12th Fail: ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా.. ఓటీటీలోకి వచ్చేసింది! డోంట్ మిస్
ABN, Publish Date - Mar 05 , 2024 | 03:44 PM
మన దేశంలో ప్రతి ఏడాది వందల సంఖ్యల్లో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. అందులో చెప్పుకో దగ్గవి, కలకాలం నిలిచేవి కొన్ని మాత్రమే అరుదుగా, ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సినవి వస్తుంటాయి. ఆ కోవకు చెందిన చిత్రమే 12th ఫెయిల్.
మన దేశంలో ప్రతి ఏడాది వందల సంఖ్యల్లో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. అందులో చెప్పుకో దగ్గవి, కలకాలం నిలిచేవి కొన్ని మాత్రమే అరుదుగా, ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సినవి వస్తుంటాయి. ఆ కోవకు చెందిన చిత్రమే 12th ఫెయిల్ (12th Fail ). బయోగ్రఫీ డ్రామా జానర్‌లో వచ్చిన ఈ హిందీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2023 ఆక్టోబర్ 27న రిలీజ్ చేశారు. ఆ తర్వాత రెండు వారాలకు తెలుగులో నవంబర్ 3న విడుదల చేశారు. రెండు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది.
1942 లవ్ స్టోరీ, పరిందా వంటి చిత్రాలకు దర్శకత్వం, మున్నాబాయ్ ఎంబీబీఎస్, పీకే, 3 ఇడియట్స్ వంటి జాతీయ ఉత్తమ చిత్రాలను నిర్మించిన విదు వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra) చాలాకాలం తర్వాత మెగా ఫోన్ చేతబట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించడం విశేషం. మనోజ్ కుమార్ శర్మ IPS, శ్రద్ధా జోషి శర్మ IRSలు తమ తీవ్రమైన పేదరికాన్ని అధిగమించి, మధ్యప్రదేశ్ చంబల్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి UPSC ప్రిపరేషన్ కోసం ఢిల్లీకి వచ్చి అక్కడ కఠిన పరిస్థితులు ఎదుర్కొని ఏ విధంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్లుగా అయ్యారనే నిజ జీవిత ఘటనల ఆధారంగా అనురాగ్ పాఠక్ అనే రచయిత రాసిన పుస్తకాన్ని ప్రేరణగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.
12వ తరగతి ఫెయిలైన (12th Fail ) మనోజ్ కుమార్ శర్మ అనే విధ్యార్థి పూట గడవడం కోసం ఆటోను నడుపుతూ ఐపీఎస్ కావాలనే తన కలను ఏ విధంగా సఫలం చేసుకున్నాడు, అదే సమయంలో తను కోచింగ్ తీసుకునే సెంటర్‌లో శ్రద్ధా జోషితో పరిచయం ఏర్పడి ఇద్దరూ తమ లక్ష్యాలను ఎలా చేరుకున్నారనే ఇతివృత్తంతో ఆద్యంతం కుటుంబ ప్రేక్షకులను ఎమోషనల్ రైడ్ చేయిస్తూ సినిమా సాగుతుంది. అక్కడక్కడ మన దేశంలోని విద్యా వ్యవస్థ తీరును ఎత్తి చూపుతుంది. కోచింగ్ సెంటర్ల వద్దకు వచ్చే లక్షలాది విద్యార్థులు, నిరుద్యోగుల అవస్థలను కళ్లకు కట్టినట్టు భావోద్వేగపూరితంగా తెరకెక్కించారు.
ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) కథానాయకుడిగా టైటిల్ రోల్ పోషించగా, మేధా శంకర్, అనంత్ వి జోషి, అన్షుమాన్ పుష్కర్ మరియు ప్రియాంషు ఛటర్జీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇప్పటికీ అక్కడక్కడ ఒకటి రెండు థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. ఈ మధ్య ప్రకటించిన ఫిలింఫేర్ ఆవార్డ్స్‌లో ఈ ఒక్క చిత్రమే 12 కేటగిరిల్లో నామినేషన్స్ పొంది బెస్ట్ ఫిలిం, యాక్టర్, డైరెక్టర్, ఎడిటర్ వంటి 7 విభాగాల్లో అవార్డులను సైతం చేసుకోవడం గమనార్హం. వచ్చే నేషనల్ అవార్డుల్లోను ఈ సినిమా హవానే ఉండబోతుందంటూ చాలా మంది క్రిటిక్స్ జోస్యం కూడా చెబుతున్నారు.
అదేవిధంగా IMDbలో 9.2 ర్యాంక్ సాధించిన అతి కొద్ది సినిమాల జాబితాలో ఈ 12th Fail చోటు సంపాదించడం గమనార్హం. ఈ మూవీ డిసెంబర్ 29 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar)లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవగా తాజాగా ఇప్పడు తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషలోనూ అందుబాటులోకి వచ్చింది. సినీ లవర్స్ ఎవరైతే ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయ్యారో వారు ఇప్పుడు మాత్రం అసలు మిస్సవకండి. ముఖ్యంగా మీ పిల్లలతో కలిసి సినిమాను తప్పక చూడండి.