Manorathangal OTT: మ‌ల‌యాళ స్టార్స్ అంతా ఒకే తెర‌పై.. ఏం ఫ్లాన్ చేశారులే! స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచంటే?

ABN, Publish Date - Jul 16 , 2024 | 05:44 PM

మ‌లయాళ సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఆగ్ర న‌టులంతా క‌లిసి న‌టించిన అంథాల‌జీ ఒరిజిన‌ల్ సిరీస్ 'మనోరథంగల్' డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.

Manorathangal

మ‌లయాళ సినిమా ఇండ‌స్ట్రీలో మ‌రో అద్బుతం అవిష్కృతం అయింది. ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఆగ్ర న‌టులంతా క‌లిసి న‌టించిన ఓ ప్ర‌త్యేక‌మైన అంథాల‌జీ ఒరిజిన‌ల్ సిరీస్ 'మనోరథంగల్' (Manorathangal) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు గ్ర‌హీత MT వాసుదేవన్ నాయర్‌కు నివాళిగా ఇయ‌న ర‌చించిన 9 విభిన్న క‌థ‌ల‌తో ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. సోమ‌వారం (జూలై 15)న MT జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఓ ప్ర‌త్యేక ఈ వెంట్ నిర్వ‌హించి ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ సిరీస్‌లో మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి చెందిన ఆగ్ర న‌టులు మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, జరీనా, బిజు మీనన్, కైలాష్, ఇంద్రన్స్, నేదుముడి వేణు, ఎంజీ పనికర్, సురభి లక్ష్మి, ఇంద్రజిత్, అపర్ణ బాలమురళి, శాంతికృష్ణ, జాయ్ మాథ్యూ, పార్వతి తిరువోతు, హరీష్ ఉత్తమన్, మధు, ఆసిఫ్ అలీ వంటి మ‌హామ‌హులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించగా ప్రియదర్శన్, రంజిత్, శ్యామప్రసాద్, జయరాజన్ నాయర్, సంతోష్ శివన్, రతీష్ అంబట్, అశ్వతి నాయర్ వంటి వారు టాప్ డైరెక్ట‌ర్స్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ ట్రైల‌ర్ రిలీజ్ ఈ వెంట్ లో న‌టులు, ద‌ర్శ‌కుల మాట్లాడుతూ MT వాసుదేవన్ గారి గురించి త‌మ భావాల‌ను వెలిబుచ్చారు.

దర్శకుడు ప్రియదర్శన్ మాట్లాడుతూ.. "కలలు కనడం జీవితంలో ఒక భాగమని, నేను సినిమాలు తీయాలని కలలు కన్నా. ఎంటీ వాసుదేవన్ నాయర్‌తో సినిమా చేయడంతో నా కల నిజమైంది.ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. ఇది నా 97వ చిత్రం. నేను ఎం.టి. వాసుదేవన్ నాయర్‌తో ఒక చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నించాను. మనోరథంగళ్‌లో రెండు కథలకు డైరెక్షన్ చేశాను. ఈ కలను నిజం చేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని అన్నారు. ఇంద్రజిత్ మాట్లాడుతూ.. ‘ఎమ్‌టి వాసుదేవన్ నాయర్ స్క్రిప్ట్‌లో హీరోగా నటించే అవకాశం మళ్లీ వచ్చింది. ఆయన కథలో నటించడం ఇది రెండో సారి. నేను ఇందులో కదల్‌క్కట్టు అనే భాగంలో కనిపిస్తాను. ఎమ్‌టి సార్ రాసిన బంధనం అనే చిత్రంలో మా నాన్న కూడా నటించారు’ అని అన్నారు.


మమ్ముట్టి మాట్లాడుతూ.. ‘ఈ సాయంత్రం మలయాళ సినిమా ఇండ‌స్ట్రీకి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మన పరిశ్రమలో ఇలాంటి వెబ్ సిరీస్‌లు రావడం చాలా అరుదు. నాకు ఎం.టి. వాసుదేవన్ నాయర్‌తో సన్నిహిత సంబంధం ఉంది. సమకాలీన సాహిత్యం, రచనల్లో ఎం.టి. పరిజ్ఞానం విశేషమైనది. ఆయన ఇటీవల నాకు ఇచ్చిన పుస్తకాన్ని నేను చదవలేకపోయా, నా కుమార్తె ఆ పుస్తకాన్ని బాగా ఇష్ట పడిందని అన్నారు. ఇప్ప‌టి తరం అభిరుచులకు అనుగుణంగా ఆయన రచనలు చేస్తున్నారు. మొదట్లో రంజిత్‌తో కలిసి కడుగన్నవ కథను రెండు గంటల ఫీచర్ ఫిల్మ్‌గా రూపొందించాలని ప్లాన్ చేశాం. ఈ పార్ట్‌ను శ్రీలంకలో షూట్ చేశాం. ఆయన రచనల ద్వారా మలయాళీలు సాహిత్య విలువను గ్రహించారని’ అన్నారు.

న‌టుడు బిజు మీనన్ మాట్లాడుతూ.. ‘ఎమ్‌టి సర్‌ గారి సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అదృష్టవశాత్తూ నా కల నెరవేరింది. ఎందరో లెజెండ్స్‌ని చూసి వారితో వేదిక పంచుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. ఆసిఫ్ అలీ మాట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్‌కి హాజరైనందుకు సంతోషంగా, ఎంటి సార్ రాసిన పాత్రలో నటించడానికి నాకు పదమూడు సంవత్సరాలు పట్టింది’ అని అన్నారు. న‌టి నదియా మొయిదు మాట్లాడుతూ.. ‘నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గర్వపడుతున్నాను. హరిహరన్ దర్శకత్వం వహించిన 'పంచాగ్ని' చిత్రం తర్వాత, 'షెర్లాక్' చిత్రం ద్వారా MT సర్ స్క్రిప్ట్‌లో నటించే అవకాశం నాకు లభించింది’ అని అన్నారు.

తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌లో క‌మ‌ల్‌హ‌స‌న్ MT వాసుదేవన్ నాయర్ విశిష్ట‌త‌ను తెలియ జేయ‌డంతో పాటు సిరీస్‌లోని క‌థ‌ల నేప‌థ్యం గురించి చెప్ప‌డంతో ప్రారంభిండం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంతేకాక ఇందులోని స‌న్నివేశాలను చూస్తే ఇది కూడా ఏ ఒక్క జాన‌ర్‌కు సంబంధం లేకుండా చాలా వైవిధ్య‌మైన‌ క‌థ‌ల‌తో అన్ని వ‌ర్గాల వారిన అల‌రించే విధంగా రూపొందించ‌న్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. కాగా ఈ సిరీస్‌ను ఆగ‌స్టు 15 నుంచి జీ5 (ZEE 5) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకు రానుండ‌గా మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ బాష‌ల్లోనూ అందుబాటులోకి తీసుకు రానున్న‌ట్లు జీ5 (ZEE 5) అధికారికంగా ప్ర‌క‌టించింది.

Updated Date - Jul 16 , 2024 | 05:44 PM