Super Star Krishna: అలా గురుదక్షిణ చెల్లించుకున్న సూపర్ స్టార్..

ABN, Publish Date - Jun 23 , 2024 | 01:49 PM

చిత్ర పరిశ్రమలో కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలిసిన హీరోలు కొందరే ఉంటారు. వారిలో మొదటి వరుసలో వుండే వ్యక్తి హీరో కృష్ణ. ‘తేనెమనసులు’ చిత్రంతో తనని హీరోగా పరిచయం చేసి, వృద్ధిలోకి రావడానికి కారణమైన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును ఆదుకొని అవసర కాలంలో ‘మాయదారి మల్లిగాడు’ చిత్రం చేసి కృష్ణ గురుదక్షిణ చెల్లించుకున్నారని చెప్పాలి.

Super Star Krishna Mayadari Malligadu Poster

చిత్ర పరిశ్రమలో కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలిసిన హీరోలు కొందరే ఉంటారు. వారిలో మొదటి వరుసలో వుండే వ్యక్తి హీరో కృష్ణ (Super Star Krishna). ‘తేనెమనసులు’ చిత్రంతో తనని హీరోగా పరిచయం చేసి, వృద్ధిలోకి రావడానికి కారణమైన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు (Adurthi Subba Rao)ను ఆదుకొని అవసర కాలంలో ‘మాయదారి మల్లిగాడు’ (Mayadari Malligadu) చిత్రం చేసి కృష్ణ గురుదక్షిణ చెల్లించుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాణ సమయానికి ఆదుర్తి సుబ్బారావుకు తెలుగులో సినిమాలు లేవు. హిందీ ఫీల్డ్‌కి వెళ్లి కొన్ని చిత్రాలు చేసి దెబ్బతిని అక్కడ ఇమడలేక చెన్నై తిరిగి వచ్చారు. మళ్లీ తెలుగులో చిత్ర నిర్మాణం కొనసాగించాలని ఆదుర్తి నిర్ణయించుకున్నారు. ‘తేనె మనసులు’ (Thene Manasulu) తరహాలో అంతా కొత్తవారితో సినిమా తీయడానికి సన్నాహాలు ప్రారంభించి, హీరోగా శరత్‌ బాబుని ఎంపిక చేశారు. అయితే పరిశ్రమలోని ఆదుర్తి సుబ్బారావు శ్రేయోభిలాషులు ఆయన ప్రయత్నాన్ని వారించారు.

Also Read-Jackky Bhagnani: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్తకు ఏమైంది.. జీతాలు ఇవ్వడం లేదట!


‘ఇప్పటికే ఆర్థికంగా దెబ్బ తిన్నావ్‌. కొత్తవాళ్లతో సినిమా తీసి మళ్లీ రిస్క్‌ చేయడం ఎందుకు? నువ్వు పరిచయం చేసిన హీరో కృష్ణ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. వెళ్లి అతని డేట్స్‌ అడుగు’ అని సలహా ఇచ్చారు. సరేనని ఒక రోజు వెళ్లి కృష్ణను కలిశారు ఆదుర్తి. ఆయన అడిగిన వెంటనే వివరాలు ఏమీ అడగకుండా సినిమా చేయడానికి అంగీకరించి వెంటనే డేట్స్‌ ఇచ్చేశారు కృష్ణ. ఆ సమయంలో చాలా మంది నిర్మాతలు ఆయన డేట్స్‌ కోసం క్యూ లో ఉన్నారు. అయితే గురువు తర్వాతే ఎవరైనా అని అనుకోవడం కృష్ణ మంచితనానికి నిదర్శనం. (Superstar Krishna Greatness)


బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి కలర్‌కు

‘మాయదారి మల్లిగాడు’ చిత్రాన్ని మొదట బ్లాక్‌ అండ్‌ వైట్‌ లోనే నిర్మించాలనుకున్నారు ఆదుర్తి సుబ్బారావు. అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడితే వాళ్లు సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేయడానికి అంగీకరించారు. అయితే సినిమాలు బ్లాక్‌ అండ్‌ వైట్‌‌లోనే తీయాలని, రూ. ఎనిమిది లక్షలు మాత్రమే పెట్టుబడి పెడతామని వాళ్లు షరతు విధించడంతో ఆదుర్తి సరేనన్నారు. ఆ విషయం కృష్ణకి తెలిసి ‘నాలాంటి కొత్త వాడితోనే కలర్‌ సినిమా తీసిన గ్రేట్‌ డైరెక్టర్‌ మీరు. ఇప్పుడు బ్లాక్‌ అండ్‌ వైట్‌‌లో తీయడం ఏంటి సార్‌.. కలర్‌‌లోనే తీద్దాం. ఫిల్మ్‌ నేను ఏర్పాటు చేస్తాను’ అనడంతో ఆదుర్తి కాదనలేకపోయారు. ఆ రోజుల్లో కలర్‌ ఫిల్మ్‌ ఓపెన్‌ మార్కెట్లో లభ్యమయ్యేది కాదు. అయినా తన పరపతిని ఉపయోగించి ఫిల్మ్‌ సంపాదించారు కృష్ణ.

గళ్ల లుంగీ.. లాల్చీ

సోషల్‌ క్యారెక్టర్స్‌లో హీరో కృష్ణను చాలా విభిన్నంగా చూపించిన చిత్రం ‘మాయదారి మల్లిగాడు’. గళ్ళ లుంగీ, పల్చటి లాల్చీ, మెడలో స్కార్ఫ్‌, నడుముకి లావుపాటి బెల్ట్‌, చేతిలో కర్ర... సినిమా అంతా ఇలాంటి గెటప్‌‌లోనే కనిపిస్తారు కృష్ణ. అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించే పాత్ర ఆయనది. అందమైన రౌడీ ఇలా ఉంటాడన్న మాట అనిపించే విధంగా హీరో కృష్ణ గెటప్‌ కుదిరింది. ఆయనతో మంజుల (Manjula) కలసి నటించిన తొలి చిత్రం ఇదే. అంతకుముందు తెలుగులో కొన్ని చిత్రాల్లో ఆమె నటించినప్పటికీ హీరోయిన్‌‌గా చేసిన తొలి సినిమా ఇదే. ఈ చిత్రంలో మంజుల అందచందాలు ఆనాటి యువతరాన్ని పిచ్చెక్కించాయి. కృష్ణ పారితోషికం కాకుండా రూ. 11 లక్షలతో ‘మాయదారి మల్లిగాడు’ చిత్రం పూర్తయింది. గుంటూరు ఏరియా హక్కుల్ని తన పారితోషికంగా తీసుకున్నారు కృష్ణ. ‘మాయదారి మల్లిగాడు’ చిత్రం ఘన విజయం సాధించింది. 40 రోజులకు 13 లక్షల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రాన్ని కొన్ని కేంద్రాల్లో 49వ రోజునే పంపిణీ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్‌ తీసేయడం ఆ రోజుల్లో కృష్ణ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

-వినాయకరావు

Read Latest Cinema News

Updated Date - Jun 23 , 2024 | 02:06 PM