Matka: ఓటీటీలోకి 'మెగా' సినిమా.. అప్పుడేనా

ABN, Publish Date - Nov 30 , 2024 | 05:41 PM

ఎన్నో అంచనాల మధ్య రిలీజైన 'మట్కా' సినిమా రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.

యాక్టర్ వరుణ్‌ తేజ్‌ కథల విషయంలో సెలెక్టివ్‌గా ఉంటారు. అయితే ఇటీవల ఆయన నటించిన చిత్రాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. కాస్త కొత్తగా కనిపించాలన్న తపనతో చేసిన చిత్రం మట్కా. ‘పలాస’తో గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం, వరుణ్‌ గెటప్స్‌, ట్రైలర్స్‌ ఆసక్తి కలిగించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. జనాలు మరచిపోయినా మట్కా ఆట ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకర్షించలేకపోయింది. రిలీజైన 21 రోజుల్లోనే ప్రముఖ ఓటీటీ ఛానల్ లోకి వచ్చేసింది. ఎక్కడంటే..


బర్మా నంచి వైజాగ్‌కు శరణార్ధిగా వచ్చిన వాసు (వరుణ్‌తేజ్‌) అనే యువకుడు కథ ఇది. చిన్నప్పుడే ఓ మర్డర్‌ కేసులో జైలుకు వెళ్తాడు వాసు. జైలు వాతావరణంలో రాటు తేలిపోతాడు. జైలు నుంచి తిరిగొచ్చి విశాఖపట్నం చేరతాడు. అక్కడ పూర్ణ మార్కెట్‌లో కూలీగా పనికి కుదురుతాడు. యజమాని అపల్పరెడ్డి (అజయ్‌ ఘోష్‌)ని రక్షించి, ఆ వ్యాపారంలో షేర్‌ తీసుకుంటాడు. అక్కడి నుంచి వ్యాపారంలో ఒక్కో మెట్టు ఎక్కి మట్కా కింగ్‌ గా మారతాడు. ఈ తరుణంలో అతనికి మిత్రులతో పాటు శత్రువులు పెరుగుతారు. అతని ప్రయాణంలో నాని బాబు (కిశోర్‌), కేబీ (జాన్‌ విజయ్‌)ల వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. దాని వల్ల వాసు ఏం కోల్పోయాడు.. ఏం సాధించారు అనేది మిగిలిన కథ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 5 నుండి స్ట్రీమ్ కానుంది.


వాసు చిన్నతనంతో కథ మొదలవుతుంది. తిండికోసం పడిన గొడవతో వాసు హంతకుడిగా మారి, కారాగారానికి వెళ్లడం, అక్కడ జైలర్‌ (రవిశంకర్‌) వాసు ధైౖర్యాన్ని, బలాన్ని తెలుసుకుని అతని ద్వారా డబ్బు సంపాదించడం ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. అయితే ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. జీరోగా మొదలైన కుర్రాడు క్రైమ్‌లో అడుగుపెట్టడం స్వతహాగా పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, వ్యవస్థను శాసించే స్థాయికి ఎదగడం, కోట్లకు అధిపతి కావడం అంతా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఆడిన సినిమాలు ‘పుష్ప’, ‘కేజీయఫ్‌’ వంటి చిత్రాలు ఈకోవకు చెందినవే. వాసు విడుదలై పూర్ణ మార్కెట్‌కి రావడం, దుష్టుల్ని కొడుతూ పై ఎదగడం, ఇంట్రవెల్‌కి ముందు మట్కా ఆటని పరిచయం చేయడం ఇలా కథ సాగుతుంది. రెగ్యులర్‌ మాస్‌ కథలకు మట్కా భిన్నంగా ఉండడం, వరుణ్‌ తేజ్‌ గెటప్పులతో ఫస్టాఫ్‌ ఫర్వాలేదనిపిస్తుంది. ట్రైన్‌లో తోటి ప్రయాణికులతో మట్కా ఆడించే ఎపిసోడ్‌ బాగా తీశారు. క్లిష్టమైన ఈ ఆటను సింపుల్‌గా అర్థమయ్యేలా ఆ సీన్‌ డిజైన్‌ చేశారు. ఆ ఎఫెక్ట్‌ లేకపోతే అసలు మట్కా అంటే ఏమిటో కూడా ప్రేక్షకులకు అర్ధమయ్యేది కాదు. మట్కా ఆట ఈ చిత్రంలో కొత్త పాయింట్‌. సినిమాలో హీరోయిజాన్ని మొదటి నుంచే ఎలివేట్‌ చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. కథనంలో వేగం లేదు. ముందు ఏం జరగబోతుందో ఊహకు అందేలా ఉండటం మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఇక సెకెండాఫ్‌కు వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారిన మట్కా ఆట కట్టించేందుకు దాన్ని నడిపించే వాసును పట్టుకునేందుకు సీబీఐ చేేస ప్రయత్నాలు ఓవైపు.. అతన్ని పడగొట్టేందుకు తన ప్రత్యర్థులు వేసే ఎత్తులు మరోవైపు.. వీటన్నింటినీ హీరో ఎలా ఎదుర్కొన్నాడన్నది ద్వితీయార్థానికి కీలకం. కానీ అవేమీ అంత ఆకట్టుకునేలా లేవు. వేర్వేరుగా ఉన్న ప్రత్యర్థులు ఒక్కసారిగా హీరోపై దాడి చేయబోతే హీరో వైపు దెబ్బకు దెబ్బ అన్నట్లు ఉంటేనే సన్నివేశం రక్తి కడుతుంది. అలా లేకపోవడం ఓ మైనస్‌. హీరోగా పెద్ద స్థాయికి ఎదిగాయ హై ఇచ్చే సీన్‌ సరిగా రాసుకోకపోవడం, ఏం జరగబోతోందో ఊహకు అందేలా ఉండదం కథను స్లో చేసింది. కూతుర్ని కూర్చోబెట్టుకొని ‘మేక’ కథ చెప్పే సీన్‌ అయితే నీరసం తెప్పిస్తుంది. అందులో హీరో నెరేషన్‌ బాగా సాగాదీతలా ఉంటుంది. ఆ కథలో డెప్ట్‌ ఉంది. ఎమోషనల్‌గా ఉండాలి. కానీ భావోద్వేగం మిస్‌ అయింది. హీరోయిన్‌. హీరోల మధ్య ప్రేమకథ కూడా అంత బలంగా అనిపించలేదు. ఈ కథలో బలమైన విలన్‌ కేబీ, అమ్మోరు కాసేపు మిస్‌ అయ్యారు. చివర్లో కనిపించారు. కానీ దాని వల్ల అంత ఎఫెక్ట్‌ ఏమీ లేదు. అసలు మట్కా గేమ్‌ ఏంటనేది ఓ సాంగ్‌లో చెప్పేశారు. ఆ పాట తరవాత.. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిందంటూ ప్రధాన మంత్రి ఓ మీటింగ్‌ పెడుతుంది. మట్కా వల్ల దేశ వ్యవస్థ అంతలా ఎలా చిదికిపోయినప్పుడు కనీసం బలమైన సన్నివేశాల్లో ఆ ప్రభావం చూపించగలగాలి. అది ఎక్కడా కనిపించలేదు. యాక్షన్‌ సీన్స్‌ ఆకట్టుకున్నాయి.

Also Read-RC 16: చరణ్ వర్సెస్ మున్నా భయ్యా.. మీర్జాపూర్

Also Read-Suma Kanakala: సుమ పోస్టు చూశారా.. దీని వెనుక ఆంతర్యమేమిటి

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2024 | 05:46 PM