BhaleUnnade OTT: అప్పుడే ఓటీటీకి రొమాంటిక్ కామెడీ ‘భ‌లే ఉన్నాడే’! ఎందులో.. ఎప్ప‌టినుంచంటే

ABN, Publish Date - Sep 27 , 2024 | 09:31 AM

ఇటీవ‌ల పురుషోత్త‌ముడు, తిర‌గ‌బ‌డ‌రా సామి అంటూ వ‌రుస చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన రాజ్ త‌రుణ్ లేటెస్ట్‌గా న‌టించిన భ‌లే ఉన్నాడే సినిమా ప‌క్షం రోజుల‌కే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

మ్లనా బెయయలదా

ఇటీవ‌ల పురుషోత్త‌ముడు, తిర‌గ‌బ‌డ‌రా సామి అంటూ వ‌రుస చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన రాజ్ త‌రుణ్ (Raj Tarun) లేటెస్ట్‌గా న‌టించిన భ‌లే ఉన్నాడే (Bhale Unnade) సినిమా ప‌క్షం రోజుల‌కే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. సెప్టెంబ‌ర్ 13న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నానితో భ‌లే భ‌లే మొగాడివోయ్ వంటి క్లాసిక్ హిట్ ఇచ్చి ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో రాజా సాబ్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న మారుతి ఈ సినిమాను సమర్పకుడిగా వ్యవహరించడం, ట్రైలర్‌ ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. 'గీత సుబ్రహ్మణ్యం’ సిరీస్‌తో ట్రెండ్‌ సృష్టించిన దర్శకుడు శివ సాయి వర్ధన్ ఈ మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. మనీషా కందుకూర్ (Manisha kandukur) హీరోయిన్‌గా న‌టించ‌గా అభిరామి, హైపర్‌ ఆది, సింగీతం శ్రీనివాసరావు, లీలా శాంసన్‌, గోపరాజు రమణ వంటి న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. రాధ (రాజ్‌తరుణ్‌) వైజాగ్‌లోని ఓ మధ్యతరగతి కుర్రాడు.శారీ డ్రేపర్‌ (ఫంక్షన్‌లో అమ్మాయిలకు చీర కట్టే వృత్తి) పని చేస్తుంటాడు. తల్లి గౌరి( అభిరామి) బ్యాంక్‌ ఉద్యోగి. కృష్ణ (మనీషా కంద్కూరు) మోడ్రన్‌ గర్ల్‌. ప్రేమ, పెళ్లి విషయాల్లో కొన్ని ఆలోచనలతో ఉంటుంది. అయితే రాధను చూడకుండా, ఎవరో తెలియకుండానే శారీ డ్రేపర్‌గా ఉన్న పరిచయంతో రాధతో ప్రేమలో పడుతుంది. త‌ర్వాత‌ రాధ కూడా ప్రేమలో పడతాడు. ఓ స‌మ‌యంలో కృష్ణ అవకాశమిచ్చినా రాధ హద్దు మీరకుండా పద్దతిగా ఉంటాడు. కొంత కాలానికి పెద్దల అంగీకారంతో వీళ్లిద్దరూ పెళ్లికి సిద్థమై నిశ్చితార్థం జ‌రుగుతున్న సమయంలో కృష్ణ స్నేహితురాలు ఆమెకు ఓ విషయం చెబుతుంది. దీంతో కృష్ణకు రాధ వ్యక్తిత్వంపై అనుమానం ఏర్పడి రాధ సంసారానికి పనికొస్తాడా లేదా అని పరీక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఏమైంది. పీటల దాకా వచ్చిన పెళ్లి ఎందుకు ఆగింది అనేది మిగతా కథ.


నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? శారీరక సుఖాన్ని అందించడమే మగతనమా? ప్రేమించిన అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకోవడం మగతనమా? అన్న విషయాలకు సరైన సమాధానమిచ్చే కథ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఒక బోల్డ్‌ లైన్‌కు లవ్‌, ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి క్లీన్‌గా చెప్పారు. ఫస్టాప్‌ అంతా తల్లీకొడుకు మధ్య ప్రేమ, అనుబంధం, మరోవైపు హీరోహీరోయిన్‌లపై లవ్‌ ట్రాక్‌, టామ్‌ అండ్‌ జెర్రీ ఫైట్‌లా సరదాగా సాగుతుంది. పెళ్లికి రెడీ అయిన‌ సమయంలో కథ టర్న్‌ అవుతుంది.

అమ్మాయిలు అతన్ని ఎంతగా కోరుకుంటున్నా.. ప్రేమించిన అమ్మాయి ముద్దులు, హగ్గుల కోసం తహతహలాడుతున్నా అతను ఎందుకు నిగ్రహంతో ఉంటాడు. అతనిలో ఇంకేదైనా సమస్య వెంటాడుతోందా? అనిపిస్తుంది. రాధ తల్లి గౌరి కథలో భావోద్వేగం హృదయాన్ని హత్తుకుంటుంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఆ ఫ్లాష్‌బ్యాక్‌ ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైన 20 రోజుల లోపే ఈ టీవీ విన్‌ (Etvwin) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ మేర‌కు స‌ద‌రు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. సో ఎవ‌రైతే థియేట‌ర్ల‌లో మిస్స‌య్యారో, ఓ మంచి వినోదాత్మ‌క చిత్రం చూడాల‌నుకునే వారు ఈ సినిమాను త‌ప్ప‌కుండా చూసేయండి.

Updated Date - Sep 27 , 2024 | 09:31 AM