Charan Raj: విజయ్.. ఆ స్థాయికి చేరుకోవడానికి తండ్రే కారణం
ABN, Publish Date - Aug 25 , 2024 | 08:09 AM
అగ్రనటుడు దళపతి విజయ్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన తండ్రి, సీనియర్ దర్శక నటుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ కారణమని సీనియర్ నటుడు చరణ్‌రాజ్ అన్నారు.
అగ్రనటుడు దళపతి విజయ్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన తండ్రి, సీనియర్ దర్శక నటుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ కారణమని సీనియర్ నటుడు చరణ్‌రాజ్(Charan Raj) అన్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో 600కు పైగా చిత్రాల్లో నటించిన చరణ్‌రాజ్.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అనేక విభిన్నమైన పాత్రల్లో నటించారు. ‘అన్నన్ తంగచ్చి’, ‘యధార్థ ప్రేమకథ’ అనే రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.
ఇప్పుడు తన చిన్న కుమారుడు దేవ్ (Dev)ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ‘కుప్పన్’ (Kuppan) పేరుతో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా సుస్మిత నటించారు. ప్రియా అరుణాచలం మరో హీరోయిన్. వీరితోపాటు చరణ్‌రాజ్ కీలక పాత్ర పోషించారు. సోని శ్రీ పొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం ఎన్.వై.చరణ్‌రాజ్. ఆర్.జనార్దనన్ ఛాయాగ్రహణం, ఎస్.జి.ఇలై సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ సందర్భంగా చరణ్ రాజ్ (Charan Raj) మాట్లాడుతూ.. ‘మత్స్యకారుల గురించి తెలియని అనేక విషయాలను ఈ సినిమాలో చెప్పాం. ఇదొక అందమైన ప్రేమ కథ. నేను దాదాపు 600కు పైగా చిత్రాల్లో అన్ని రకాల పాత్రలను పోషించా. చేతి నిండా డబ్బులు ఇచ్చినా వాటిని ఏం చేయాలో తెలియదు.కానీ, నటించమని కోరితే మాత్రం రేయింబవళ్లు నటిస్తా.
ఇపుడు నటనకు దూరంగా ఉంటూ కథలు, సంగీతం, దర్శకత్వం వంటి విభాగాలపై దృష్టి సారించా. విజయ్ అగ్ర హీరో స్థాయికి చేరుకోవడానికి ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ కారణం. ఇపుడు నా చిన్న కుమారుడు దేవ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నా. ప్రేక్షకులతో పాటు మీడియా ఆదరించాలని కోరుతున్నా’ అని అన్నారు.