ప్ర‌భుదేవ కోసం.. 1800 మంది కళాకారులు.. 100 పాటలు.. 100 నిమిషాలు వ‌ర‌ల్డ్‌ రికార్డ్‌

ABN, Publish Date - Aug 01 , 2024 | 11:31 AM

అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా సమక్షంలో 1800 మంది డ్యాన్సర్లు ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

prabhudeva

అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా (Prabhu Deva) సమక్షంలో 1800 మంది డ్యాన్సర్లు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ కళాకారులంతా కలిసి 100 ప్రభుదేవా పాటలకు 100 నిమిషాల పాటు డ్యాన్స్‌ చేసి ఈ రికార్డు సృష్టించారు.

తిరువళ్ళూరు జిల్లా పొన్నేరి తాలూకా మాధవరంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో చెన్నై నగర వాసులతో పాటు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుదేవా జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించగా, ఆయన కొరియోగ్రఫీ చేసిన 100 పాటలకు 100 నిమిషాల పాటు డ్యాన్స్‌ చేశారు.


ఒక నిమిషానికి ఒక పాట చొప్పున సమయం కేటాయించారు. తద్వారా ఇంటర్నేషనల్‌ ప్రైడ్‌ వరల్డ్‌ రికార్డు సాధించగా, ప్రపంచ రికార్డుకు సంబంధించిన ప్రశంసా పత్రాన్ని ప్రభుదేవా (Prabhu Deva) అందజేశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రభుదేవా ఆద్యంతం వీక్షిస్తూ ఎంజాయ్‌ చేశారు. ఇందులో దర్శకుడు రాబర్ట్‌, నటుడు రోబో శంకర్‌, నటి ఇందుజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2024 | 11:31 AM