OTTలో తెలుగులోనూ ఆకట్టుకుంటున్న.. రీసెంట్ మలయాళ ఎమోషనల్ కామెడీ డ్రామా
ABN, Publish Date - Jun 09 , 2024 | 06:46 PM
తాజాగా ఓటీటీలోకి వచ్చిన మలయాళ డ్రామా చిత్రం వర్షంగళ్కు శేషం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ హీరోగా నటించగా ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా దాదాపు రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
తాజాగా ఓటీటీలోకి వచ్చిన మలయాళ డ్రామా చిత్రం వర్షంగళ్కు శేషం (Varshangalkku Shesham) ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా దాదాపు రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) కుమారుడు ప్రణవ్ (Pranav Mohanlal) హీరోగా నటించగా నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్ (Dhyan Sreenivasan), కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ఇతర పాత్రల్లో నటించారు. గతంలో హృదయం సినిమాతో మలయాళ నాట స్టార్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు, రైటర్, సింగర్, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్ వినీత్ శ్రీనివాసన్ (Vineeth Sreenivasan) ఈ చిత్రానికి రచన, దర్శకత్వం చేశారు. ఈ ఏడాది టాప్‌గ్రాసర్ చిత్రాలలో ఈ సినిమా నిలవడమే కాకుండా సుమారు రూ.70 కోట్ల వరకు వసూళ్లు సాధించడం విశేషం.
కథ విషయానికి వస్తే.. 1970, 1990 రెండు నేపథ్యాలలో తన మిత్రుడుని వెతికే క్రమంలో ఈ సినిమా మొదలవుతుంది. కేరళలో ఓ మారుమూల పల్లెటూరులో ఉండే మురళి మంచి వయోలనిస్ట్ సంగీత దర్శకుడవ్వాలనే ఉద్దేశంతో మద్రాస్ బయలు దేరతాడు. విషయం తెలుసుకున్న మిత్రుడు వేణు కూడా మురళి వెంట మద్రాస్ వెళ్లి అక్కడి ఈర్టిస్టులు ఎక్కువగా నివాసం ఉండే కోడంబాకంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుంటారు. మురళి ఓ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వయోలిన్ వాయించే అవకాశం దక్కించుకోగా.. వేణు లైట్ బాయ్ నుంచి ఒక్కో స్టెప్ ఎదుగుతూ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి చేరుకుంటాడు.
ఈ క్రమంలో మురళి సాయంతో వేణుకు ఓ సినిమా అవకాశం రావడంతో అతను బిజీ అవుతాడు. అయితే అదే సమయంలో జరిగిన వివాదంతో మురళి వేణును విడిచి ముంబై వెళ్లి పోతాడు. తర్వాత కాలక్రమంలో ఇరవై, ముప్పై యేండ్లు గడిచి పోతాయి. చాన్సులు లేక మురళీ సంగీతం క్లాసులు చెప్పడం స్టార్ట్ చేయగా, వరుస ప్లాపులతో, వయసు మీద పడడంతో వేణుకు సినిమాలు అవకాశాలు లేక కాళీగా ఉంటాడు. ఆ సమయంలో అనుకోకుండా ఇద్దరు మిత్రులు కలుసుకుంటారు. ఆ సందర్భంలో వేణుతో మరో సినిమా డైరెక్ట్ చేయించాలని మురళి నిర్ణయించుకుంటాడు. ఈక్రమంలో చివరకు ఏమైంది, సినిమా తీయ గలిగారా, విడుదల చేయ గలిగారా, ఎలాంటి హీరో దొరికాడు, మురళీ మధ్యలోనే ఎందుకు వదిలేసి పోయాడనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతూ ఆకట్టుకుంటుంది.
అయితే.. సంగీతం ఈ సినిమాలో చాలా కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా జ్ఞాపకం అంటూ సాగే పాట మనల్ని హంట్ చేయడంతో పాటు కొన్ని సన్నివేశాలలో ఆ పాట పేరుతో వచ్చే కామెడీ అలరిస్తుంది. అంతేగాక వీరు తీయబోయే సినిమాలోకి హీరోగా చేసేందుకు ఒప్పుకున్న క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత అప్పటివరకు స్లోగా సాగినట్లు అనిపించిన మూవీ అద్భుతమైన కామెడీతో పీక్స్‌కు వెళుతుంది. ఇప్పుడీ సినిమా సోనీ లివ్ (Sony LIV ) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంది. మంచి ఫీల్ ఉన్న చిత్రాలు, డబ్బింగ్ సినిమాలు ఇష్టపడే వారు సినిమాను మిస్ చేయకండి.