John Vijay: సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు
ABN, Publish Date - Jul 27 , 2024 | 12:20 PM
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహిళలు, చిన్నారులపై జరిగే ఆకృత్యాలపై తరచూ ఆమె పోరాటం చేస్తూనే ఉంటారు. ఆమె సోషల్‌లో వాల్ మీద ఈ తరహా సమస్యలకు సంబంధించిన పోస్ట్‌లే ఎక్కువ దర్శనమిస్తాయి
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహిళలు, చిన్నారులపై జరిగే ఆకృత్యాలపై తరచూ ఆమె పోరాటం చేస్తూనే ఉంటారు. ఆమె సోషల్‌లో వాల్ మీద ఈ తరహా సమస్యలకు సంబంధించిన పోస్ట్‌లే ఎక్కువ దర్శనమిస్తాయి. గతంలో మీటూ ఉద్యమంలోనూ చిన్మయి శ్రీపాద గట్టిగానే మహిళల తరఫున పోరాడింది. జరుగుతున్న దారుణాలను ప్రశ్నించినందుకు గానూ తమిళ చిత్ర పరిశ్రమ ఆమెను బ్యాన్ చేసింది. తాజాగా ఆమె మరోసారి గొంతెత్తింది. నటుడు జాన్ విజయ్ (John vijay) మహిళలను లైంగికంగా వేధింపులకు (Sexual harassment) గురి చేశాడని ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. అతని ప్రవర్తనపై ఇతర మహిళలు కూడా తనతో మాట్లాడారని తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ ని చిన్మయి ట్విటర్‌లో షేర్ చేసింది. పబ్‌లు, రెస్టారెంట్లలో జాన్ విజయ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తనకు వచ్చిన స్క్రీన్ షాట్స్ ని పంచుకుంది. ఇతను కూడా డీఎంకేకి చెందిన వ్యక్తి అని, వైరముతు, ఇతను ఒకే రకానికి చెందిన వ్యక్తులని అని తేల్చి పడేసింది. ఇక చిన్మయి పెట్టిన పోస్ట్ మీద కొందరు అమ్మాయిలు రియాక్ట్ అవుతున్నారు. కాగా.. జాన్ విజయ్ చివరిసారిగా మలయాళ నటుడు దిలీప్ నటించిన తంకమణి చిత్రంలో విలన్‌గా కనిపించాడు. 2017లో దేశాన్ని కుదిపేసిన లైంగిక వేధింపుల కేసులో నిందితుల్లో దిలీప్ కూడా ఒకరు. అంతే కాకుండా ‘ఓరం పో’, ‘సర్పట్ట పరంబరై, ‘సలార్: పార్ట్ 1- సీజ్‌ఫైర్’, భగవంత్ కేసరి చిత్రాల్లో నటించారు.