NadigarSangam: నటులపై.. నిర్మాతల ఫిర్యాదులు స‌ర్వ‌ సాధారణం

ABN, Publish Date - Aug 13 , 2024 | 03:09 PM

నటులపై.. నిర్మాతల ఫిర్యా దులు స‌ర్వ‌ సాధారణమ‌ని తమిళ చలనచిత్ర నిర్మాతల మండలితో ఉన్న విభేదాలు, మనస్పర్థలను తొలగించుకునేందుకు చర్చలు జరుపుతామని నడిగర్‌ సంఘం వెల్లడించింది.

nasar

తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి(TFPC)తో ఉన్న విభేదాలు, మనస్పర్థలను తొలగించుకునేందుకు చర్చలు జరుపుతామని నడిగర్‌ సంఘం (Nadigar Sangam) వెల్లడించింది. ఈ నెల 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభంపై తాత్కాలిక నిషేధం విధించడం, నవంబరు ఒకటో తేదీ నుంచి కోలీవుడ్‌లో అన్ని షూటింగులు నిలిపివేయడం, హీరో ధనుష్ (Dhanush) తో కొత్తగా సినిమాలేవీ నిర్మించరాదంటూ తీర్మానం చేయడం వంటి అంశాలను నడిగర్‌ సంఘం తీవ్రంగా ఖండించింది.

ఈ మేరకు ఇటీవ‌ల‌ నడిగర్‌ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో సంఘం అధ్యక్షుడు నాజర్‌, ప్రధాన కార్యదర్శి విశాల్‌, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు పూచ్చి మురుగన్‌, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో నిర్మాతల మండలి (TFPC) చేసిన పలు తీర్మానాలను ఖండించారు. అంతేకాకుండా, హీరో ధనుష్ (Dhanush) పై నిర్మాతల సంఘం చేసిన ఆరోపణలు తోసిపుచ్చింది. ధనుష్‌ అంశంలో నడిగర్‌ సంఘానికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేసింది.


ఈ అంశంపై నాజర్‌, విశాల్‌, కార్తీ సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ, ‘తమిళ చిత్రపరిశ్రమను ఉన్నత స్థాయికి చేర్చాలన్నదే తమ ఆశయం. ఇందుకోసం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని నిర్మాతల సంఘానికి తెలియజేస్తాం. కొందరు నటీనటుల గురించి నిర్మాతలు ఫిర్యాదు చేయడం, వాటికి తాము జవాబు ఇవ్వడం సర్వసాధారణమన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని నిర్మాతల సంఘం అధ్యక్షుడు లేఖ రాయగా, మేము కూడా ఓ తేదీ వెల్లడించామని, త్వరలోనే సమావేశమై అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకుంటాం’ అని తెలిపారు.

Updated Date - Aug 13 , 2024 | 03:43 PM