Janaka Aithe Ganaka OTT: సేఫ్టీ వాడినా.. భార్య ప్రెగ్నెంట్ అయితే! ఓటీటీకి.. సుహాస్ లేటెస్ట్ కోర్టు రూం డ్రామా
ABN, Publish Date - Oct 30 , 2024 | 01:39 PM
బలగం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత దిల్ రాజు బ్యానర్లో రూపొంది ఇటీవల థియేటర్లలోకి వచ్చిన చిత్రం జనక అయితే గనక. ఆక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది.
బలగం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత దిల్ రాజు బ్యానర్లో రూపొంది ఇటీవల థియేటర్లలోకి వచ్చిన చిత్రం జనక అయితే గనక (Janaka Aithe Ganaka). ఇప్పుడిప్పుడే వరుస వైవిధ్యమైన చిత్రాలతో వస్తూ ఎక్కువ సక్సెస్ రేట్‌తో తన స్థాయిని రోజురోజుకు పెంచుకుంటున్న సుహాస్ (Suhas) హీరో. సంగీర్తన, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, గోపరాజు రమణ, కీలక పాత్రల్లో నటించగా ఆక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రశాంత్ నీల్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన సందీప్ రెడ్డి బండ్ల (Sundeep Reddy) ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది.
ప్రసాద్ (సుహాస్) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు. భార్య, తల్లి, తండ్రి, నాయనమ్మలతో హ్యాపీగా జీవిస్తుంటాడు. తండ్రి చేసిన చిన్న మిస్టేక్ కారణంగా మిడిల్ క్లాస్‌కి పరిమితమైన ప్రసాద్.. ఆ విషయంలో తండ్రి (గోపరాజు రమణ)ని ఎప్పుడూ ఆటపట్టిస్తుంటాడు. ఓ వాషింగ్ మెషిన్ కంపెనీలో సేల్స్ అండ్ సర్వీసెస్ విభాగంలో జాబ్ చేస్తు తన ఫ్యామిలీని నడిపిస్తుంటాడు. పగలంతా డ్యూటీ, రాత్రయితే ఫ్రెండ్ లాయర్ పత్తి కిశోర్ (వెన్నెల కిశోర్)తో మందు పార్టీలో ఉంటుంటాడు. అయితే ఇప్పుడున్న కాస్ట్లీ ప్రపంచంలో పిల్లలను పెంచడం సాధ్యం కాదని, తన భార్య (సంగీర్తన)తో ఓ అండర్‌స్టాండింగ్‌కి వచ్చి పిల్లలు వద్దనుకుంటారు.
అలా రెండు సంవత్సరాలు గడిచాక సడెన్‌గా తన భార్య ప్రెగ్నెంట్ అని తెలుసుకుని షాకైన ప్రసాద్.. సేఫ్టీ వాడినా, తన భార్య ఎలా ప్రెగ్నెంట్ అయిందనే దానిపై ఫ్రెండ్ పత్తి కిశోర్‌తో మాట్లాడి తను వాడిన కండోమ్ కంపెనీపై రూ. కోటికి దావా వేస్తాడు. ఇలాంటి విషయంలో కోర్టుకు వెళ్లిన ప్రసాద్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఫ్యామిలీ, బయటి సమాజం ప్రసాద్‌ని ఎలా చూసింది? కోర్టులో విజయం సాధించాడా? సేఫ్టీ వాడినా తన భార్య ఎలా ప్రెగ్నెంట్ అయింది? అసలు తను కోర్టుకు వెళ్లడానికి కారణం ఇదేనా? ఇంకా వేరే ఏదైనా ఉందా? వంటి విషయాలకు సమాధానం తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
దర్శకుడు తన రియల్ లైఫ్‌లో చూసిన సంఘటనలతో ఈ కథను రెడీ చేసుకునప్పటికీ.. ఇలాంటి ఓ నేపథ్యంతో సినిమా చేయడం అనేది సాహసం అనే చెప్పాలి. పైకి పిల్లల పుట్టుకకు సంబంధించిన కథగా అనిపించినా.. అంతర్గతంగా దర్శకుడు ఇందులో లేవనెత్తిన విషయాలు మాత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. కానీ, అవి సినిమాకే పరిమితం అవుతున్నాయి తప్పితే.. నిజంగా ఎవరూ నిలబడి ఆలోచించడం లేదు. పోరాటం చేయడం లేదు. పెద్దవాళ్లు వేసుకునే చొక్కా ఖరీదు రూ. 500 ఉంటే, చిన్న పిల్లలు వేసుకునే చొక్కాకు తక్కువ క్లాత్, తక్కువ దారం పడుతుంది. అయినా రూ. 1500 ఎందుకు ఉంటుంది? అంటూ ఇలా దర్శకుడు టచ్ చేసిన కొన్ని పాయింట్స్ చాలా మందికి ముఖ్యంగా మధ్యతరగతి వారికి బాగా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడీ సినిమా నవంబర్ 8నుంచి ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎవరైతే థియేటర్లో మిస్సయ్యారో ఇక ఇంటి పట్టునే చూసి ఆనందించండి.