Abigail: ఓటీటీలో.. ఈ సినిమాను అసలు మిస్సవకండి! ఎందులో అంటే
ABN, Publish Date - Sep 29 , 2024 | 08:15 PM
ప్రతివారం చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి కానీ ఇప్పుడు మీరు చదవబోయేది.. తరువాత చూడబోయే సినిమా అందుకు పూర్తిగా విరుద్దం. డిఫరెంట్ చిత్రాలు ఇష్టపడే వారికి మాత్రం ఈ మూవీ మంచి సజేషన్.
మనం ఈ మధ్య చాలా సినిమాలు చూసి ఉంటాం.. అందులో కొన్ని తృప్తినిస్తే మరికొన్ని బాగా నిరుత్సాహా పరుస్తాయి. కానీ ఈ సినిమా అందుకు విరుద్దం. ముఖ్యంగా డిఫరెంట్ చిత్రాలు ఇష్టపడే వారికి మాత్రం ఈ మూవీ మంచి సజేషన్. ఇప్పటివరకు.. ఓ ఇంట్లో ఓ దయ్యం తిష్ట వేసుకోని ఉండడం.. అది తెలియక అక్కడికి వెళ్లిన వారికి వింత పరిస్థితులు ఎదురవడం, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనే కథ చుట్టూ అన్ని భాషల్లో వేలల్లో సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది.. తరువాత చూడబోయే సినిమా అందుకు పూర్తిగా విరుద్దం. ఆ హాలీవుడ్ సినిమా పేరు అబిగైల్ (Abigail).
గత ఏప్రిల్‌లో ధియేటర్లలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. 28 మిలియన్ డాలర్లతో రూపొంది.. 43 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు కొల్లగట్టి రికార్డు సృష్టించింది. రెండు నెలల క్రితం ఓటీటీలోకి కూడా వచ్చిన ఈ మూవీ ఇక్కడా మంచి స్పందననే రాట్టుకుంది. హర్రర్ కామెడీ జానర్‌లో వచ్చిన ఈ సినిమాకు మాట్ బెట్టినెల్లి ఓల్పిన్, టైలర్ జిల్లెట్ అనే ఇద్దరు డైరెక్టర్స్ దర్శకత్వం వహించగా మెలిస్సా బర్రెరా (Melissa Barrera), డాన్ స్టీవెన్స్ (Dan Stevens), కాథరిన్ న్యూటన్ (Kathryn Newton), విల్ కాట్లెట్ (Will Catlett) ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇక కథ విషయానికి వస్తే.. ఓ ఆడిటోరియంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న అబిగైల్ అనే అమ్మాయిని ఓ అరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి నగరానికి దూరంగా ఉన్న ఓ ఫ్యాలెస్‌లో బంధిస్తారు. ఆ తర్వాత ఆ ఇంట్లో వారికి వింత అనుభవాలు ఎదురౌతాయి. అయితే కొంచెం సమయం తర్వాత వారు కిడ్నాప్ చేసింది అమ్మాయిని కాదు ఆ రూపంలో ఉన్న రక్త పిశాచి అని తెలుస్తుంది. దీంతో అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసినప్పటికీ ఇల్లు సెంట్రల్ లాక్ అయి ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి వస్తుంది. ఈక్రమంలో ఆ పిశాచి ఆ ఇంట్లో ఉన్న వారిని ఏం చేసింది, వారూ ఎదురు పోరాటమేమైనా చేయగలిగారా, చివరకు ఎంతమంది మిగిలారు, అసలు వారిని అక్కడికి రప్పించిందెవరనే ఆసక్తికరమైన కథ కథనాలతో సినిమా సాగుతూ మంచి థ్రిల్‌ను ఇస్తుంది.
ఈ అబిగైల్ (Abigail) సినిమా జియో సినిమా ఓటీటీలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతవరకు చూడని వారు వెంటనే చూసేయండి. సినిమా ప్రారంభం అసలు కథలోకి వెళ్లడానికి పది నిమిషాలు పట్టినా ఆ తర్వాత మూవీ అంతా చాలా స్పీడ్‌గా వెళుతుంది. చివరి ఫైట్ అంతకుమించి అనే తీరున ఉంటూ ముందు నుంచి ఉన్న క్యారెక్టర్లు, ప్రత్యర్థులు అప్పటికప్పుడు మారి చాలా రసకందాయంగా ఉంటుంది. చూసే వారిని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. సినిమాలో ఎక్కడా అంతగా వల్గర్ సన్నివేశాలు, అశ్లీల దృశ్యాలు అంతగా లేవు రక్తపాతం మాత్రం అధికంగా ఉంటుంది.