OTT: 20రోజులకే.. ఓటీటీకి వ‌చ్చేసిన రాజ్ త‌రుణ్ ‘భ‌లే ఉన్నాడే’

ABN, Publish Date - Oct 03 , 2024 | 04:38 PM

రాజ్ త‌రుణ్ తాజాగా న‌టించ‌గా సెప్టెంబ‌ర్ 13న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన భ‌లే ఉన్నాడే సినిమా ప‌క్షం రోజుల‌కే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

bhale vunnade

ఈ ఏడాది ఇప్ప‌టికే పురుషోత్త‌ముడు, తిర‌గ‌బ‌డ‌రా సామి అంటూ వ‌రుస చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన రాజ్ త‌రుణ్ (Raj Tarun) లేటెస్ట్‌గా న‌టించిన భ‌లే ఉన్నాడే (Bhale Unnade) సినిమా ప‌క్షం రోజుల‌కే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. సెప్టెంబ‌ర్ 13న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ త‌ర్వాత దేవ‌ర‌ వంటి భారీ చిత్రం రావ‌డంతో జ‌నాల్లోకి వెళ్ల లేక‌పోయింది. మారుతి ఈ సినిమాను సమర్పకుడిగా వ్యవహరించగా శివ సాయి వర్ధన్ దర్శకుడిగా ఈ మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. హీరోయిన్‌గా మనీషా కందుకూర్ (Manisha kandukur) న‌టించ‌గా అభిరామి, హైపర్‌ ఆది, సింగీతం శ్రీనివాసరావు, లీలా శాంసన్‌, గోపరాజు రమణ వంటి న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. రాధ (రాజ్‌తరుణ్‌) వైజాగ్‌లోని ఓ మధ్యతరగతి కుర్రాడు.శారీ డ్రేపర్‌ (ఫంక్షన్‌లో అమ్మాయిలకు చీర కట్టే వృత్తి) పని చేస్తుంటాడు. తల్లి గౌరి( అభిరామి) బ్యాంక్‌ ఉద్యోగి. కృష్ణ (మనీషా కంద్కూరు) మోడ్రన్‌ గర్ల్‌. ప్రేమ, పెళ్లి విషయాల్లో కొన్ని ఆలోచనలతో ఉంటుంది. అయితే రాధను చూడకుండా, ఎవరో తెలియకుండానే శారీ డ్రేపర్‌గా ఉన్న పరిచయంతో రాధతో ప్రేమలో పడుతుంది. కొంత కాలానికి పెద్దల అంగీకారంతో వీళ్లిద్దరూ పెళ్లికి సిద్థమై నిశ్చితార్థం జ‌రుగుతున్న సమయంలో కృష్ణ స్నేహితురాలు ఆమెకు చెప్పిన ఓ విష‌యంతో కృష్ణకు రాధ వ్యక్తిత్వంపై అనుమానం ఏర్పడి రాధ సంసారానికి పనికొస్తాడా లేదా అని పరీక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఏమైంది. పీటల దాకా వచ్చిన పెళ్లి ఎందుకు ఆగింది అనేది మిగతా కథ.

నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? శారీరక సుఖాన్ని అందించడమే మగతనమా? ప్రేమించిన అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకోవడం మగతనమా? అన్న విషయాలకు సరైన సమాధానమిచ్చే కథ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఒక బోల్డ్‌ లైన్‌కు లవ్‌, ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి క్లీన్‌గా చెప్పారు. ఫస్టాప్‌ అంతా తల్లీకొడుకు మధ్య ప్రేమ, అనుబంధం, మరోవైపు హీరోహీరోయిన్‌లపై లవ్‌ ట్రాక్‌, టామ్‌ అండ్‌ జెర్రీ ఫైట్‌లా సరదాగా సాగుతుంది. పెళ్లికి రెడీ అయిన‌ సమయంలో కథ టర్న్‌ అవుతుంది. ఇప్పుడీ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన‌ 20 రోజుల లోపే ఈ టీవీ విన్‌ (Etvwin) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ఎవ‌రైతే థియేట‌ర్ల‌లో మిస్స‌య్యారో ఇప్పుడు ఇంట్లోనే చూసేయండి.

Updated Date - Oct 03 , 2024 | 04:38 PM