన్నై అల్లీకుళం కోర్టులో పిటిషన్‌ వేశారు.


దీన్ని విచారించిన అల్లీకుళం కోర్టు... మురళీ మనోహర్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.7.70 కోట్ల నష్టపరిహారం అభిర్‌చంద్‌కు చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ తీర్పుపై మురళీ మనోహర్‌ హైకోర్టులో అప్పీల్‌ చేయగా, కింది కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేసింది. ఆ తర్వాత ఈ పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు విచారణకు రాగా, ఇప్పటివరకు మొత్తం రూ.8.99 కోట్లను తిరిగి చెల్లించినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో మిగిలిన రూ.1.1 కోట్లను నాలుగు వారాల్లోగా తిరిగి చెల్లించాలంటూ తాజాగా ఆదేశించింది.

Updated Date - Aug 04 , 2024 | 02:17 PM